కేసీఆర్‌ ఇక్కడ...ఎవరక్కడ....!! కూటమిని గట్టెక్కించే సేనాని ఎవరు?

కేసీఆర్‌ ఇక్కడ...ఎవరక్కడ....!! కూటమిని గట్టెక్కించే సేనాని ఎవరు?
x
Highlights

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత. మాటల తూటాలు పేల్చడంలో దిట్ట. ప్రత్యర్థులపై వాగ్భాణాలు సంధించడంలో తిరుగులేని వక్త. దేన్నయినా...

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత. మాటల తూటాలు పేల్చడంలో దిట్ట. ప్రత్యర్థులపై వాగ్భాణాలు సంధించడంలో తిరుగులేని వక్త. దేన్నయినా వివాదంగా మలిచి, చర్చనీయాంశంగా చేసే వ్యూహకర్త. ఎలాంటి పరిస్థితులలైనా, తనకు అనుకూలంగా మలచుకోగల నేర్పరి. రోజుల తరబడి సైలెంట్‌గా ఉన్నా, ఒక్కసారి మైక్‌ అందుకున్నాడంటే గడగడలాడించే గండరగండడు. తెలంగాణ రాష్ట్ర సమితి అంటే కేసీఆర్. కేసీఆర్ అంటే టీఆర్ఎస్. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ ఏకైక నినాదం కేసీఆర్. గులాబీ పార్టీ తిరుగులేని ఆయుధం కేసీఆర్. కేవలం కేసీఆర్‌ పేరు చెప్పి ఓట్లు అడుగుతామని ఇప్పటికే, టీఆర్ఎస్‌ నేతలు సైతం ప్రకటించారు. నిజంగా టీఆర్ఎస్ బలం, బలగం కేసీఆరే. తనకున్న సానుకూలాంశాలను బేరీజు వేసుకునే, కాన్ఫిడెన్స్‌తో ముందస్తుకు సిద్దమయ్యారు కేసీఆర్. మరి ఇంతటి బలశాలికి దీటుగా నిలిచే నాయకుడు, తెలంగాణలో ఎవరున్నారు...ఆ‍యన మాటలకు బదులిచ్చే బలమైన లీడర్‌ ఎవరున్నారు...కేసీఆర్ వర్సెస్‌ ఎవరక్కడగా సాగుతున్న ఈ సమరంలో, ఆయనకు దీటైన సేనాధిపతి ఎవరు...

కేసీఆర్ తమ నినాదమంటోంది గులాబీదళం. మరి కేసీఆర్‌ దీటుగా మహాకూటమిలో ఎవరున్నారు...కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటే గెలిపించాలని టీఆర్ఎస్ పిలుపునిస్తోంది...మరి మహాకూటమిలో సీఎం అభ్యర్థి ఎవరు...కేసీఆర్‌ మాటలకు, కేసీఆర్ వ్యూహాలకు బదులిచ్చే వాళ్లెవరున్నారు....మహా కూటమి. నాలుగు పార్టీల ఫ్రంట్. నాలుగు పార్టీలు నాలుగు దిక్కులు. నాలుగు సిద్దాంతాలు. కానీ సైద్దాంతిక విభేదాలను పక్కనపెట్టి కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు ఒక్కటయ్యాయి. అయితే, ఇక్కడే టీఆర్ఎస్‌ వ్యూహాత్మకమైన నినాదం అందుకుంది. అదే కేసీఆర్‌ ఇక్కడ ఎవరక్కడ...మరి నిజంగా ఎవరక్కడ?

మహాకూటమిలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు ఉన్నాయి. కూటమిలో పెద్దన్నగా కాంగ్రెస్‌ను గుర్తించాల్సిందే. మరి కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థిగా ఎవరంటే, అందరూ తామేనంటారు. కాంగ్రెస్‌ నిండా ముఖ్యమంత్రి అభ్యర్థులే. మరి కేసీఆర్‌కు పోటీనివ్వగల సత్తా ఉన్నా నాయకుడు ఎవరంటే....ఏంటీ సమాధానం. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. పీసీసీ అధ్యక్షుడు. ప్రస్తుతం కాంగ్రెస్‌ను అంతా తానై నడుపుతున్నాడు. ఆ‍యన ఆధ్వర్యంలోనే చేరికలు సాగుతున్నాయి. అధిష్టానం వద్దకు అదేపనిగా వెళ్తున్న నాయకుడూ ఉత్తమే. బస్సు యాత్ర పేరుతో అనేక ప్రాంతాలను ఇఫ్పటికే తిరిగేశారు. కాంగ్రెస్‌కు అత్యధిక సీట్లొస్తే తానే సీఎం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ కేసీఆర్‌ను ఢీకొట్టగల వాగ్ధాటి, వ్యూహకర్త, ఉత్తమేనా అంటే సమాధానం నెగెటివ్‌గానే ఉంటుంది. సొంత పార్టీ నేతలు, ఉత్తమ్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. వర్గపోరులో ఎవరినీ ముందు నడవనివ్వరు కాంగ్రెస్‌ నేతలు.

