ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు
x
Highlights

రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూలొచ్చింది. అలా షెడ్యూలొచ్చిందో లేదో... అభ్యర్థుల ఎంపికపై ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఏపీ నుంచి పెద్దల సభకు ఎవరు వెళతారన్నది...

రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూలొచ్చింది. అలా షెడ్యూలొచ్చిందో లేదో... అభ్యర్థుల ఎంపికపై ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఏపీ నుంచి పెద్దల సభకు ఎవరు వెళతారన్నది హాట్ టాపిక్. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలలో ఆశావహులు పెద్దల సభలో స్థానంపై గంపెడాశలు పెట్టుకుని అధినేతలు ఎవరివైపు మొగ్గుతారోనని ఎదురుచూస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి 3 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి కాంగ్రెస్‌ ఎంపీలు చిరంజీవి, రేణుకా చౌదరి, తెలుగుదేశం ఎంపీ దేవేందర్‌ గౌడ్‌ పదవీ విరమణ చేస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో సీట్ల కేటాయింపు కారణంగా దేవేంద్రగౌడ్‌ తెలంగాణ వ్యక్తి అయినప్పటికీ ఆయన ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎన్నికయ్యారు. ఇప్పడు ముగ్గురినీ కొత్త మొహాలనే పంపాల్సిన పరిస్థితి దీంతో అధికార, విపక్ష పార్టీలలో రాజ్యసభ సీటుకు విపరీతమైన పోటీ నెలకొంది.

పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే అధికార పార్టీ గ్యారంటీగా రెండు స్థానాలు గెలవనుంది. అయితే మూడో సీటు కోసం ఆసక్తికర పోరు సాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ స్థానం వైసీపీకి దక్కే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఆ పార్టీ నుంచి 22 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడంతో అసెంబ్లీలో ఆ పార్టీ బలం తగ్గింది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరితే మూడో స్థానం కూడా టీడీపీ ఖాతాలోనే పడే అవకాశం ఉంది. దీంతో ప్రతిపక్ష పార్టీ ఓ పక్క ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకుంటూ బలమైన అభ్యర్థిని ఎంచుకొనేందుకు కసరత్తులు ప్రారంభించింది.

ఇప్పటీకే చంద్రబాబు రాజ్యసభ అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తున్నారట. పార్టీ నేతల అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యతనిస్తూ సీట్లు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఎస్సీ, బీసీ, ఓసీ అభ్యర్థులను పెద్దలసభకు పంపించనున్నారు. అయితే చివరి వరకు పేర్లు బయటకు రావడం కష్టమేనని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఓసీ కోటాలో మరోసారి సీఎం రమేష్‌కి రాజ్యసభ సీటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు, మాధవ్ చౌదరి కూడా రాజ్యసభ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి వర్ల రామయ్య, జూపూడి ప్రభాకర్ లలో ఒకరికి చాన్స్ దక్కొచ్చని ప్రచారం జరుగుతోంది. బీసీ మహిళలైన పంచుమర్తి అనురాధ, శోభ హైమావతిల పేర్లు రాజ్యసభ రేసుకి పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. ఇదిలావుంటే, సీనియర్ నేత, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా రాష్ట్ర రాజకీయాలకు గుడ్ బై చెప్పి రాజ్యసభ వెళ్ళాలనే యోచనలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయ‌న కూడా రాజ్యస‌భ టికెట్ ఆశిస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తమకు దాదాపుగా ఖాయమైన ఒకేఒక్క రాజ్యసభ స్థానానికి వైసీపీ నెల్లూరుజిల్లాకు చెందిన వ్యాపారవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పేరు ఖాయం చేసినట్లు సమాచారం. మిగతా రాష్ట్రాల సంగతెలా ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో 6 రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు ప్రత్యేకమైనవిగా భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఇప్పటి వరకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాలు, ప్రాంతాలు అన్నీ మారిపోనున్నాయి. అన్నీ కొత్త ముఖాలే కనిపించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories