కోదండరాం ఎక్కడి నుంచి పోటీ చేస్తారు..కోదండరాంపై టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు..?

Submitted by arun on Tue, 02/20/2018 - 10:14
kod

ఇంతకాలం ఉద్యమ బాటలో ఉన్న టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం...త్వరలో రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు. మరి రాజకీయ కదన రంగంలోకి దూకుతున్న కోదండరాం ఏక్కడి నుంచి పోటీ చేస్తారు..? ఏ జిల్లాను ఎంచుకుంటారు..? ఆయనపై టీఆర్ఎస్ అభ్యర్ధి ఎవరనే ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి.

 కోదండరాం ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారు.. సేఫ్టీ జోనా..సొంత జిల్లానా..టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం కొత్తపార్టీతో సమరానికి సిద్ధమవ్వడంతో..ఆయన పోటీ చేసే నియోజకవర్గం ఏదనే చర్చ ముమ్మరంగా సాగుతోంది. కోదండరాం సొంత జిల్లా మంచిర్యాల. ఆయన అక్కడి నుంచే పోటీ చేస్తారనే ప్రచారం కొంతకాలంగా ఉంది. ఆయన తరుచూ మంచిర్యాల జిల్లాలో పర్యటించడం కూడా ఇందుకు కారణం. దీంతో కోదండరాంను ఢీకొట్టే యోధుని కోసం గులాబీ దళం అన్వేషణ మొదలు పెట్టింది.

 కోదండరాంకు మంచిర్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే  దివాకర్రావు గట్టిపోటీ ఇచ్చే అవకాశాలు లేవని టీఆర్ఎస్ అధినాయకత్వం భావిస్తోంది. దివాకర్ రావు పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండడం.. పీకల్లోతు భూ అక్రమణల ఆరోపణలతో కూరుకుపోవడంతో ఆయన సరైన అభ్యర్థి కాదని లెక్కలు వేస్తోంది. దివాకర్ రావును కోదండరాంపై పోటే చేయిస్తే...కోరి ఓటమి తెచ్చుకున్నట్లేనని గులాబీ పెద్దలు ఓ అంచనాకు వచ్చారని తెలుస్తోంది. అందుకే కోదండరాంకు ధీటైన ప్రజాబలం ఉన్న నాయకుడి కోసం వెతుకుతున్నారు. ఎలాగైనా కోదండరాంను ఓడించాలని భావిస్తున్న టీఆర్ఎస్...గతంలో మూడుసార్లు మంచిర్యాల నుంచి గెలిచిన మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి వైపు మొగ్గుచూపుతోందని సమాచారం. 

మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డికి మంచిర్యాల నియోజకవర్గంలో మంచి పట్టుంది. ప్రజల కోసం పనిచేస్తాడనే పేరుంది. గత ఎన్నికలలో ఓడిపోయిన సానుభూతి కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్న అరవింద్ రెడ్డిని ఎలాగైనా గులాబీ గూటికి చేర్చుకోవాలని టీఆర్ఎస్ అధిష్టానం యోచిస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ కీలక నేత కేకే అరవింద్ రెడ్డితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఒకవేళ కోదండరాం పార్టీ , కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరితే మంచిర్యాలను ప్రొఫెసర్ గారి కోసం హస్తం పార్టీ వదులుకోక తప్పదు. అందుకే టిక్కెట్ రాని పార్టీలో ఉండటం కంటే అధికార పార్టీలో ఉండటం ఉత్తమమని అరవింద్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నెలలోనే గులాబీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయ్యారు. ఈ నెల 24న సీఎం కేసీఆర్ సమక్షంలో కారెక్కుతారని సమాచారం. కోదండరాంను సొంత జిల్లాలో అడ్డుకోవడం ద్వారా ఆయన స్థాపించే కొత్త పార్టీకి ఆదిలోనే బ్రేక్ వేయాలనేది గులాబీ బాస్ వ్యూహంగా కనిపిస్తోంది.

English Title
Kodandaram is contesting from where

MORE FROM AUTHOR

RELATED ARTICLES