12న కాంగ్రెస్ లోకి కొండా సురేఖ...మధ్యాహ్నం టీఆర్ఎస్ కు రాజీనామా చేసే అవకాశం

12న కాంగ్రెస్ లోకి కొండా సురేఖ...మధ్యాహ్నం టీఆర్ఎస్ కు రాజీనామా చేసే అవకాశం
x
Highlights

కొండా దంపతుల రాజకీయ భవిష్యత్‌పై మరోసారి చర్చ తెరపైకి వచ్చింది. కేసీఆర్ ప్రకటించిన లిస్ట్‌లో కొండాసురేఖ లేకపోవడం హాట్ టాపిక్ అయింది. వరంగల్ తూర్పు...

కొండా దంపతుల రాజకీయ భవిష్యత్‌పై మరోసారి చర్చ తెరపైకి వచ్చింది. కేసీఆర్ ప్రకటించిన లిస్ట్‌లో కొండాసురేఖ లేకపోవడం హాట్ టాపిక్ అయింది. వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసిన కొండా సురేఖ విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అసలేం జరుగుతోంది.? ఎవరికి టికెట్ ఇస్తారన్న దానిపై ఓరుగల్లులో చర్చనీయాంశమైంది. ఇంతకూ కొండా పరిస్థితేంటి.. కేసీఆర్ నిర్ణయం వెనక జరిగిందేమిటి.? ఇప్పుడు కొండా దంపతుల దారెటు.?

తెలుగు రాష్ట్రాలలో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న కొండా సురేఖ సొంతగూటికి చేరడం ఖాయమైనట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్‌ తరఫున వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి ఆమె తాజా మాజీ ఎమ్మెల్యే. అయితే, కేసీఆర్ అసెంబ్లీ రద్దు నిర్ణయం తర్వాత ప్రకటించిన అభ్యర్థుల లిస్ట్‌లో ఆమె పేరు లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 12 నియోజకవర్గాల్లో 11 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే అభ్యర్ధులను అందులోనూ అందరూ సిట్టింగులనే ప్రకటించారు. కేవలం వరంగల్ తూర్పుకు సంబంధించి పెండింగ్‌లో పెట్టారు. దీంతో తూర్పు టికెట్ ప్రకటించకపోవడం వెనుక ఏం జరిగిందంటూ అటు కొండా అనుచరుల్లో, ఇటు తూర్పు నియోజకవర్గ ప్రజల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

కొండా సురేఖను అధిష్టానం టికెట్ విషయంలో అడిగినప్పుడు తనకు రెండు టికెట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేసినట్లు తెలిసింది. పరకాల, వరంగల్ తూర్పు అప్పగించాలంటూ కోరడంతో అధిష్టానం కొండాకు తూర్పు తప్ప వేరే ఆప్షన్ లేదని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తూర్పులో తమ కూతురు సుస్మితాపటేల్‌ను ప్రకటించమని కొండా సురేఖ కోరితే.. కొత్తగా వారసుల పేర్లను ఇప్పట్లో ప్రకటించేది లేదని, తూర్పులో సురేఖ పేరు ప్రకటించాలా వద్దా.. అని అడిగినప్పుడు తనకు వద్దంటూ చెప్పి వచ్చేసినట్లు తెలుస్తోంది.

కొండా దంపతులు గత రెండేళ్లుగా భూపాలపల్లి, పరకాల, వరంగల్ తూర్పు టికెట్లు తమకే కావాలని, తమకే కేటాయిస్తారని చెప్పుకోవడంతో ఆయా స్థానాల్లో ఉన్న సిట్టింగులు ఆందోళనకు గురయ్యారు. ప్రధానంగా స్పీకర్ మధుసూదనాచారిని కామెంట్ చేయడం, ఆయనపై పూర్తి వ్యతిరేక ప్రచారం కొనసాగించడంతో కేసీఆర్ సీరియస్ అయ్యారు. అయినా తమ వైఖరిని మార్చకుండా మరింత దూకుడు పెంచిన కొండా దంపతులు తూర్పు నియోజకవర్గంలోనూ పార్టీ నేతలతో గొడవలకు దిగారు. కొన్ని వివాదాస్పద అంశాల్లో కేటీఆర్, హరీశ్‌రావు పేర్లను ఉపయోగించడంతో పార్టీ అధిష్టానానికి మింగుడు పడలేదు.

ముఖ్యంగా కొండా మురళి మైండ్ గేమ్ కేసీఆర్‌కు రుచించలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. తాము కాంగ్రెస్‌కు పోతామంటూ మీడియాకు లీకులిచ్చి తద్వారా పార్టీని బెదిరించాలని చూడడం కేసీఆర్ సహించలేకపోయినట్టు తెలుస్తోంది. డీఎస్‌తో ఉన్న అనుబంధం నేపథ్యంలో వీరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో కొండా దంపతులు సంప్రదింపులు జరిపినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కొండా దంపతులు కాంగ్రెస్‌ పార్టీలో చేరడం ఖాయమైందని, ఈ నెల 12న సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ఊహాగానాలు గుప్పుమంటున్నాయి. మరి కొండా దంపతులు ఎలాంటి స్టెప్ తీసుకుంటారో, వరంగల్ తూర్పు టికెట్‌ను టీఆర్‌ఎస్ ఎవరికి కేటాయిస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories