అమవాస్య తర్వాత మిగిలిన అభ్యర్థుల ప్రకటన...రెండు మూడు రోజుల్లో...

Submitted by arun on Mon, 10/08/2018 - 09:38

తెలంగాణలో కేసీఆర్  ఎన్నికల ప్రచారం షెడ్యూల్ మారనుందా...? ప్రజా ఆశీర్వాద సభలపై కొత్త ప్రణాళిక ఏంటి..? నియోజక వర్గాల వారీగా రూట‌్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారా...? 50 రోజుల్లో 100 సభలు నిర్వహించాలన్న కేసీఆర్ వ్యూహం ఎన్నికల షెడ్యూల్ వచ్చాక మార్చుకున్నారా..? ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రచారసభలను నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు గులాబీబాస్. 

తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల‌్ విడుదలకు ముందు 50రోజుల్లో 100 సభలు తలపెట్టారు. ప్రజా ఆశీర్వాద సభల పేరుతో హుస్నాబాద్, నిజామాబాద్, నల్గొండ, వనపర్తిలో బహిరంగ సభలు నిర్వహించారు. ఖమ్మంలో కూడా సభకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే శనివారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో కేసీఆర్ ప్రచార సభల వ్యూహం మార్చినట్లు తెలిసింది. 

105 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ .. మిగతా 14 నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఇందుకోసం అనేకమంది పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల వారీగా సర్వేల రిపోర్టులు తెప్పించుకుని అమవాస్య తరువాత మిగతా అభ్యర్థులను ప్రకటించనున్నారు. అమలులో ఉన్న పథకాలను దృష్టిలో పెట్టుకుని కొత్త పథకాలతో అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మేనిