అడవి రాజాలకు ఏమైంది? అంతుచిక్కని ఈ వ్యాధి ఏంటి?

Submitted by santosh on Fri, 10/12/2018 - 15:28
lions in gujarath forest

దేశంలో గుజరాత్ లోని గిర్ అభయారణ్యంలో సింహాలు నానాటికి అంతరించిపోతున్నాయి. అడవుల్లోని మూగ జీవాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అడవిలో కార్చిర్చు, అటవీ జంతువుల వేట అశనిపాతంగా మారింది. పచ్చని అడవుల్లో జంతువుల హడావుడి తగ్గిపోతోంది. నీటి వనరులు లభించక జంతువులు దాహంతో అల్లాడిపోతున్నాయి. రోగాల బారిన పడి జంతువులు మృత్యువాత పడుతున్నాయి. అడవుల్లో సింహాలదే పెత్తనం.. సింహం అంటే దాదాపు అన్ని జంతువులు భయంతో వణికిపోతాయి. అలాంటి సింహాల పరిస్థితి నేడు  దయనీయంగా మారింది. అంతుచిక్కని వ్యాధులు అడవి రాజులను వేధిస్తున్నాయి. 

గుజరాత్‌లోని ప్రముఖ గిర్‌ అడవుల్లో సింహాలు మృత్యువాత పడుతున్నాయి. 18 రోజుల్లో 21 సింహాలు మృతి చెందాయి.  ఏదో గుర్తు తెలియని వైరస్‌, ఇన్‌ఫెక్షన్‌ సోకడంతోనే ఈ సింహాలు మృతి చెందినట్లు చెబుతున్నారు . వైరస్‌ సోకడంతో సెప్టెంబరు 12 నుంచి ఇప్పటి వరకు 21 సింహాలు మృతి చెందాయి.  మృతి చెందిన నాలుగు సింహాల్లో వైరస్‌ లక్షణాలు కనబడగా.. మరో ఆరు సింహాల్లో ప్రొటోజోవా ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు.  

పురుగుల ద్వారా ఈ ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి చెందుతున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. దల్ఖానియా రేంజ్‌ గిర్‌ అడవుల్లో ఉంటున్న సింహాలు ఎక్కువగా మృత్యువాత పడుతున్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న మరికొన్ని సింహాలు అనారోగ్యానికి గురైనట్లు అధికారులు గుర్తించారు. సేమర్ధి, దల్ఖానియా ప్రాంతం నుంచి దాదాపు 31 సింహాలను అధికారులు రెస్క్యూ కేంద్రానికి తరలించి వాటిని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం వీటి పరిస్థితి మెరుగ్గానే ఉందని ఇన్‌ఫెక్షన్‌ సోకిన లక్షణాలేవీ వీటిలో లేవని తెలిపారు. సింహాల కళేబరాలలో లభ్యమైన వైరస్‌ దేనికి సంబంధించినది అనే దానిపై వైద్యులు పరిశీలిస్తున్నారు. దల్ఖానియా రేంజ్ ప్రాంతంలో ఇన్‌ఫెక్షన్ ప్రభావం అధికంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇదే ప్రాంతంలోని పలు సింహాలు అనారోగ్యంతో ఉన్నాయని గుర్తించామని, వాటిని రెస్క్యూ కేంద్రానికి తరలించి చికిత్సను అందిస్తున్నామని తెలిపారు.  మిగతా సింహాలకు వైరస్ సోకకుండా యూఎస్ నుంచి వాక్సిన్ ను తెప్పిస్తున్నామని గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది.  

గుజరాత్ రాష్ట్రంలోని అమ్రేలి జిల్లా గిర్ అడవుల్లో సింహాల మృతికి అసలు కారణాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్   ఎట్టకేలకు కనుగొంది. గిర్ అడవుల్లో  మొత్తం 27 సింహాలు మరణించగా, ఇందులో 23 సింహాలు కెనైన్ డిస్టెంపర్ వైరస్ ప్రబలడం వల్లనే మరణించాయని ఐసీఎంఆర్ వైద్యనిపుణుల పరిశీలనలో తేలింది. మరణించిన 27 సింహాల్లో 21 సింహాల కళేబరాలను పరీక్షించగా సీడీవీ వైరస్ పాజిటివ్‌గా వచ్చింది.  

English Title
lions in gujarath forest

MORE FROM AUTHOR

RELATED ARTICLES