ఫ్రంట‌్‌లో వేగం...పలువురు నేతలు, సీఎంలను కలవనున్న కేసీఆర్

Submitted by arun on Thu, 04/12/2018 - 11:36
kcr

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై గులాబీ బాస్.. కేసీఆర్ సీరియస్‌గా దృష్టి సారించారు. సిద్ధాంత వైరుధ్యాలు పక్కనపెట్టి కలిసొచ్చే పార్టీలన్నిటిని కలుపుకొని పోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా సీపీఎం అగ్రనేతలతో ఫెడరల్ ఫ్రంట్ విధివిధానాలపై చర్చలు జరిపిన కేసీఆర్.. కేరళ సీఎం పినరయి విజయన్‌తో భేటీ కానున్నారు. త్వరలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. 

కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా చేసేందుకు సీఎం కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో దేశవ్యాప్తంగా వివిధ పార్టీల మద్దతు కూడగట్టిన కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం మరోసారి ఆయా పార్టీల నేత‌ల‌తో ఫోన్లో మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఫ్రంట్‌కు మద్దతు కూడగట్టేందుకు ఇప్పటికే బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. జార్ఘండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ మద్దతు తెలపడంతో పాటు ఏకంగా హైదరాబాద్ వచ్చి కేసీఆర్ ను కలిసారు. చత్తీస్‌ఘడ్ మాజీ సీఎం అజీత్ జోగి సైతం ఈ ఫ్రంట్ లో చేరేందుకు ఆసక్తి కనబరిచారు. 

ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతు కూడగట్టేందుకు కేసీఆర్ పలు రాష్టాల నేత‌ల‌ను, ముఖ్యమంత్రుల‌ను కలవనున్నారు. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‌తో ఎంపీ కేశ‌వ‌రావు సమావేశమై ఫ్రంట్ విధివిధానాలపై చర్చలు జరిపారు. త్వరలో రాష్టీయ జనతాదళ్, ఎస్పీ, బీఎస్పీ, లోక్ దళ్, ఇతర పార్టీల అధినేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఏప్రిల్ 27న జరిగే పార్టీ ప్లీనరి తర్వాత ఫెడరల్ ఫ్రంట్ సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలో జాతీయ రాజకీయాల్లో అనుభవజ్ఞులతో పాటు ఇతర భాషలపై పట్టున్న నేతలను నియమించనున్నారు కేసీఆర్. 

కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో కూటమి గట్టిన సీపీఎంతో సైతం కేసీఆర్ చర్చలు జరిపారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ప్రత్యామ్నాయ విధానాల అవసరాన్ని సీఎం ఆ పార్టీ నేతల వివరించారు. కేసీఆర్ ప్రతిపాదనతో సీపీఎం నేతలు ఏకీభవించడం సానుకూల సూచన అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

భవిష్యత్ రాజకీయ అవసరాల దృష్ట్యా సీపీఎంతో సత్సంబంధాలు కొనసాగించాలని కేసీఆర్ నిర్ణయించారు. అందుకే వారడిగిన వెంటనే అపాయింట్ మెంట్ ఇవ్వడమే కాకుండా బహిరంగ సభకు సైతం అనుమతులిచ్చారు. సీపీఎం జాతీయ మహసభలకు వస్తున్న కేరళ సీఎం పినరయ్ విజయన్‌తో ఆయన భేటీ కానున్నారు. వీరి బేటీ తర్వాత ఫెడరల్ ఫ్రంట్ పై మరింత స్పష్టత రానుందనే చ‌ర్చ గులాబీ పార్టీలో జ‌రుగుతోంది. అయితే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆమెను విభేదిస్తున్న సీపీఎం ఒకే ఫ్రంట్‌లో ఎలా ఉంటారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ పార్టీల మధ్య రాజకీయ వైరం బెంగాల్‌కే పరిమితమైనందున.. కేసీఆర్ వారిద్దరిని ఒప్పించి ఒకే గూటికి తీసుకొస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

English Title
KCR's Federal Front Speed Up

MORE FROM AUTHOR

RELATED ARTICLES