‘కారు’కు బ్రేకులు.. కూటమికే లగడపాటి పట్టం

Submitted by chandram on Fri, 12/07/2018 - 21:30
Lagadapati

లగడపాటి రాజగోపాల్ అలియాస్ ఆంధ్రా ఆక్టోపస్‌. లగడపాటి ఒక్కసారి డిసైడ్ చేశారంటే ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. గతంలో ఆయన చేసిన సర్వేలన్నీ నిజమయ్యాయి. అంత కచ్చితంగా ఉంటాయి. లగడపాటి సర్వేలు. ఎగ్జిట్‌ పోల్ సర్వేల స్పెషలిస్ట్ అయిన లగడపాటి తెలంగాణ ఎన్నికలపై జాతీయ ఛానళ్ళ సర్వేలకు భిన్నమైన ఫలితాలను వెల్లడించి మరింత సస్పెన్స్ పెంచేశారు. ఎన్నికల సర్వేల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలంగాణలో ఎన్నికలు ముగిసి వెంటనే ఎగ్జిట్‌ పోల్ సర్వే ఫలితాలు ప్రకటించారు. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ 35 స్థానాలకే పరిమితమవుతుందని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమికి 65 స్థానాలు వస్తాయని స్పష్టం చేశారు. అయితే 10 సీట్లు అటూ ఇటూ కావచ్చని అన్నారు. కాంగ్రెస్‌కు 58 సీట్లు రావచ్చని తెలిపారు.  

ప్రజా కూటమిలోని టీడీపీ 5 నుంచి 9 స్థానాల్లో గెలుస్తుందని లగడపాటి సర్వే తేల్చింది. 13 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ పది స్థానాల్లో టీఆర్ఎస్‌తో నేరుగా పోటీ చేసిందని టీడీపీ, టీఆర్ఎస్ మధ్య పోటీ చాలా టఫ్‌గా నడిచిందన్నారు. బీజేపీకి 7 సీట్లకు అటు ఇటుగా వస్తాయని ఆంధ్రా ఆక్టోపస్ లెక్కలు వేశారు. అలాగే మజ్లిస్ పార్టీకి 6 నుంచి 7 సీట్లు రావచ్చని ఏడుగురు ఇండిపెండెంట్లు గెలిచే అవకాశం ఉందన్నారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఖమ్మం జిల్లాలో ఒక సీటు వస్తుందని లగడపాటి తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది కాబట్టే టీడీపీ, బీజేపీ, ఇండిపెండెంట్లు 20కి పైగా స్థానాలు గెలుస్తున్నారని లగడపాటి వివరించారు. 

తెలంగాణ ఎన్నికల ఫలితాలు అంచనా వేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు లగడపాటి. అసెంబ్లీ రద్దు నాటి నుంచి తెలంగాణ ప్రజల అభిప్రాయం తరుచూ మారుతోందని చెప్పారు. అందుకే తెలంగాణలో వచ్చే రెండ్రోజుల పాటు పోస్ట్‌ పోల్‌ సర్వేలు చేస్తున్నట్లు వివరించారు. అయితే తెలంగాణ ఎన్నికలపై జాతీయ ఛానెళ్ళు విడుదల చేసిన సర్వే పలితాలను లగడపాటి తప్పు పట్టారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజల నాడిని జాతీయ మీడియా అంత సులభంగా అంచనా వేయలేదన్నారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో ఉత్తరాది ఛానెళ్ళు ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే ఉన్నాయన్నారు లగడపాటి. 
 

English Title
Lagadapati Survey telanagana2018 elections

MORE FROM AUTHOR

RELATED ARTICLES