పొత్తులు సరే... అసలు కథ మొదలైంది ఇప్పుడే!!

Submitted by santosh on Fri, 11/09/2018 - 13:10
mahakutami politics

మిత్ర పక్షాల మధ్య పొత్తు ఓ కొలిక్కి వచ్చిన అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. అసంతృప్తుల విషయాన్ని పక్కనబెట్టినా.....ఆయా పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు సక్రమంగా జరుగుతుందా అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. గత ఎన్నికల ఓట్ల లెక్కలు ఇప్పటికే ఎలా మారాయో తెలియదు. అందులో ఎంత మేరకు కూటమి అభ్యర్థులు పొందగలుగుతారనేదే ఇప్పుడు అతి పెద్ద సవాల్ గా మారింది. 

తెలంగాణ వాదం బలంగా ఉన్న సమయంలోనూ కాంగ్రెస్, తెలుగుదేశం గణనీయ సంఖ్యలో సీట్లు సాధించగలిగాయి. తదనంతర పరిణామాల్లో రెండు పార్టీల నుంచి కూడా కొందరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు. ఆ రెండు పార్టీలు ఎమ్మెల్యేలను మాత్రమే కోల్పోయాయా ? లేకపోతే ప్రజాదరణను కూడా ఆ మేరకు నష్టపోయాయా అనే విషయం ఈ ఎన్నికల్లో తేలనుంది. అభ్యర్థి ఎవరనే దానితో సంబంధం లేకుండా ప్రతి పార్టీకి కొంత ఓటు బ్యాంక్ ఉంటుంది. ఈ ఓటు బ్యాంక్ ఈ ఎన్నికల్లో గణనీయ ప్రభావాన్ని కనబర్చనుంది. ఈ తరహా ఓటు బ్యాంకుల్లో కులం కూడా ప్రధానాంశమే. ఆయా సామాజిక వర్గాల మద్దతు ఇప్పుడు మిత్రపక్షాలకు ఒకదానికొకటి ఏ మేరకు తోడ్పడుతాయన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలతో అధికార పక్షం ఆయా సామాజిక వర్గాలకు చేరువ అయ్యే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం ఎంతవరకు విజయం సాధించిందనే అంశం ఇప్పుడు టీఆర్ఎస్ కు లబ్ధి చేకూర్చనుంది. మరో వైపున సంప్రదాయక ఓటు బ్యాంకులపై మిత్రపక్షాలకు ఏ మేరకు పట్టు ఉందనే విషయం కూడా ఎన్నికల సందర్భంగా స్పష్టం కానుంది. 

తెలంగాణలో ఏర్పడిన మహా కూటమి జాతీయ స్థాయిలోనూ ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణలో కూటమి ఏర్పాటులో కీలకపాత్ర వహించిన టీడీపీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు ఉరకలు వేస్తున్నారు. మరో వైపున కాంగ్రెస్ కూడా చంద్రబాబుతో చేతులు కలిపింది. బీజేపీ కి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఈ ఇద్దరు నాయకులు కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ఎక్కడికక్కడ ఒక మెట్టు తగ్గే వ్యూహాన్ని అవలంబిస్తున్నారు. తెలంగాణలో పొత్తుల సందర్భంగా టీడీపీ మరీ ఎక్కువ బేరసారాలు చేయకుండా సర్దుబాటు ధోరణితో వ్యవహరించింది. జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా అదే వ్యూహంతో వ్యవహరిస్తోంది. ప్రధాని అభ్యర్థి పదవిని త్యాగం చేసేందుకు కూడా ఆ పార్టీ సిద్ధపడింది. మొత్తం మీద తెలంగాణలో జరిగిన మహాకూటమి ప్రయోగం జాతీయ స్థాయిలో ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ ప్రయోగం విజయవంతమైతే....వివిధ రాష్ట్రాల్లో ఈ తరహా వ్యూహాన్ని కాంగ్రెస్ మరింతగా అమలు చేసే అవకాశం ఉంది. ఈ తరహా వ్యూహంతోనే కర్నాటకలో బీజేపీ అధికారం చేపట్టకుండా కాంగ్రెస్ అడ్డుకోగలిగింది. ఒక్కముక్కలో చెప్పాలంటే మోడీకి వ్యతిరేకంగా ఒక్కటవుతున్న పార్టీలకు తెలంగాణ రాజకీయం చుక్కాని అవుతుందంటే అతిశయోక్తి కాదు. 

English Title
mahakutami politics

MORE FROM AUTHOR

RELATED ARTICLES