24గంటలు లాభమా? నష్టమా?

24గంటలు లాభమా? నష్టమా?
x
Highlights

తెలంగాణ సర్కారు నూతన సంవత్సర కానుకగా ప్రవేశపెట్టిన ఎడతెగని విద్యుత్ సరఫరాను ప్రజలు స్వాగతిస్తుండగా.. ప్రతిపక్షాలు మాత్రం విమర్శిస్తున్నాయి. జనసేన...

తెలంగాణ సర్కారు నూతన సంవత్సర కానుకగా ప్రవేశపెట్టిన ఎడతెగని విద్యుత్ సరఫరాను ప్రజలు స్వాగతిస్తుండగా.. ప్రతిపక్షాలు మాత్రం విమర్శిస్తున్నాయి. జనసేన అధినాయకుడు పవన్ కల్యాణ్.. ప్రత్యేకంగా ఈ అంశం మీదనే కేసీఆర్ ను కలిసి అభినందించగా.. కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి మాత్రం పవన్ మరింత అవగాహన పెంచుకోవాలంటున్నారు. మరోవైపు టీ-జాక్ చైర్మన్ కోదండరామ్.. ఇందులో ఏదో తిరకాసు ఉంటుందని అనుమానిస్తున్నారు.

తెలంగాణ సర్కారు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ప్రారంభించిన మరుసటి రోజే విపక్ష కాంగ్రెస్ సహా.. టీ-జాక్ అధినేత కోదండరామ్ విమర్శలు గుప్పిస్తున్నారు. కరెంటు లేక, పంటలు పాడైపోయి రైతులు దీనావస్థలో కొట్టుమిట్టాడిన తెలంగాణలో.. ఉచిత విద్యుత్ అనేది వైఎస్ హయాంలో మొదలైన ఓ శుభారంభం. ఆ 9 గంటల ఉచిత విద్యుత్ కే రైతులు వైఎస్ కు బ్రహ్మరథం పట్టారు. అయితే ఫ్రీ పవర్ ను రైతులందరూ ఒకేసారి వినియోగించుకోవడంతో.. ట్రాన్స్ ఫార్మర్ల మీద విపరీతమైన ఒత్తిడి పడిపోయి అనేక ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోయాయి. మోటార్లు కాలిపోయాయి. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా రైతులు పొలాలకు వెళ్లి నీళ్లు పారించుకునే క్రమంలో విష పురుగులు కుట్టి ప్రాణాలు కోల్పోయిన రైతుల ఉదంతాలకూ లెక్కే లేదు.

ఇక తెలంగాణ వచ్చాక నాలుగో సంవత్సరం నడుస్తున్న క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్.. నూతన సంవత్సర కానుకగా 24 గంటల ఉచతి విద్యుత్ ను రైతులకు అందజేయడం విశేషం. ఒకప్పుడు అసాధ్యంగా భావించిన ఫ్రీ పవర్ ను.. కేసీఆర్ సుసాధ్యం చేసి చూపించడంపై ఆశ్చర్యపోయిన జనసేనాని పవన్ కల్యాణ్.. స్వయంగా కేసీఆర్ ను కలిసి అభినందించారు. ఈ మధ్య కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి.. పవన్ కల్యాణ్ అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. కేసీఆర్ ను పొగడటం మాని వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. తెలంగాణ విద్యుత్ జేఏసీ నాయకుడు రఘు రాసిన పుస్తకాన్ని అవసరమైతే పంపిస్తానన్నారు. మరోవైపు కేసీఆర్ ను రైతులు 24 గంటల విద్యుత్ అడగలేదని రేవంత్ విమర్శించారు.

పవన్ కల్యాణ్ మాత్రమే గాక.. కర్నాటకలోని కాంగ్రెస్ మంత్రులు కూడా 24 గంటల విద్యుత్ ను సమర్థిస్తుండగా.. కొందరు కుహనా లీడర్లు దాన్ని పనిగట్టుకొని విమర్శిస్తున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కౌంటర్ అటాక్ చేశారు. రైతుల ఆందోళనలు, నాయకుల అనుమానాల నడుమ.. మొత్తానికి తెలంగాణ సర్కారు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోంది. అయితే ఉచిత విద్యుత్ 24 గంటలు అవసరం లేదని.. దానికి బదులు రైతుల సమస్యలు, గిట్టుబాటు ధరపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని పలువురు సూచిస్తున్నారు. ఎవరూ అడగని ఉచిత విద్యుత్ ఇవ్వడంలో రాజకీయ లబ్ధి ఉందని కాంగ్రెస్ అంటుండగా.. దీన్ని మరింత లోతుగా తరచి చూడాల్సి ఉందని కోదండరామ్ అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories