ఎలక్షన్‌ సెంటిమెంట్‌... కేసీఆర్‌ అదే విటమిన్‌!!

ఎలక్షన్‌ సెంటిమెంట్‌... కేసీఆర్‌ అదే విటమిన్‌!!
x
Highlights

ఇంటి నుంచి బయటికొస్తే శకునం చూస్తాం.. కొత్త బైక్‌ స్టార్ట్‌ చేయాలంటే ముహూర్తం చూస్తాం.. ఆధునిక యుగంలో కూడా ఈ సెంటిమెంట్లేంటి అనుకుంటున్నారా? ఎవరు ఫాలో...

ఇంటి నుంచి బయటికొస్తే శకునం చూస్తాం.. కొత్త బైక్‌ స్టార్ట్‌ చేయాలంటే ముహూర్తం చూస్తాం.. ఆధునిక యుగంలో కూడా ఈ సెంటిమెంట్లేంటి అనుకుంటున్నారా? ఎవరు ఫాలో అయినా కాకున్నా... టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ మాత్రం ఆ సెంటిమెంట్‌ను అప్పటి నుంచీ గౌరవిస్తున్నారు. అక్కడికి వెళ్లే కానీ.. ఓ మంచి పని ప్రారంభించరు.. ఇంతకీ కేసీఆర్‌ సెంటిమెంట్‌ ఏంటి? ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించి ఎన్నికల్లో పోరాడే శక్తినిచ్చే విటమిన్‌ ఏంటి? ఆచార వ్యవహారాలను, సంస్కృతి సంప్రదాయాలను, ముఖ్యంగా సెంటిమెంట్లను ముఖ‌్యమంత్రి కేసీఆర్‌ పక్కాగా పాటిస్తారు. ఆచరిస్తారు. ఎన్నికల సమయంలో మరీ ముఖ్యంగా తన ఇష్టదైవమైన వేంకటేశ్వరుడు కొలువైన కోనాయిపల్లి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కోనాయిపల్లి వెంకన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన తర్వాతే కేసీఆర్‌ ఏ సంచలన నిర్ణయమైనా తీసుకునే వారు అప్పట్లో.
వేంకటేశుడి ఆశీర్వాదాలు దక్కుతాయని బలంగా నమ్ముతారు.

తెలంగాణ సాధించడంలో భాగంగా ఎన్నో మొక్కులు మొక్కుకున్నారు కేసీఆర్. ఆయన ఎప్పుడూ పోటీచేసినా కూడా కోనాయిపల్లి వెంకన్న ఆలయానికి వచ్చి పూజలు చేస్తుంటారు. పాత సంప్రదాయమే కొనసాగిస్తూ ఈసారి కూడా 107 మంది అభ్యర్థుల బీ-ఫారాలను స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1983 ఎన్నికల్లో తొలిసారిగా సిద్దిపేట నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీచేసినప్పుడు ఈ ఆలయంలోనే పూజలు చేసి నామినేషన్ దాఖలు చేశారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించడంతో అప్పటినుంచి ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఈ ఆలయానికి రావడం ఆనవాయితీగా మారింది.

కోనాయిపల్లి వేంకటేశుడికి పూజలు చేసిన తర్వాతే కేసీఆర్ నామినేషన్ వేస్తుంటారు. గతంలో కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్ పార్లమెంట్ స్థానాలకు పోటీచేసిన సమయంలోనూ ఇదే పద్దతి కొనసాగించారు. 2009లో ప్రత్యేక రాష్ట్రం కోరుతూ ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించిన వేళ... అలాగే టీఆర్ఎస్ పార్టీని ప్రకటించే క్రమంలో కరీంనగర్ బహిరంగ సభకు ముందు కూడా కోనాయిపల్లి వెంకన్నను దర్శించుకున్నారు. 2014 ఎన్నికల్లోనూ గజ్వేల్ నుంచి నామినేషన్ వేసినప్పుడు ఈ ఆలయంలో పూజ చేశాకే నామినేషన్ దాఖలు చేశారు. అప్పుడు ఘన విజయం సాధించడంతో కోనాయిపల్లి వెంకన్నపై కేసీఆర్‌కు మరింత గురి కుదిరింది. అందుకే ఈసారి కూడా ఇక్కడే పూజలు చేశాకే పార్టీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందించారు. కోనాయిపల్లి వెంకన్న దయతో ఈదఫా ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ జెండా రెపరెపలాడుతుందనేది గులాబీ వర్గాల నమ్మకం.

నంగునూరు మండల పరిధిలోకి వచ్చే కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉంది. సిద్దిపేట నుంచి 12 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వాస్తుశాస్త్రం, జ్యోతిషాన్ని అధికంగా నమ్మి మొక్కులు తీర్చుతున్న కేసీఆర్ ఈసారి ఎన్నికల్లో కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. ఎప్పుడూ ఎలక్షన్లు వచ్చినా కోనాయిపల్లి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశాకే నామినేషన్ వేయడం ఆనవాయితీగా వస్తోంది. ఏమైనా కేసీఆర్‌కు కోనాయిపల్లి కోనేటిరాయుడే సెంటిమెంటు. గురి కుదిరిన ఆలయం కావడంతో.. అక్కడ అభివృద్ధికి అవకాశం ఏర్పడింది. తొలి దశలో కోటీ యాభై లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. దేవుడు కరుణించాడు. నేత వరమిచ్చాడు. ఇప్పుడు కూడా కేసీఆర్‌ అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories