ఇంతకీ ఆ ఐదుగురు ఎవరు? కేసీఆర్‌ టార్గెట్‌లో ఎందుకు పడిపోయారు?

ఇంతకీ ఆ ఐదుగురు ఎవరు? కేసీఆర్‌ టార్గెట్‌లో ఎందుకు పడిపోయారు?
x
Highlights

ఒక రాజ్యాన్ని పడగొట్టాలంటే, రాజును కాదు, అతని చతురంగ బలగాలను బలహీనం చెయ్యాలి. సేనాధిపతిని, మంత్రిని, యుద్ధవీరులను పడగొట్టాలి. వారి బలాలను నిర్వీర్యం...

ఒక రాజ్యాన్ని పడగొట్టాలంటే, రాజును కాదు, అతని చతురంగ బలగాలను బలహీనం చెయ్యాలి. సేనాధిపతిని, మంత్రిని, యుద్ధవీరులను పడగొట్టాలి. వారి బలాలను నిర్వీర్యం చేయాలి. తెలంగాణ పోరులో సకల అస్త్రాలను సంధిస్తున్న గులాబీ దళాధిపతి, తన ప్రధాన ప్రత్యర్థి పార్టీలో, ప్రధాన బలాన్ని లక్ష్యం చేసుకున్నారు. ఆ బలంలో కీలకమైన ఐదుగురిని లక్ష్యంగా చేసుకుని, ఆయుధాలు సంధిస్తున్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌ అంటే ఈ ఐదుగురే మొదట గుర్తొస్తారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రులు డీకే అరుణ, కోమటి రెడ్డి వెంకటరెడ్డి. ఇప్పుడు వీరినే టార్గెట్‌ చేసుకుని, రకరకాల అస్త్రాలు సంధిస్తోంది గులాబీదళం. వారి కంచుకోటలను బద్దలు చేసేందుకు, బలగాలను మోహరిస్తోంది....

కాంగ్రెస్‌‌లో కీలకమైన ఈ ఐదుగురు నాయకులను, శాసన సభా సమరంలో ఓడించడమే లక్ష్యంగా వ్యూహాలు వేస్తోంది గులాబీ పార్టీ. ఎలాగైనా వారిని ఓడించాలన్న లక్ష్యంతో రకరకాల ఎత్తుగడలు వేస్తోంది. స్వయంగా పార్టీ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌, ఆ ఐదుగురు పోటీ చేయబోతున్న స్థానాలపై ప్రత్యేక దృష్టిపెట్టారని, రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సిట్టింగ్ స్థానం హుజూర్‌ నగర్. ఈ ఎన్నికల్లోనూ అక్కడి నుంచి ఆయన, పోటీ చేయడం ఖాయం. ఈసారి ఉత్తమ్‌ను ఎలాగైనా నిలువరించాలని భావిస్తున్న కేసీఆర్‌, అనేక స్ట్రాటజీలకు పదునుపెడుతున్నారు. గట్టి అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు. ఇప్పటికిప్పుడు అభ్యర్థిని ప్రకటిస్తే, అసంతృప్తి పెరుగుతుంది కాబట్టి, వెయిట్‌ చేస్తున్నారు.

కాంగ్రెస్‌లో మరో బలమైన నాయకుడు జానారెడ్డి. ఈసారి కూడా నాగార్జున సాగర్‌ నుంచే జానా పోటీ చేయడం ఖాయం. టీఆర్ఎస్‌ అభ్యర్థిగా నోముల నర్సింహయ్య పోటీ చేస్తున్నారు. 2014లో జానా చేతిలో ఓడిపోయిన నోములను, ఈసారి ఎలాగైనా గెలిపించాలన్న పట్టుదలతో ఉన్నారు కేసీఆర్. జానాను ఓడించి, కాంగ్రెస్‌ ఆత్మస్థైర్థ్యాన్ని దెబ్బతీయాలని స్కెచ్‌ వేస్తున్నారు. అందుకు కోసం నాగార్జున సాగర్‌పై, వీలైనప్పుడల్లా దృష్టిపెడుతున్నారు కేసీఆర్. నాగార్జునసాగర్‌లో బలమైన యాదవ సామాజిక వర్గం ఓట్లపై గురిపెట్టారు. యాదవులతో పాటు రెడ్డి సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకోగలిగితే ఈ సారి నాగార్జునసాగర్‌లో కొత్త చరిత్ర సృష్టించడం ఖాయమని, నోములకు ధైర్యం నూరిపోస్తున్నారు కేసీఆర్. అంతేకాదు, నరసింహయ్య అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న రెడ్డి సామాజిక వర్గ నేతలను కేటీఆర్‌ పిలిపించుకుని మాట్లాడారు. అందరూ ఒక్కటై నోములను గెలిపించాలని చెబుతున్నారు.

