నాగంకు గాలం వేయనున్న ప్రొఫెస‌ర్ కోదండ‌రాం

Submitted by arun on Fri, 02/23/2018 - 11:10

తెలంగాణ రాజకీయ బరిలోకి మరో కొత్త పార్టీ వస్తోంది. తెలంగాణ రాజకీయ జేఏసీ ఏర్పాటు చేస్తున్న ఈ పార్టీ పనులు ఢిల్లీలో వేగంగా సాగుతున్నాయి. జాక్ చైర్మన్ ప్రొ. కోదండరాం కేంద్ర ఎన్నికల కమీషన్ దగ్గర తన అనుచరుల ద్వారా పార్టీ నమోదుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఈసీ ముందు మూడు పేర్లు, పార్టీ గుర్తు ఉంచినట్టు తెలిసింది. 

పార్టీ ఏర్పాటుపై కొద్ది నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించిన జేఏసీ.. ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పార్టీ పేరు, జెండా, ఎజెండాలపై కసరత్తు పూర్తి చేసిన జాక్.. ఢిల్లీలో తమ సన్నిహితుడైన యోగేంద్ర యాదవ్, ఇతర సీనియర్ అడ్వకేట్లతో చర్చించి కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర పార్టీ పేరు నమోదుకు ప్రయత్నిస్తోంది. 

ఈనెల 20న అమెరికాలోని తమ పిల్లల దగ్గరకు వెళ్లిన ప్రొ కోదండరాం ఈ నెలాఖరుకు హైదరాబాద్ వస్తారు. ఈలోపు మూడు పేర్లతో పార్టీని నమోదు చేయాలని చూస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ జన సమితి, తెలంగాణ రైతు సమితి, తెలంగాణ సకల జనుల పార్టీ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే కొందరు ఇప్పటికే నాగం జనార్ధన్ రెడ్డి పేరుతో తెలంగాణ సకల జనుల పార్టీ నమోదైంది. అవసరమైతే ఆయన అనుమతితో తాము ఆ పేరు తీసుకొనే ఆలోచన కూడా ఉంది. పార్టీ గుర్తుగా రైతు నాగలి కావాలని ఈసీని కోరినట్టు సమాచారం.

కొందరు TRS నాయకులు, ఇతర పార్టీల నేతలు కోదండరాంతో టచ్ లో ఉన్నట్టు జేఏసీ నేతలు చెబుతున్నారు. పార్టీ పేరు, జెండా గుర్తు ఖరారు కాగానే తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఎంతో ముఖ్యమైన మార్చి 10..మిలియన్ మార్చ్ దినోత్సవం రోజునే కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించే యోచనలో కోదండరాం ఉన్నట్లు తెలుస్తోంది. అదే రోజు హైదరాబాద్ లోనో, వరంగల్ లోనో భారీ బహిరంగ సభ నిర్వహించి ఆ వేదిక నుంచి పార్టీ విధివిధానాలును ప్రకటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత దక్షిణ తెలంగాణలో రెండు, ఉత్తర తెలంగాణలో మరొక భారీ బహిరంగ సభలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించినట్లు జేఏసీ వర్గాల సమాచారం.

English Title
Kodandaram in Delhi for registration of his party

MORE FROM AUTHOR

RELATED ARTICLES