కొడుకుని హత్య చేసిన శాస‌న‌మండ‌లి ఛైర్మన్ భార్య

Submitted by arun on Mon, 10/22/2018 - 15:35
Abhijeet Yadav Murder

సొంత కొడుకునే చంపేసిన ఘటనలో ఉత్తర్ ప్రదేశ్ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ భార్య మీరా యాదవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తన 23 ఏళ్ల కొడుకు అభిజిత్ యాదవ్‌ను తనే చంపినట్లు మీరా యాదవ్ ఒప్పుకుందని పోలీసులు వెల్లడించారు. లక్నోలోని హజరత్‌గంజ్‌లోని తన నివాసంలో ఆదివారం అతడు అనుమానాస్పదస్థితిలో మరణించినట్లు అందరూ భావించారు. కానీ కుటుంబంలోని కొంతమంది అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించడంతో అసలు విషయం బయటపడింది. అతడిని గొంతు నులిమి చంపినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడికావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. అభిజిత్ మృతికి తానే కారణమని అతడి తల్లి మీరా యాదవ్ నేరాన్ని అంగీకరించినట్లు ఈస్ట్ లక్నో ఎస్పీ సర్వేశ్ మిశ్రా వివరాలు వెల్లడించారు. నేరాన్ని అంగీకరించిన మీరా యాదవ్‌ను అరెస్ట్ చేశామని కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ‘అభిజీత్‌ రాత్రి బాగా తాగి ఇంటికొచ్చాడు. అసలు వాడికి నిద్ర పట్టనే లేదు. అందుకే వాడి ఛాతీపై బామ్‌తో మర్ధనా చేశాను. నాకు తెలిసి వాడు ఇక ఎప్పుడూ నిద్ర లేవడు’ అంటూ మీరా యాదవ్‌ తమతో అన్నారని పొరుగింటి వ్యక్తి పోలీసులకు తెలిపాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా కొడుకును తానే గొంతు నులిమి హత్య చేశానని మీరా యాదవ్‌ అంగీకరించారు. తాగిన మైకంలో కన్న కొడుకే తనతో అసభ్యంగా ప్రవర్తించినందు వల్లే ఈ దారుణానికి ఒడిగట్టానని ఆమె చెప్పారని ఎస్పీ సర్వేశ్‌ మిశ్రా పేర్కొన్నారు.

English Title
UP Lawmaker's Wife Strangles 23-Year-Old Son In Fit Of Rage: Police

MORE FROM AUTHOR

RELATED ARTICLES