ఖాకీ క్రీనీడలో కిరాతకం...

Submitted by arun on Thu, 09/27/2018 - 14:30
hyd

అడుగడుగునా నిఘా నేత్రాలు, డేగ కన్నేసిన పోలీసులు, సమస్యత్మాక ప్రాంతాల్లో స్పెషల్ పార్టీ పోలీసులు, నిత్యం వాచ్ చేసే పెట్రోలింగ్ గ్రూపులు ఇన్ని ఉన్నా హైదరాబాద్‌లో హింసాత్మక ఘటనలు ఆగడం లేదు. పట్టపగలు నడిరోడ్ల మీద నెత్తురు పారుతోంది. క్షణాల్లో సమాచారం అందుకునే ఆత్యాధునిక రక్షణ వ్యవస్ధ ఉన్న రాజధాని రోడ్లపై నిత్యం కత్తులు కోలాటం చేస్తున్నాయి. 

దేశంలో అత్యాధునిక పోలీస్ వ్యవస్ధగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌లో నిత్యం ఏదో ఒక మూల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నిఘా నేత్రాలు వెంటాడుతున్నా  ఏ మాత్రం బెరుకులేని వ్యక్తులు నడిరోడ్లపై మారాణాయుధాలతో విరుచుకుపడుతున్నారు. పథకం ప్రకారం దాడులు చేస్తూ పరారీ అవుతున్నారు .

ఈ నెల 16వ తేది నగరం నడిబోడ్డున ఉన్న ఎర్రగడ్డలో ప్రేమ వివాహం చేసుకున్న కూతురిపై తండ్రి విరుచుకుపడ్డాడు. తనతో పాటు తెచ్చుకున్న కత్తితో నడిరోడ్డు మీద విరుచుకుపడి దాడి చేశాడు. విచక్షణ రహితంగా దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి చావు దగ్గరకు వెళ్లి తిరిగి వచ్చింది.  ఘటన జరిగిన ప్రాంతానికి కూతవేటు దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు రావాడానికి 20 నిమిషాల పైనే పట్టింది. 

ఎర్రగడ్డ ఘటన కళ్ల ముందు మెదులుతుండగానే నిత్యం రద్దీగా ఉండే అత్తాపూర్‌లో మరో దారుణం జరిగింది. ఓ హత్య కేసులో నిందితుడిని ప్రత్యర్ధులు అత్యంత దారుణంగా హత్య చేశారు. చుట్టూ వందలాది మంది ఉన్నా అడ్డుకునేందుకు స్ధానికులు, ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నిస్తున్నా కసితీరా నరికి చనిపోయినట్టు నిర్ధారించుకున్న తరువాతే వెళ్లిపోయారు. 

నడిరోడ్డుపై హత్య జరుగుతున్న సమయంలోనే పెట్రోలింగ్ వాహనం వచ్చినా ఏమాత్రం పట్టించుకోకుండానే వెళ్లిపోయింది. స్ధానికులు, చుట్టుపక్కల వారు కేకలు వేస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోవడం నగరంలోని శాంతి భద్రతల పరిస్ధితిని తెలియజేస్తోంది. మహా నగరంలో పది రోజుల వ్యవధిలో ఈ రెండు ఘటనలు భద్రతపరమైన వైఫల్యాలను తెరపైకి తెచ్చాయి. నడిరోడ్ల మీద ఇలా మారణాయుధాలతో నెత్తుటేర్లు పారుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారనేది ప్రశ్నార్ధకంగా మారింది. జనసామర్ధ్యంతో ఉండే రోడ్లపైనే ఇలాంటి దురాగతాలు చోటు చేసుకోవడంపై నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

English Title
Love, hate & murder

MORE FROM AUTHOR

RELATED ARTICLES