జానారెడ్డి. కాంగ్రెస్‌లో విశేష అనుభవమున్న నాయకుడు. వైఎస్‌ చనిపోయిన తర్వాత, సీఎం రేసులో వినిపించిన పేరు. రోశయ్య నిష్క్రమణ టైంలోనూ జానా పేరు అందరూ పలవరించారు. తనకంటే సీఎం కాగల నాయకుడు ఎవరున్నారని కూడా, 2014 ఎన్నికల టైంలో బాహాటంగానే వ్యాఖ్యానించారు జానా. ఇప్పుడూ అదే ఆలోచనలోనే ఉన్నారాయన. మల్లు భట్టి విక్రమార్క. ప్రచార కమిటీ ఛైర్మన్‌‌గా అధిష్టానం భట్టీనే నియమించింది. దీంతో రాష్ట్రమంతా కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం, ప్రచారం నిర్వహిస్తారు విక్రమార్క. కానీ భట్టి మథిరలో గెలిస్తే చాలు, తన నియోజకవర్గంలో ప్రచారం చేస్తే లాభంలేదని, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి బహిరంగంగానే విమర్శించారు.

ప్రచార కమిటీ ఛైర్మన్‌గానే తననే నియమిస్తారని అనుకున్నానని, చివరకు తనకు మొండిచెయ్యి చూపారని అటు వీహెచ్‌ కూడా ఫైర్‌ అయ్యారు. ఇక రేవంత్‌ రెడ్డి. సైకిల్‌ దిగి హస్తం అందుకున్న రేవంత్‌ రెడ్డి, ఫైర్‌ బ్రాండ్‌ లీడర్. మాటల తూటాలు పేల్చగల నాయకుడు. వాగ్ధాటితో చెలరేగిపోయే నేత. కానీ కాంగ్రెస్‌లోనే సగంమంది లీడర్లు రేవంత్‌ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. అటు కేసులు కూడా వెంటాడుతున్నాయి. బలమైన నాయకుడిగా పేరున్నా, వ్యక్తిగత ప్రతికూల పరిస్థితులు రేవంత్‌ను కుదురుగా ఉండనివ్వడం లేదు. ఇదీ కాంగ్రెస్‌ పరిస్థితి. ప్రతి ఒక్కరూ సీఎం అభ్యర్థులే. ఒక వైఎస్ రాజశేఖర్‌ రెడ్డిలాంటి ధీశాలి నాయకుడు తెలంగాణ కాంగ్రెస్‌లో కనిపించడం లేదు. విజయభారం మొత్తం ఒంటిచేత్తో మోయగల పాపులర్‌ లీడరు, కాగడాపట్టి వెతికినా దొరకడం లేదు కాంగ్రెస్‌లో. అదే కాంగ్రెస్‌ లోపం. వర్గపోరే శాపం. మరి మిగతా మహాకూటమిలోనూ కేసీఆర్‌ వాగ్ధాటిని తిప్పికొట్టగల నేత ఉన్నారా?

మహాకూటమిలోని టీడీపీ, టీజేఎస్‌లోనూ, కేసీఆర్‌లాంటి సమ్మోహన నాయకుడు కనిపించడు. టీటీడీపీ నేత ఎల్‌. రమణ సౌమ్యుడు. మితభాషి. ఇక టీజేఎస్‌ అధినేత ప్రొఫెసర్‌ కోదండరాం, తెలంగాణ పోరాటంలో ఎగసిపడిన ఉద్యమ నాయకుడు. మహాకూటమి ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ఎవరినీ ప్రకటించలేదు. ఎన్నికల ముందు ప్రకటించదు కూడా. ఎన్నికల తర్వాత వారివారి బలాన్ని బట్టి, సీఎం రేసులో ఉన్నామని చెప్పుకునే అవకాశముంది. సీట్ల పంపకాల్లోనే పోట్లాడుకుంటున్న పార్టీలు, సీఎం అభ్యర్థిపై ఎలా కొట్టుకుంటాయో తెలీదు. ఇదే లోపం తనకు అస్త్రమంటోంది గులాబీదళం.

మొత్తం మహాకూటమిలో సీఎం అభ్యర్థి ఎవరూ లేరా అని టీఆర్ఎస్‌ ప్రశ్నిస్తోంది. కూటమి బలహీనతలనే తన ఆయుధాలుగా మలచుకుంటోంది. మళ్లీ గెలిస్తే సీఎం కేసీఆర్‌ అవుతారు, మహా కూటమి నుంచి ఎవరన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళుతోంది. కేసీఆర్‌ ఇక్కడ..ఎవరక్కడ అని టీఆర్ఎస్ నేతలు సవాల్‌ విసురుతున్నారు. అయితే, సీఎం అభ్యర్థి ముఖ్యంకాదని, టీఆర్ఎస్‌ సర్కారును గద్దె దించడమే తమ లక్ష్యమని మహాకూటమి చెప్పుకుంటోంది. అదే లక్ష్యంతో ముందుకెళతామంటోంది. ఎన్టీఆర్‌ అంతటి బలశాలిని ఓడించిన జనం ముందు, కేసీఆర్ ఎంతా అని కాంగ్రెస్‌ నేతలంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories