తెలంగాణలో మరో కొత్త పార్టీ

Submitted by arun on Mon, 04/02/2018 - 15:21
kodandaram

పొలిటికల్  జేఏసీ.. పొలిటికల్ పార్టీగా మారింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా వ్యవహరించిన టీ జేఏసీ రాజకీయ పార్టీగా అవతరించింది. గతంలో ఇతర రాష్ట్ర పాలకులపై పోరాడిన జేఏసీ ప్రస్తుతం సొంత రాష్ట్ర పాలకులపైనే బాణం ఎక్కుపెట్టింది. కోదండరామ్ అధ్యక్షుడిగా తెలంగాణ జనసమితి పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించింది. 

తెలంగాణలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. తెలంగాణ జన సమితి పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రొఫెసర్  కోదండరామ్ ప్రకటించారు. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రానున్నట్లు గత ఫిబ్రవరిలో ప్రకటించిన టీ జేఏసీ నాయకులు అనుభవజ్ఞులు, మేధావులతో చర్చించి నిర్ణయాన్ని అమలు పరుస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 4 న జెండా ఆవిష్కరణ ఉంటుందన్న ఆయన.. 29 న హైదరాబాద్ లో పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించనున్నట్లు వివరించారు. 

దేనికోసమైతే ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తెచ్చుకున్నామో దానికోసం ప్రస్తుత ప్రభుత్వం పనిచేయడం లేదని కోదండరామ్ తెలిపారు. రాష్ట్రంలో రైతులంతా వ్యవసాయాన్ని వదిలిపెడతామని అంటున్నారని పోస్టులు ఖాళీగా ఉన్నా నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వడం లేదని యూనివర్శిటీలకు పాలకమండలి లేదని కాంట్రాక్టర్లకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని కోదండరామ్ కేసీఆర్ సర్కారు పై ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క వ్యవస్థకూ గౌరవం లేదని బతుకుదెరువు, ఆత్మగౌరవం కోసం ఎందరో బలిదానాలు చేస్తే ఇవాళ ఏ వర్గానికి న్యాయం జరగడం లేదని కోదండరాం అన్నారు. 

తెలంగాణ జనసమితికి ఈ మధ్యే ఎన్నికల సంఘం గుర్తింపునివ్వడంతో పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చింది. అయితే టీ జేఏసీ అలాగే కొనసాగుతుందని జేఏసీ వెలుపలే పార్టీ వ్యవహారాలుంటాయన్నారు. తెలంగాణ అభివృద్ది, సామాజిక న్యాయం దిశగా తమ విధానాలుంటాయని స్పష్టం చేశారు. 

English Title
kodandaram anounces new political party

MORE FROM AUTHOR

RELATED ARTICLES