కోమటిరెడ్డి వ్యాఖ‌్యలతో కాంగ్రెస్‌లో కలకలం

x
Highlights

టీ కాంగ్రెస్‌ రెబల్‌స్టార్‌ కోమటిరెడ్డి సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారా ? పార్టీలో ఇమేజ్‌ పెంచుకునేందుకు రాజీనామాల అస్త్రం ప్రయోగించనున్నారా ?...

టీ కాంగ్రెస్‌ రెబల్‌స్టార్‌ కోమటిరెడ్డి సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారా ? పార్టీలో ఇమేజ్‌ పెంచుకునేందుకు రాజీనామాల అస్త్రం ప్రయోగించనున్నారా ? కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ కుమార్‌లను...ప్రభుత్వం ఎమ్మెల్యేలుగా గుర్తించకపోతే ఫ్యూచర్‌ ప్లానేంటీ ? కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తే...ప్రభుత్వం దిగి వస్తుందని భావిస్తున్నారా ? ఇంతకీ గాంధీభవన్‌లో ఏం జరుగుతోంది.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి...తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో రెబల్‌స్టార్‌. పార్టీలో చేరినప్పటి నుంచి మాటలతో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ...పార్టీ నేతలను విమర్శించడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయరు. పార్టీ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయాలంటూ...డిమాండ్ చేయడం కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. బహిష్కృత ఎమ్మెల్యేలకు అనుకూలంగా హైకోర్టులో తీర్పు రావడంతో...కాంగ్రెస్ తమ విజయంగా చెప్పుకుంది. అంతేకాదు న్యాయస్థానంపై నమ్మకం ఉందన్న కాంగ్రెస్‌...ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేసింది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం రేపటిలోగా ప్రభుత్వం సభ్యత్వాలను పునరుద్దరించకపోతే...పార్టీ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి వ్యాఖ‌్యలతో కాంగ్రెస్‌ పార్టీకి కొత్త తలనొప్పి మొదలయింది. రాజీనామాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై పార్టీ ఎమ్మెల్యేలు మల్లగుల్లాలు పడుతున్నారు.

అయితే వ్యక్తిగతంగా ఇమేజ్‌ పెంచుకునేందుకు...వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. ప్రభుత్వంపై ఒత్తిడి పేరుతో పార్టీ ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి రాష్ట్ర రాజకీయాలు తన చుట్టూ తిప్పుకునేలా ప్లాన్ వేశారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయ్. కోమటిరెడ్డి కోసం రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా లేమని పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు చెబుతున్నట్లు సమాచారం. పార్టీ కోసమైతే రాజీనామాలు సిద్ధమంటున్న నేతలు....వ్యక్తిగత ఎజెండా కోసం ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

కోర్టు తీర్పులు పార్టీకి అనుకూలంగా వస్తున్నా... కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే కాంగ్రెస్ నేతలకు కొత్త అనుమానాలు కలుగుతున్నాయ్. కోమటిరెడ్డి టిఆర్ఎస్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారని లోలోపల నేతలు చర్చించుకుంటున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇమేజ్‌ పెంచుకుంటారా ? లేదంటే డ్యామేజ్‌ చేసుకుంటారో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories