కేటీఆర్‌ ఉత్తమ్‌ల మధ్య ట్వీట్ వార్

x
Highlights

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రి కేటీఆర్‌ మధ్య ట్విట్టర్‌ వార్‌ మొదలైంది. శాసనసభ ఎన్నికల వేళ.. మంత్రి కేటీఆర్‌ బంధువు ప్రభాకర్‌, ఆయన కింది...

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రి కేటీఆర్‌ మధ్య ట్విట్టర్‌ వార్‌ మొదలైంది. శాసనసభ ఎన్నికల వేళ.. మంత్రి కేటీఆర్‌ బంధువు ప్రభాకర్‌, ఆయన కింది ఉద్యోగులు తనతో పాటు ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ట్విట్టర్‌లో ఆరోపించారు. మరో బంధువు రాధాకృష్ణారావుకు ప్రతిపక్ష నేతల వాహనాలు తనిఖీ చేసే పని అప్పగించారని అన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాలన్న నిబంధనలను అధికారులు ఉల్లంఘిస్తున్నారని.. ఈ అంశాన్ని ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించాలని ఉత్తమ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఈ అధికారులపై చర్యలు తీసుకుంటామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ట్విటర్‌ వేదికగా హెచ్చరించారు.

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ ట్వీట్స్‌కు మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఉత్తమ్‌కుమార్‌ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నేతలు 3కోట్ల నగదు కారులో తరలిస్తూ పట్టుబడ్డారని.. ఉత్తమ్ అందుకే ఇప్పుడు ఉలిక్కి పడుతున్నారని అన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ పోలీసులు శాంతిభద్రతలను పరిరక్షిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని... ఇలాంటి అంశాలను రాజకీయం చేసి అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయొద్దని కేటీఆర్ సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories