డేట్ ఫిక్స్ చేసిన కోదండరాం.. మార్చి 10న పార్టీ ప్రకటన!

Submitted by arun on Wed, 02/14/2018 - 14:07
kodanda

కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటానికి దిగిన ప్రొఫెసర్ కోదండరాం త్వరలో ప్రారంభించనున్న తన పార్టీ పేరు, గుర్తు, విధివిధానాలు తదితర వాటిని ప్రకటించనున్నారు. ఇప్పటికే పార్టీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయింది. తెలంగాణ ఉద్యమ సమయంలో మిలియన్ మార్చ్ నిర్వహించిన మార్చి 10న పార్టీ ప్రకటన చేయనున్నారు. భారీ బహిరంగ సభ నిర్వహించి అశేష జనవాహిని మధ్యలో పార్టీ పేరు, విధివిధానాలను ప్రకటించాలని కోదండరాం నిర్ణయించారు. తొలుత ఈనెలలోనే పార్టీకి సంబంధించి ప్రకటన చేయాలని భావించినా మిలియన్ మార్చ్ నిర్వహించిన రోజును పురస్కరించుకుని ప్రకటన చేస్తే బాగుంటుందని కోదండరాం నిర్ణయించినట్టు తెలుస్తోంది.

బహిరంగ సభలో పార్టీ పేరు, భవిష్యత్ కార్యాచరణను ప్రకటించాలని నిర్ణయించినప్పటికీ వేదిక ఎక్కడ అనే విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. హైదరాబాద్‌లో నిర్వహించాలా? లేక జిల్లాల్లో నిర్వహించాలా అనేదానిపై స్పష్టత లేదు. ఉద్యమాల పురిటిగడ్డ అయిన వరంగల్ అయితేనే బాగుంటుందని జేఏసీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్‌లో నిర్వహిస్తే అందరి దృష్టి అటు మళ్లడంతోపాటు మీడియా కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందన్న ఆలోచనలోనూ ఉన్నారు. దీంతో వేదిక విషయంలో స్పష్టత కరువైంది. ఇక, ఈ సభకు ప్రభుత్వం నుంచి అడ్డంకులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. రాజకీయ పార్టీ ప్రకటించనుండడంతో ప్రభుత్వం అడ్డు చెప్పే అవకాశం లేదని చెబుతున్నారు.

పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ దాదాపు పూర్తయిందని, తెలంగాణ జన సమితి (టీజేఎస్) పేరును కోదండరాం ఖరారు చేసినట్టు జేఏసీ నేతలు చెబుతున్నారు. అయితే సాంకేతికంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు తెలంగాణ సకల జనుల పార్టీ, తెలంగాణ ప్రజా పార్టీ, ప్రజా తెలంగాణ పార్టీ పేరుతో మరో మూడు పేర్లను కూడా రిజిస్ట్రేషన్ చేసినట్టు చెబుతున్నారు. ఇక, పార్టీ ప్రకటించడానికి ముందే జేఏసీ నుంచి కోదండరాం వైదొలగనున్నట్టు తెలుస్తోంది.

English Title
kodandram party name

MORE FROM AUTHOR

RELATED ARTICLES