పథకాలన్నీ ఎన్నికల తాయిలాలేనా? కేసీఆర్‌‌కు కలిసొచ్చిందేంటి?

Submitted by santosh on Fri, 05/11/2018 - 12:46
kcr raithubhandu

తెలంగాణ ప్రభుత్వం రైతు బంధును ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌ సర్కారు, నిరుద్యోగభృతికి నాలుగేళ్ల తర్వాత పచ్చజెండా ఊపేందుకు సిద్దమవుతోంది. అటు కర్ణాటకలో చీరలు, ఆభరణాలు, స్మార్ట్‌‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఇస్తామంటూ పార్టీలు హోరెత్తించాయి. ఈ పథకాలన్నీ ప్రజల సంక్షేమం కోసమేనా...ఎన్నికల కోసమా....పథకం వెనక పార్టీల అసలు పథకమేంటి.?

బయ్ వన్ గెట్‌ టు. 50 పర్సెంట్ డిస్కౌంట్. 40 పర్సెంట్ క్యాష్‌ బ్యాక్. ఇలాంటి ఆఫర్లు కనిపిస్తే చాలు, ప్రతి ఒక్కరూ దాని వెనక పరుగెడతారు. మాల్స్‌ ముందు క్యూకడతారు. వాటి ఉచితానుచితాలు, కండీషన్స్‌ కూడా పట్టించుకోకుండా ఎగబడతారు. ఇప్పుడు ఎన్నికల ముంగిట్లోనూ, ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో ఇవే బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తూ, పార్టీలు పోటీపడుతున్నట్టు కనిపిస్తోంది.

ఎన్నికల ముంగిట్లో రాజకీయ పార్టీలవి ఎన్ని విన్యాసాలు చేయాలో అన్నీ చేస్తాయి. అంతకంటే ఎక్కువే చేస్తాయి కూడా. అలవికాని హామీలిస్తాయి. అంతుబట్టని వాగ్ధానాలు కురిపిస్తాయి. కనివిని ఎరుగని కమ్మని పథకాలు వడ్డివారుస్తాయి. ఆచరణ సాధ్యమా...అవసరమా అని కూడా ఆలోచించవు. ఓటర్లను ఆకర్షిస్తే చాలు ప్రకటించేస్తాయి.  ఐదేళ్లలో, అసలు కొన్ని పథకాల ఊసే ఎత్తని అధికారంలో ఉన్న పార్టీ, సడన్‌గా ఎన్నికలకు ఏడాది ముందు, నగదు పథకమో, రుణ మాఫీనో ప్రకటిస్తాయి. ఇక అధికారంలోకి రావాలనుకున్న పార్టీలు కూడా, అధికారంలోకి వస్తే, అవి చేస్తాం, ఇవి చేస్తామని వాగ్ధానాలు కుమ్మరిస్తాయి. ఒక్కసారిగా వ్యతిరేక పవనాలను, సానుకూలంగా మలచుకునే ఎత్తుగడ ఇది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ అలాంటి ఎన్నికల పథకాలే పట్టాలెక్కుతున్నాయి.

రైతు బంధు పథకం, చాలా గొప్ప పథకమే. అందులో ఎలాంటి సందేహం లేదు. వానాకాలం రాగానే, పెట్టుబడి కోసం దిక్కులు చూసే రైతులకు వరమే. 52 లక్షల 72 వేల 779 మంది రైతులు లబ్దిపొందుతారు. కోటి 40 లక్షల 98 వేల 486 ఎకరాలకు పెట్టుబడి సాయం అందుతుంది. పెట్టుబడి పథకం కింద ఏడాదికి ఎకరాకు రూ.8 వేల చొప్పున ఇస్తుంది ప్రభుత్వం. పంటకు రూ.4వేల చొప్పున వానకాలం, యాసంగి పంటలకు కలిపి ఎకరాకు రూ.8వేల చొప్పున సర్కారు నుంచి రైతుకు పెట్టుబడి సాయం అందుతుంది. అయితే కరెక్టుగా ఎన్నికల ముంగిట్లో, ఈ పథకం తేవడంపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. 

