పార్టీలో అంతా దొంగలు, దోపిడీదారులు తయారయ్యారు

Submitted by arun on Thu, 01/18/2018 - 17:39
Lakshmi Parvathi

ఎన్టీఆర్ వర్ధంతి రోజున టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు చేసిన వ్యాఖ్యలు.. ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఎన్టీఆర్ సమాధికి నివాళులు అర్పించేందుకు వచ్చిన లక్ష్మీపార్వతి.. గతానుభవాలు గుర్తు చేసుకోవడం.. మోత్కుపల్లి వ్యాఖ్యల దరిమిలా మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు చేసిన వ్యాఖ్యలు.. తెలంగాణ టీడీపీలో బలహీనతను మరోసారి బహిర్గతం చేశాయి. గతంలో టీఆర్ఎస్ ను, కేసీఆర్ ను అదేపనిగా తీవ్రంగా విమర్శించిన మోత్కుపల్లి.. తెలంగాణలో టీడీపీ బతకాలంటే టీఆర్ఎస్ లో విలీనం కావాలన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చడం తీవ్రదుమారం రేపుతోంది. మరోవైపు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నెమరువేసుకున్న పాత జ్ఞాపకాలు... ఆ పార్టీలో పేరుకుపోయిన అవకాశవాదులను, అత్యాశపరుల జాడలను ఎండగడుతుండడం విశేషం. 

పార్టీలో అంతా స్వార్థపరులు తయారయ్యారని, వటవృక్షం లాంటి పార్టీని నాశనం చేశారని లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఇంత హీనస్థితికి దిగజారిన వైనాన్ని ప్రశ్నించే నాథుడే లేడంటూ.. పరోక్షంగా చంద్రబాబు వల్ల కలిగిన నష్టాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు లక్ష్మీపార్వతి. 

చంద్రబాబు సహా టీడీపీలో ఇప్పుడున్న నాయకులందరూ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ద్వారా రాజకీయంగా ఎదిగినవారే కావడం విశేషం. ఎన్టీఆర్ హయాంలో కళకళలాడిన పార్టీలో చోటు చేసుకున్న అనేక నాటకీయ పర్యవసానాల కారణంగా ఆయన్ని తప్పించడం, చంద్రబాబు అధికారంలోకి రావడం.. ఆ తరువాత దాదాపు 20 ఏళ్లకే సగం తెలుగు ప్రాంతంలో కనుమరుగు అవుతుండడం వంటి అనూహ్యమైన పరిణామాలు టీడీపీలో చోటు చేసుకున్నాయి. తాజాగా మోత్కుపల్లి చేసిన కామెంట్లు కూడా రాజకీయ భవిష్యత్ ను సుస్థిరం చేసుకునే ఎత్తుగడల్లో భాగంగానే అన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్న క్రమంలో.. లక్ష్మీపార్వతి ఆవేదనాభరితమైన వ్యాఖ్యలు చేశారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

English Title
Lakshmi Parvathi fire on tdp party

MORE FROM AUTHOR

RELATED ARTICLES