నున్నటి గుండుతో దిగ్గజాలకు సవాల్ విసురుతున్న కిరణ్ కుమార్

Submitted by admin on Wed, 12/13/2017 - 14:41

చూడ్డానికి తళతళ మెరుస్తాయ్‌. వెంటనే కొనాలనిపిస్తాయ్‌. సెలబ్రిటీలు ఊదరగొట్టేస్తుంటారు. యాడ్స్‌లో ఊపేస్తుంటారు. చేతిలో కాసులు లేకపోయినా ఆ క్షణమే కొనాలిపించేలా తియ్యగా మాట్లాడేస్తుంటారు. కానీ ఒక్కటే డైలమా? ఎవరు చెప్పింది కొనాలి.? ఎవరి మాటలో నిజమెంత? సినీ తారలకు, హీరోలకు నగల నాణ్యతపై ఎంతవరకు అవగాహన ఉందంటున్నారు 
కస్టమర్లు. తమ కన్ఫూజన్‌‌ను ఎవరు తీరుస్తారని ప్రశ్నిస్తున్నారు.

రోజు టీవీల్లో మనకు కనిపించే మొహం. పరిచయం ఉన్న వ్యక్తా... అనిపించే రూపం. నున్నగా గొరిగిన తళతళలాడే గుండు. మొహంలో చెక్కు చెదరని చిరునవ్వు. ఒక వ్యాపార సంస్థ అధినేత తన కస్టమర్లతో ముచ్చటిస్తున్నట్టుగా వస్తున్న ఈ యాడ్‌ లలిత జ్యుయెలరీ యాడ్స్ అని అర్థమైంది కదా. ఇతని పేరు కిరణ్ కుమార్. తమ సంస్థలోనే నగ ఎందుకు కొనాలో అర్థమయ్యేలా చెబుతాడు. సవాళ్లు విసురుతాడు. ఎస్టిమేట్‌ స్లిప్‌, ఫోటో తీసుకొని కంపైర్‌ చేసుకోమంటాడు. అంటే తన సంస్థకు తానే బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారాడు. ఇలా పెద్ద పెద్ద బంగారు నగల దుకాణాలకు సవాల్ విసురుతున్నాడు. 
 మరి ఈ సూత్రాన్ని మిగిలిన బడా నగల దుకాణాలు ఎందుకు విస్మరించాయ్‌.? అంటే వారిపై వారికి నమ్మకం లేదనా? అంత నమ్మకం లేనిది తమను ఎలా ఆకట్టుకోగలుగుతారు.? ఇవీ వినియోగదారులు వేస్తున్న ప్రశ్నలు. 
కల్యాణ్‌ జ్యువెల్లరీనే తీసుకుందాం. వన్‌ ఆఫ్‌ ద బిగ్గెస్ట్ జ్యువెల్లరీ షాప్‌ ఇది. కానీ దీనికి బ్రాండ్‌ అంబాసిడర్‌ కింగ్‌ నాగార్జున. తాను ఇక్కడే కొంటున్నాను కాబట్టి... మీరూ ఇక్కడే కొనండి అంటూ ప్రచారం చేస్తున్నాడు. అసలు నాగార్జున కల్యాణ్‌ జ్యువెల్లరీలోనే నగలు కొన్నాడన్న దానికి ఆధారాలేమిటని ప్రశ్నిస్తున్నారు వినియోగదారులు. 
 ఇలాగే... జీఆర్‌టీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నయనతార వ్యవహరిస్తున్నారు. జీఆర్‌టీలోనే నగలు నాణ్యమైనవని ఏ ఆధారంతో నయనతార పబ్లిసిటీ  చేస్తుందంటున్నారు కస్టమర్లు. ఇక జాయ్‌ అలుక్కాస్‌కి అల్లు అర్జున్‌, కాజల్‌ బ్రాండ్‌ అంబాసిడర్లు. వీరికి నగలపై, వాటి నాణ్యతపై ఎంతవరకు అవగాహన ఉందని వారంటున్నారు. వీరు చెప్పిందే ఎందుకు కొనాలన్నది కస్టమర్ల క్వశ్చన్‌. జాస్‌ అలుక్కాస్‌కి మహేష్‌బాబు బ్రాండ్‌ అంబాసిడర్‌. ప్రిన్స్‌కి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్స్‌ ఉన్నారు. తెర మీద మహేష్‌ చెబుతుంది బావుందని జై కొడుతారు. అది సినిమా. కానీ రియల్‌ లైఫ్‌లోకి వచ్చేసరికి నగలు కొనాలని మహేష్‌ చెబితే తాము ఏ నమ్మకంతో కొనాలని ఎదురు ప్రశ్నిస్తున్నారు కస్టమర్లు. అయినా ఇవే నాణ్యమైన నగలని మహేష్‌ తమకెలా భరోసా ఇస్తారన్న అయోమయం తమను వెంటాడుతుందని అంటున్నారు.
 వీరంతా సెలబ్రిటీలు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికి జై కొడతారు. ఆ సంస్థ నగలే సూపర్‌ అంటూ ఓ తెగ పబ్లిసిటీ ఇచ్చేస్తారు. తీరా తాము ఆ నగలు కొన్నాక మోసం జరిగితే తమకు న్యాయం చేసేది పబ్లిసిటీ ఇచ్చిన సెలబ్రిటీలా? లేక సంస్థ యాజమానులా అని కస్టమర్లు డైలామాలో ఉన్నారు.

English Title
lalitha-jewellery-owner-kirankumar-success-story

MORE FROM AUTHOR

RELATED ARTICLES