నగదు పథకం వెనక, ఎన్నికల పథకం ఉందని విపక్షాలన్నీ, కేసీఆర్‌ సర్కారుపై దుమ్మెత్తిపోస్తున్నాయి. వీరు అన్నదాంట్లో నిజముందా....లేదా అన్న విషయం పక్కనపెడితే, రైతు బంధు పథకం ద్వారా లబ్దిపొందుతున్న 52 లక్షల 72 వేల మంది రైతులు, కేసీఆర్ ప్రభుత్వం పట్ల, ఇప్పటివరకైతే ఎంతోకొంత కృతజ్తతతో ఉంటారన్నది వాస్తవం. తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, ఈ స్కీంతో డబ్బులు తీసుకున్నవారు, తప్పకుండా తమవెంటే ఉంటారని టీఆర్ఎస్‌ శ్రేణులు నమ్మకంగా ఉన్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు కేసీఆర్. వృద్దులు, వితంతువులు, వికలాంగులకు ఆసరా పెన్షన్, పేదింటి ఆడపిల్లలకు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, బాలింతలకు ఆర్థిక సాయం, కేసీఆర్ కిట్్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇలా చాలా స్కీమ్స్‌ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు రైతు బంధు పథకం. ఇలా నగదు పథకాలు, ఉచిత తాయిలాలు, ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతాయని, రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు అంటున్నారు. 

టీఆర్ఎస్ సర్కారు, తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్పుుకుంటూనే, మరోవైపు అప్పుల మీద అప్పులు చేస్తోంది. 2018-19 తెలంగాణ బడ్జెట్ ‌ప్రకారం, రాష్ట్రంపై వేలాడుతున్న అప్పు 2 లక్షల 21 వేల కోట్లు. సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులతో పాటు అనేక కార్యక్రమాలకు రుణాలనే ఆశ్రయిస్తోంది కేసీఆర్ సర్కారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధు పథకానికి తొలి విడత పంటపెట్టుబడి సాయం 5 వేల 608 కోట్లు. ఇలా ఖజానాపై భారం పెరుగుతూనే ఉంది. వీటికి డబ్బు ఎక్కడి నుంచి తెస్తారో, ఎంతకాలం ఇలాంటి పథకాలు కొనసాగిస్తారో తెలీదు. కానీ ఎన్నికల ముంగిట్లో మాత్రం, ఒక్కసారిగా ఓటర్లను ఆకర్షించేందుకు టీఆర్ఎస్ పథకం వేసిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. రైతులకు పెట్టుబడి సాయం, సంక్షేమ పథకాలకు నిధులు వెచ్చించడం తప్పు కాదు గానీ, రైతులు, ప్రజల వాస్తవిక అభివృద్దికి దోహదం చేసేవి, కేవలం ఇవేనా అంటున్నారు వివిధ పార్టీల నాయకులు, విశ్లేషకులు.

కౌలు రైతులకు రైతు బంధు వర్తించకపోవడం దారుణమంటున్నారు రైతు సంఘాల నాయకులు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 24 లక్షలమంది కౌలు రైతులున్నారు. అయితే వీరిని గుర్తించేందుకు ప్రభుత్వం సిద్దంగాలేదని విమర్శిస్తున్నారు. ఈ స్కీమ్, భూస్వాములకే ఎక్కువగా ఉపయోగపడుతుందని, చిన్నసన్నకారు రైతులకే పెద్దగా ప్రయోజనం లేదంటున్నారు. ఎన్నికలు మహా అయితే ఏడాది కూడా లేవు. కర్ణాటకలో బీజేపీ గెలిస్తే, ముందస్తు ఎన్నికలొచ్చినా ఆశ్చర్యంలేదంటున్నారు. దీంతో ఎందుకైనా మంచిదని, సరిగ్గా ఎన్నికల ముహూర్తం కోసమే అన్నట్టుగా, రైతు బంధు పథకం, నిరుద్యోగ భృతి, ఇంకా అనేక ఉచిత పథకాలకు అధికారంలో పార్టీలు శ్రీకారం చుడుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

English Title
kcr raithubhandu

MORE FROM AUTHOR

RELATED ARTICLES