టీఆర్‌ఎస్‌ పాలనపై మాటల యుద్ధం సాగించే మరో ఫైర్‌ బ్రాండ్‌ లీడర్ రేవంత్‌ రెడ్డి. కేసీఆర్‌ మరో టార్గెట్‌ రేవంతే. కొడంగల్‌‌లో తనను ఓడించే దమ్ము ఎవరికీ లేదని, కేసీఆర్‌ నిలబడినా గెలుపు తనదేనని, రేవంత్‌ ఓ రేంజ్‌లో తొడగొడుతున్నారు. అందుకే కొడంగల్‌లో రేవంత్‌ను నిలువరించాలని కంకణం కట్టుకున్నారు కేసీఆర్. కొడంగల్‌లో కీలకమైన కాంగ్రెస్‌ నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు ఓ సీనియర్‌ నేత, వారితో మంతనాలు సాగిస్తున్నారు. రేవంత్‌కు నియోజకవర్గంలో వెన్నుదన్నుగా నిలుస్తున్నవారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే చాలామంది మంత్రులు, ఎంపీలు, కీలకమైన నాయకులు సైతం, కొడంగల్‌లో ప్రచారాన్ని హోరెత్తించారు. తమ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్‌ రెడ్డికి మద్దతుగా క్యాంపెయినింగ్ చేశారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండలో తిరుగులేని కాంగ్రెస్ ‌నాయకుడు. చుట్టుపక్కల రెండు, మూడు నియోజకవర్గాలను సైతం శాసించగల లీడర్. అందుకే కోమటిరెడ్డిపై ఫోకస్‌ పెట్టారు కేసీఆర్. 2014 ఎన్నికల్లో కోమటిరెడ్డికి గట్టిపోటీ నిచ్చిన కంచర్ల భూపాల్‌ రెడ్డిని, పార్టీలోకి చేర్చుకుని, ఈసారి టికెట్‌ ఇచ్చారు కేసీఆర్. కోమటిరెడ్డి వ్యూహాలకు దీటుగా ముందుకు సాగాలని కర్తవ్యబోధ చేశారు. ఓటర్ల సానుభూతిని ఆధారం చేసుకుని గెలవాలన్న ప్రయత్నంలో ఉన్నారు కంచర్ల. ఏ రకంగా ప్రచారం చేయాలి.. ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలి.. అన్న విషయంలో కేసీఆర్‌ వీరికి మార్గనిర్దేశం చేస్తున్నారు. ఆ నియోజకవర్గాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సీక్రెట్‌ అబ్జర్వర్లను అపాయింట్‌ చేసుకున్నారు కేసీఆర్.

గద్వాలలోనూ డీకే అరుణ, బలమైన కాంగ్రెస్‌ నాయకురాలు. గత ఎన్నికల్లో మేనల్లుడు బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, విజయానికి చేరువగా వచ్చి, స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈసారి మాత్రం గురితప్పరాదని, కృష్ణ మోహన్‌లో కసి పెంచారు కేసీఆర్. గద్వాలలోని బీసీ వర్గాల్లో మంచి పట్టున్న మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు కుటుంబం కృష్ణమోహన్‌రెడ్డికి అనుకూలంగా ప్రచారం చేస్తోంది. మరింతమందిని టీఆర్ఎస్‌లోకి ఆకర్షించాలని, కేసీఆర్‌ చెబుతున్నారు. డీకే అరుణ గద్వాల కోటను, బద్దలు చేయాలని నూరిపోస్తున్నారు.

ఈ ఐదుగురి నియోజకవర్గాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు గులాబీ అభ్యర్థులు. ఇప్పటికే ఒక దఫా క్యాంపెయిన్‌ పూర్తి చేశారు. మినీ మేనిఫెస్టో వరాలు కూడా ప్రకటించడంతో, ఇక ఇంటింటికీ తిరిగి, ఓటర్లను ఆకర్షించేందుకు సిద్దమవుతున్నారు. ఈ నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలను పిలిపించుకుని మాట్లాడి, చల్లబరిచారు కేటీఆర్‌. అసంతృప్తులను సైతం క్యాంపెయిన్‌‌లో భాగస్వాములను చేశారు. కాంగ్రెస్‌ పార్టీ కీలకమైన నేతలుగా భావిస్తున్న వీరిని వారి నియోజకవర్గం నుంచి బయటకు కాలు మోపనీయకుండా చేయాలన్నదే గులాబీ పార్టీ లక్ష్యం. తమ సొంత స్థానాల్లోనే, వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తే, మిగతా అభ్యర్థుల కోసం ప్రచారానికి దిగరని భావిస్తున్నారు కేసీఆర్. రకరకాల ఎత్తుగడలతో, వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తించాలనుకుంటున్నారు. మరి ఈ ఐదుగురి కంచుకోటలను కేసీఆర్‌ బద్దలు కొట్టిస్తాడా....కాంగ్రెస్‌ బలగాలను నిలువరిస్తాడా కేసీఆర్.....చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories