మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి.. ప్రజల ఆశీర్వాదం ఆయనకే

మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి.. ప్రజల ఆశీర్వాదం ఆయనకే
x
Highlights

తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. ఫలితాలకు కొన్ని గంటల ముందు పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. అటు మహా కూటమి నేతలు ఇటు టీఆర్ ఎస్ లీడర్లు...

తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. ఫలితాలకు కొన్ని గంటల ముందు పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. అటు మహా కూటమి నేతలు ఇటు టీఆర్ ఎస్ లీడర్లు సంచలనాలకు తెరలేపుతున్నారు. ఇక హంగ్ వస్తుందనే ఊహాగానాల ననేపథ్యంలో ఎంఐఎం పొలిటికల్ గా సూపర్ యాక్టివ్ అవుతోంది. ప్రగతి భవన్ కు వచ్చిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తో దాదాపు మూడు గంటలపాటు చర్చలు జరపడం రాజకీయంగా సంచలన రేపుతోంది.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ మరోసారి ముఖ్యమంత్రి కానున్నారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ జోస్యం చెప్పారు. ప్రజా తీర్పు కేసీఆర్‌కు అనుకూలంగా రాబోతుందన్న అసదుద్దీన్‌ తెలంగాణ ప్రజలు ఆయనతోనే ఉన్నారని చెప్పారు. తెలంగాణకు కేసీఆర్‌ రెండోసారి ముఖ్యమంత్రి అవుతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం టీఆర్‌ఎస్‌ వెంటే ఉందన్న అసదుద్దీన్‌ ప్రజల ఆశీర్వాదం కూడా కేసీఆర్‌కే ఉందన్నారు. కేసీఆర్‌ సొంత బలంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌‌కు ఎవరి మద్దతు అవసరం లేదని భారీ విజయం సాధిస్తుందన్నారు. అయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా టీఆర్‌ఎస్‌కే తమ మద్దతు ఉంటుందని అసదుద్దీన్‌ స్పష్టంచేశారు.

టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవబోతున్నారంటూ ట్వీట్‌ చేసిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్వయంగా బుల్లెట్‌ నడుపుకుంటూ ప్రగతి భవన్‌కు వచ్చారు. కేసీఆర్‌తో దాదాపు మూడు గంటలపాటు సమావేశమైన అసద్‌ పోలింగ్‌ అనంతరం పరిణామాలతోపాటు పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ అభివృద్ధి, జాతి నిర్మాణంలో కేసీఆర్‌కు తాము అండగా నిలబడతామని వ్యాఖ్యానించారు. భేటీ వెనుక రహస్యాలేవీ లేవన్న ఒవైసీ అవసరం అనుకుంటే రేపు మరోసారి కేసీఆర్‌ను కలుస్తానని, అందులో తప్పేం ఉందని ప్రశ్నించారు. తమకు ఎప్పుడూ ప్రభుత్వంలో చేరాలనే ఉత్సాహం లేదన్నారు. తెలంగాణలో హంగ్‌ ఏర్పడుతుందనే ఊహాగానాల నేపథ్యంలో కేసీఆర్‌తో అసదుద్దీన్ భేటీ కావడం హాట్‌ టాపిక్‌గా మారింది. హంగ్‌ వస్తే తమతో చేరాలని ఎంఐఎంకు కాంగ్రెస్‌ ఆహ్వానం పలకడంతోనే కేసీఆర్ అప్రమత్తమై అసద్‌ను లంచ్‌కు పిలిచినట్లు తెలుస్తోంది. మిత్రపక్షమైనప్పటికీ ఎంఐఎం చేజారిపోకుండా చర్చలు జరిపినట్లు టాక్ వినిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories