కేసీఆర్‌ సెంటిమెంట్ అస్త్రం...

Submitted by arun on Mon, 09/17/2018 - 11:02

అభ్యర్ధుల ప్రకటనతో రేగిన అసమ్మతిని చల్లార్చేందుకు టీఆర్ఎస్ అధినేత సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. పోరాడి సాధించుకున్న  రాష్ట్రంలో అధికారం కావాలంటే  కలిసి ఉందామంటూ భావోద్యేగాలను రాజేస్తున్నారు. పార్టీ అధికారంలో ఉంటేనే అందరికి న్యాయం జరుగుతుందంటూ కొత్త ఆశలు రాజేస్తూ అసమ్మతి నేతలను దారికి తెచ్చుకుంటున్నారు.  

గంటల వ్యవధిలో అసెంబ్లీని రద్దు చేసి అభ్యర్ధులను ప్రకటించిన గులాబి అధినేత కేసీఆర్‌ అసంతృప్తి, అసమ్మతివాదులను ముందే అంచనా వేశారు. పార్టీపై అలకబూనిన నేతలను బుజ్జిగించే బాధ్యతలను మంత్రులకు అప్పగిచ్చిన ఆయన కాదు కూడదు అనే వారితో స్వయంగా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన చెన్నూరు టికెట్‌ అభ్యర్ధిత్వాన్ని సెంటిమెంట్ అస్త్రంతో దారిలోకి తెచ్చారు.  అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ ఇస్తానంటూ హామి ఇస్తూనే అసమ్మతితో పార్టీ నష్టపోతే అందరం బాధపడాల్సి వస్తుందని చెప్పినట్టు సమాచారం.  

ఈ సెంటిమెంట్ సక్సెస్‌ కావడంతో  అసమ్మతి నేతలను ఒక్కొక్కరిగా పిలిచి ఇదే హితబోధ చేస్తున్నారు. అసంతృప్త నేతలతో మొదట కేటీఆర్ చర్చలు జరుపుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లోని మెజార్టీ  అసమ్మతి నేతలతో చర్చలు జరిపారు. మీ అసమ్మతి కేసీఆర్ పదవికి ఎసరు తెస్తుందని అందుకే కేసీఆర్ ను సీఎం చేసేందుకు త్యాగాలు తప్పవంటూ భావోద్వేగాన్ని రగిలిస్తున్నారు.  అప్పటికీ  దారికి రాని నేతలతో కేసీఆరే స్వయంగా మంతనాలు సాగిస్తున్నారు. కేసీఆర్‌ హామీలతో మెజార్టీ అసంతృప్త  నేతలు దారికి వచ్చారని భావిస్తున్న టీఆర్ఎస్‌ మిగిలిన వారిపై దృష్టి సారించింది. 

ప్రస్తుతానికి అసమ్మతి తగ్గినట్టే అని పించినా ప్రచారం పాతక స్థాయికి చేరిన తర్వాత తమ ప్రతాపం చూపాలని పలువురు నేతలు భావిస్తున్నట్టు సమాచారం. కేసీఆర్ సెంటమెంట్ అస్త్రం కన్నా తమ ఆత్మగౌరవం ముఖ్యమన్న ఆలోచనతో పలువురు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారట. దీంతో అసమ్మతి టెన్షన్ గులాబి పార్టీని గబారా పెడుతూనే ఉంది. పైకి గంబీరంగా కనిపించిన నేతల్లో లోలోన మాత్రం ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. 

English Title
KCR Sentiment Astra On Unhappy Leaders

MORE FROM AUTHOR

RELATED ARTICLES