ఎన్నో రాజకీయ పరిణామాలకు సజీవ సాక్ష్యం.. ఆ బిల్డింగ్‌

Submitted by arun on Wed, 08/08/2018 - 15:46
karuna

చెన్నైలోని గోపాలపురం డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ఉండే నివాసం. ఎన్నో పరిణామాలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఆయన ఇళ్లు ప్రస్తుతం మూగబోయింది. కరుణానిధి లేని ఆయన గృహం నిశ్శబ్దంగా మారింది. తన ఇంటిపై మమకారాన్ని పెంచుకున్న ఈ రాజకీయ కురవృద్ధుడు తన తదనంతరం నిరుపేదలకు ఉపయోగపడేలా ఆస్పత్రిగా మార్చాలని సంకల్పించారు. తన తల్లి పేరుపై ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి దానిని దానం చేశారు. 

చెన్నైలోని గోపాలపురం వీధి తమిళ పాలిటిక్స్‌ను ఫాలో అయ్యే వారు దాన్నంత త్వరగా మర్చిపోరు. రాజకీయాలను ఔపోసన పట్టిన కరుణానిధి నివాసం ఉండేది గోపాలపురం వీధిలోనే. ఆ ఇంటికి దేశ, రాష్ట్ర రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంది. చరిత్రలో నిలిచిపోయే ఎన్నో రాజకీయ నిర్ణయాలు ఆ ఇంటి నుంచే వెలువడ్డాయి. ఎంతో పేరు సంపాదించుకున్న గొప్ప నాయకులు కూడా ఆ ఇంటి గడప తొక్కినవారే. 

1955 లో కరుణానిధి శరభేశ్వర్‌ అయ్యర్‌ అనే వ్యక్తి నుంచి ఆ ఇంటిని 45 వేలకు కొనుగోలు చేశారు. మంత్రి కాక మునుపే ఆ ఇంటిని కొన్నట్లు స్వయంగా వెల్లడించిన కరుణ ఆ ఇళ్లు అంటే తనకిష్టం అని చెప్పేవారు. దేశంలోనే ప్రత్యేక బంగ్లానే కాకుండా సాధారణ ప్రజలుండే ఇళ్ల మధ్యలో ఉండే ముఖ్యమంత్రి ఇళ్లు తనదేనని పలు సందర్భాల్లో కరుణానిధి చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అదే ఇంట్లో ఉన్నానని కూడా కరుణ వెల్లడించారు. 

అయితే ఆ ఇంటిని 1968 లో తన కుమారులు అళగిరి, స్టాలిన్‌, తమిళరసు పేర్లపై రాసిచ్చారు. తర్వాత మనస్సు మార్చుకున్న కరుణానిధి గోపాలపురం ఇంటిని నిరుపేదలకు ఉపయోగపడేలా ఓ ఆస్పత్రిని నిర్మించాలని సంకల్పించారు. అందుకు తన తల్లిపేరుతో ట్రస్ట్‌ ఏర్పాటు చేసి ఆ ఇంటిని దానంగా ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో తండ్రి నిర్ణయానికి ఒప్పుకున్న కుమారులు 2009 లో ఆ ఇంటిని మళ్లీ కరుణానిధికే అప్పగించారు. 

దీంతో తన 87 వ యేట 2010 లో జన్మదినోత్సవాన కరుణానిధి ఆ ఇంటిని తన తల్లి పేరుతో ఏర్పాటు చేసిన "అన్నై అంజుగం ట్రస్ట్‌" కు దానంగా ఇచ్చేశారు. మరికొద్ది రోజుల్లో గోపాలపురం ఇళ్లు ఆస్పత్రిగా దర్శనమివ్వబోతోంది. నిరుపేదలకు వైద్యాన్ని అందివ్వబోతోంది. 

English Title
M Karunanidhi donated Gopalapuram house in 2010 for hospital

MORE FROM AUTHOR

RELATED ARTICLES