అచ్చొచ్చే అచ్చంపేటలో అచ్చంగా గెలిచే వీరుడెవరు?

Submitted by santosh on Tue, 11/06/2018 - 15:24
mahakutami and trs at achampet

ఉమ్మడి మహబూబ్‍నగర్‍ జిల్లాలోని అచ్చంపేట. ఈ నియోజకవర్గంలో గెలిచి, రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తేవాలని, ఇటు టీఆర్ఎస్, అటు మహాకూటమి నేతలు నిర్విరామంగా చెమటోడుస్తున్నారు. అచ్చంపేట నుంచి కాంగ్రెస్‍ అభ్యర్థిగా వంశీకృష్ణ పేరు బాగా వినపడుతోంది. అటు టీఆర్‍ఎస్‍ అభ్యర్థి, సిట్టింగ్‍ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఇప్పటికే అచ్చంపేట మొత్తం ఒక రౌండ్ చుట్టేశారు. ఈ ఇరువురి మధ్య హోరాహోరి పోరు తప్పదని, నియోజకవర్గం ప్రజలు చర్చించుకుంటున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లోనూ వంశీకృష్ణ, గువ్వల బాలరాజుల పోటి పడ్డారు. అయితే, బాలరాజు విజయం సాధించారు. గత ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గం మొత్తంగా 1,46,768 ఓట్లు పోలవగా... టీఆర్‍ఎస్‍ అభ్యర్థి గువ్వల బాలరాజుకు 62,584 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‍ అభ్యర్థి వంశీ కృష్ణకు 50,764 ఓట్ల వచ్చి రెండో స్థానంలో నిలిచారు. ఈసారి కూడా ఈ ఇద్దరి మధ్య హోరాహోరి పోరు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

అధికార పార్టీ, సిట్టింగ్‍ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నియోజకవర్గంలో విస్త్రుతంగా పర్యటిస్తున్నారు. ఇంటింటి ప్రచారంతో దూసుకుపోతున్నారు. తమ ప్రభుత్వంలో చేసిన అభివృద్దిని ప్రజలకు వివరిస్తూ... ప్రచారాన్ని కొనసాగిస్తునే, అచ్చంపేట నియోజకవర్గానికి తాము చేసిన అభివృద్దిని, చేయాల్సిన అభివృద్దిని ఓటర్లకు వివరిస్తున్నారు గువ్వల బాలరాజు. కేసీఆర్‍ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తనను మరోసారి కాపాడతాయని గువ్వల బాలరాజు అంటున్నారు. ఐతే కాంగ్రెస్‍ తమ అభ్యర్థిని ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. ఇక్కడ టికెట్‍ ఆశించే వ్యక్తి కూడా లేకపోవడంతో, వంశీకృష్ణనే దాదాపుగా కాంగ్రెస్‍ అభ్యర్థి అని తేలిపోయింది. దీంతో ఆయన నెలరోజుల నుంచి ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. అధికార పార్టీపై వ్యతిరేకతను ప్రజలకు వివరిస్తూ ఇంటింటి ప్రచారం కొనసాగిస్తున్నారు. ఐతే  అచ్చంపేట నియోజకవర్గానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, రోడ్డు మార్గాలను నియోజకవర్గ ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారని, మద్ది మడుగు శివారులోని కృష్ణానదిపై వంతెన నిర్మిస్తే అచ్చంపేట నుంచి నాలుగు జిల్లాలకు రోడ్డు మార్గం సులువౌతుందని, ఇలాంటి అంశాలతో ప్రజల ముందుకు వెల్తున్నానని, చెబుతున్నారు వంశీకృష్ణ. సిట్టింగ్‍ ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలను బెదిరిస్తున్నారని, ఈసారి మాత్రం ప్రజలు తిరగబడతారని అంటున్నారు. 

ఇక అచ్చంపేట నియోజకవర్గానికి బీజెపి కూడా మొదటి లిస్టులోనే తమ అభ్యర్థిని ఖరారు చేసి రంగంలోకి దింపింది. బల్మూర్‍ మండల కేంద్రానికి చెందిన సివిల్‍ కాంట్రాక్టర్‍ మేడిపూర్‍ మల్లేశ్వర్‍ ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. స్థానికుడు కావడంతొ మల్లెశ్వర్‍ కూడా గట్టిపోటి ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. మొత్తానికి అచ్చంపేట నియోజకవర్గంలో టీఆర్‍ఎస్‍, కాంగ్రెస్‍, బీజేపి, మూడు పార్టీల అభ్యర్థులు హోరాహోరి ప్రచారం కొనసాగిస్తున్నారు. మరి అచ్చంపేట ప్రజలు ఎవరికి పట్టం కడతారో, ఎవరిని అసెంబ్లీకి పంపిస్తారో చూడాలి.

English Title
mahakutami and trs at achampet

MORE FROM AUTHOR

RELATED ARTICLES