తెలంగాణ కురుక్షేత్ర సమరం... మాటలే శస్త్రాలు

Submitted by santosh on Wed, 11/28/2018 - 10:13
leaders campaign in telangana

కురుక్షేత్ర సమరం....అంతిమ దశకు చేరుకునేకొద్దీ, రసవత్తరంగా మారుతోంది. యుద్ధవీరులు రంగప్రవేశం చేసేకొద్దీ, సమరం వేడెక్కుతోంది. మాటలే తూటాలుగా, అస్త్రాలే శస్త్రాలుగా, వ్యూహాలే తంత్రాలుగా యుద్ధరంగం దుమ్మురేగుతోంది. గులాబీదళాధిపతి ఇప్పటికే, వార్‌ ఫీల్డ్‌లో కత్తితో చెలరేగిపోతుంటే, ప్రజాకూటమి దండుగా దండెత్తుతోంది. ఈ రెండు సైన్యాల మధ్య, కాషాయ కరసేన కూడా చెలరేగిపోతోంది. 

ఎన్నికల తేదీ దగ్గరపడుతున్నకొద్దీ, తెలంగాణ సమరం రసవత్తరంగా మారుతోంది. మొన్నటి వరకూ కేసీఆర్‌, ఒక్కరే నియోజకవర్గాలను చుట్టేశారు. రోజుకు ఐదు, ఆరు, తొమ్మిది ఇలా సభల సంఖ్యను పెంచుకుంటూ, అన్నింటికంటే తాము ముందు అన్నట్టుగా, జెట్‌ స్పీడ్‌తో క్యాంపెయిన్‌ చేస్తున్నారు. ఇప్పుడు మహాకూటమితో పాటు బీజేపీ జాతీయస్థాయి లీడర్లు, కీలకనేతలంతా, ప్రచారపర్వంలోకి ప్రవేశిస్తూ, పోల్‌ వార్‌ను పీక్‌ స్టేజీకి తీసుకెళుతున్నారు. కూటమి సీట్ల సర్దుబాట్లు, అభ్యర్థుల వడపోతతో ప్రచారాన్ని ఎడతెగని ఆలస్యం చేసిన మహాకూటమి, సోనియా సభతో ఒక్కసారిగా దూసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఈనెల 23న మేడ్చల్‌ సభతో, మహాకూటమికి ఊపొచ్చిందని భావిస్తోంది. యూపీఏ ఛైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఇద్దరూ పాల్గొనడం, వీరితో పాటు కూటమి నాయకులు కూడా ఆసీనులుకావడంతో, క్షేత్రస్థాయిలతో కూటమి పార్టీల శ్రేణుల ఐక్యతకు దశాదిశా చూపింది. తొలి భారీ సభ కావడంతో, ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్. కన్నబిడ్డలాంటి తెలంగాణను చూస్తుంటే, తల్లిగా కడుపు తరుక్కుపోతోందని, సోనియా గాంధీ భావోద్వేగంతో ప్రసంగించడం, పతాక శీర్షికలెక్కింది.

అన్ని పార్టీలూ సభలతో హోరెత్తిస్తుంటే, ఒంటరిగా పోటీ చేస్తున్న కమలం మాత్రం, నిజంగా ఒంటరైనట్టు అనిపించింది. అయితే బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఎంటర్‌ కావడంతో, కమలంలో కదనోత్సాహం రెట్టింపయ్యింది. పరకాల, నిర్మల్, నారాయణఖేడ్‌ సభలతో, హోరెత్తించారు. కేసీఆర్‌పై  చురకలు వేస్తూనే, మహాకూటమి, మావోయిస్టులు, మజ్లిస్‌ పార్టీపై ప్రధానంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఇక అమిత్‌ షా పర్యటన ముగిసిన తర్వాత, ప్రధాని నరేంద్ర మోడీ, రణక్షేత్రాన్ని మరింత వేడెక్కించారు. నిజామాబాద్, మహబూబ్‌ నగర్‌ సభలతో, స్తబ్దుగా ఉన్న కాషాయ కార్యకర్తల్లో జోష్‌ నింపారు. కేసీఆర్‌, కాంగ్రెస్ ‌కూటమిపై పదునైన వాగ్భానాలు సంధించారు. నోట్ల రద్దు, జీఎస్టీతో పాటు అనేక కీలక నిర్ణయాలు, వాటి ఫలితాలు, నాలుగున్నరేళ్ల తన పాలనపై, తన ప్రసంగంలో ఏమాత్రం ప్రస్తావించి ఓట్లు అడగకపోయినా, కేవలం కేసీఆర్‌, మహాకూటమి టార్గెట్‌గా విరుచుకుపడ్డారు. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం తామేనని పిలుపునిచ్చారు. నీతివంతమైన పాలన కావాలంటే, బీజేపీనే గెలిపించాలన్నారు మోడీ.

ఇలా గులాబీదళం ఒకవైపు ప్రచారవేగంతో అన్ని నియోజకవర్గాలను, ఒకటికి రెండు సార్లు చుట్టేస్తోంది. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్‌ రావు, ఇలా అగ్రనేతలంతా తలొ దిక్కుతూ తరలుతూ మోహరిస్తున్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలకు చెందిన ఇతర అతిరథ మహారథ నాయకులంతా, సంగ్రామంలోకి ప్రవేశిస్తుండటంతో, రణక్షేత్రం రసవత్తరంగా మారింది. చివరి ఘడియల్లో పోటాపోటీగా ప్రచారం చేస్తూ, ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు శర్వశక్తులూ ఒడ్డుతున్నాయి ప్రధాన పార్టీలు. రానున్న రోజుల్లో, తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం మరింతగా కదంతొక్కబోతోంది.

English Title
leaders campaign in telangana

MORE FROM AUTHOR

RELATED ARTICLES