లోక్‌సభ మార్చి 5కు వాయిదా

Submitted by arun on Fri, 02/09/2018 - 14:58
 Lok Sabha

రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ లోక్‌సభలో ఏపీ ఎంపీల ఆందోళన కొనసాగింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ టీడీపీ, వైసీపీ ఎంపీలు స్పీకర్‌ పోడియం చుట్టుముట్టి నిరసన చేపట్టారు. పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నినాదాలు చేశారు. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను మార్చి 5కు వాయిదా వేశారు. విభజన హామీలు అమలు చేయాలంటూ ఐదో రోజున కూడా లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు తమ ఆందోళన కొనసాగించారు. సమావేశాలు ప్రారంభంకాగానే రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై టీడీపీ, వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగి నినాదాలు చేశారు.  ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

రోజూ సభను అడ్డుకోవడం సరికాదని స్పీకర్‌ సుమిత్రా మహాజన్ సభ్యులకు సూచించారు. అయితే సభ్యులు శాంతించలేదు. దీంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్ ఐదు నిమిషాలకే గంటపాటు వాయిదా వేశారు. 12 గంటలకు తిరిగి సమావేశాలు ప్రారంభమైనా ఏపీ ఎంపీలు తమ నిరసనలు కంటిన్యూ చేశారు. పరిస్థితి చక్కబడకపోవడంతో స్పీకర్ సభను మార్చి 5కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ ఎంపీలు నిరసన చేపట్టారు. ఏపీకి న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విభజన హామీలు అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి పాదాల సాక్షిగా ప్రధాని మోడీ తానిచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. 

చిత్తూరు ఎంపీ శివప్రసాద్ వినూత్న వేషధారణలో నిరసన తెలిపారు. వెంకన్న, విజయవాడ కనకదుర్గమ్మ తనను ఆవహించారని ఆయన చెప్పారు. వెంకటేశ్వరస్వామి సన్నిధిలో మోడీ హామీలు ఇచ్చి వాటిని మరిచిపోయారని.. ఇందుకు పార్లమెంట్‌ సాక్షిగా హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్రం లెక్కచేయడం లేదని అన్నారు. ఏపీలో కాంగ్రెస్‌కు ఏ గతిపట్టిందో.. బీజేపీకి కూడా అదే పరిస్థితే వస్తుందని హెచ్చరించారు.

విభజన హామీల అమలు కోసం వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళన చేశారు. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుకు నిధులు వంటి అంశాలపై కేంద్రాన్ని నిలదీశారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకిచ్చిన హామీలను అమలు చేయాలని వైసీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కోరుతూ ఏపీ కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీ ఏపీ భవన్‌ దగ్గర ఆందోళన జరిపారు. అంబేద్కర్‌ విగ్రహం దగ్గర ప్లకార్డులు పట్టుకుని ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, ఎంపీ కేవీపీ రామచంద్రరావు, సీనియర్ నేతలు, తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు.

English Title
lok sabha adjourned till march 5

MORE FROM AUTHOR

RELATED ARTICLES