కేసీఆర్ రాజకీయ ప్రస్థానంలో మరో చరిత్ర

x
Highlights

టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాజకీయ ప్రస్థానంలో మరో చరిత్ర సృష్టించారు. మలిదశ ఉద్యమనాయకుడిగా తెలంగాణ ప్రజల హృదయాల్లో నిలిచిన గులాబీ...

టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాజకీయ ప్రస్థానంలో మరో చరిత్ర సృష్టించారు. మలిదశ ఉద్యమనాయకుడిగా తెలంగాణ ప్రజల హృదయాల్లో నిలిచిన గులాబీ దళపతి రెండో సారి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ర్ట సమితిని స్థాపించి రాష్ట్రం సాధించే వరకు విశ్రమించకుండా పోరాడిన కేసీఆర్ ఎనిమిదో సారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అలియాస్ కేసీఆర్‌ తెలంగాణ సాధనే లక్ష్యంగా అహర్నశలు పోరాడిన యోధుడు. తెలంగాణ కోసం గొంగళి పురుగును కూడా ముద్దాడిన ఉద్యమకారుడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ప్రజానేత. విద్యార్ధి దశ నుంచే రాజకీయాల్లో వచ్చిన కేసీఆర్ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని రాజనీతిజ్ఞుడిగా గుర్తింపు పొందారు.

కేసీఆర్ జీవన ప్రస్తానాన్ని చూసినట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లా చింతమడక గ్రామంలో 17 ఫిబ్రవరి, 1954 న రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు జన్మించారు. ఉస్మానియా వర్శిటీలో ఎంఏ తెలుగు లిటరేచర్ పూర్తి చేశారు. 29 ఏళ్ల వయస్సులో తొలిసారిగా1983 ఎన్నికల్లో టీడీపీ తరపున సిద్దిపేట నుంచి పోటీచేశారు. కాంగ్రెస్ అభ్యర్ధి అనంతుల మదన్ మోహన్ పై స్వల్ప తేడాతో ఓటమి చెందారు. ఆ తరువాత 1985 నుంచి పోటీచేసిన ప్రతి ఎన్నికలోనూ కేసీఆర్ విజయపరంపర కొనసాగిస్తూ వచ్చారు. అప్రతిహతంగా విజయాలను నమోదు చేస్తూ రికార్డు స్థాయిలో మెజార్టీలను సాధించారు.

ప్రస్తుత అసెంబ్లీలో అత్యంత సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ ఐదుసార్లు లోక్‌సభకు, ఏడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1985, 1989, 1994, 1999, 2001 ఉప ఎన్నికలో వరుసగా గెలుపొందారు. 1987-88 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. 1992-93లో పబ్లిక్ అండర్ టేకింగ్ చైర్మెన్ పదవిని చేపట్టారు. 1997-98లో టీడీపీ ప్రభుత్వంలో రవాణా మంత్రిగా కొనసాగారు.

1999-2001 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటి స్పీకర్‌గా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీకి, డిప్యూటి స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించి 2001 ఏప్రిల్ 27న ప్రత్యేక తెలంగాణ సాధనకై తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటుచేశారు. 2004 ఎన్నికల్లో కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుండి గెలుపొందారు. 14వ లోక్ సభలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకి మద్దతు ప్రకటించి కేంద్ర మంత్రి పదవి పొందారు. 2004 నుండి 2006 వరకు కేంద్ర కార్మికశాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. అనంతరం మారిన రాజకీయ పరిమాణాల నేపథ్యంలో మంత్రి పదవికి రాజీనామా చేసి యూపీఏ నుంచి వైదొలిగారు.

ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కేసీఆర్ కరీంనగర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో మళ్ళీ పోటీచేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన జీవన్ రెడ్డిపై రెండు లక్షలకుపైగా భారీ మెజారిటీతో గెలుపొందారు. తిరిగి 2008లో మరోసారి కరీంనగర్‌ నుంచి పోటీ చేసి ముచ్చటగా మూడో సారి విజయం సాధించాడు. 2009లో జరిగిన 15వ లోక్ సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ లోకసభ స్థానం నుంచి పోటీ చేసి మళ్లీ విజయం సాధించారు.

తెలంగాణ సాధనే లక్ష్యంగా 2009, నవంబర్ 29న నిరవధిక నిరాహార దీక్ష మొదలు పెట్టారు. తెలంగాణ పోరాటం ఉధృతం కావడంతో ఇక తెలంగాణ రాష్ట్ర ఇవ్వడం తప్పితే మరో మార్గం లేదని భావించిన కేంద్ర ప్రభుత్వం 2009, డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరిస్తూ ప్రకటన జారీ చేసింది. 2014 జూన్ 2న తెలంగాణ 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా జూన్ 2న ప్రమాణ స్వీకారం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories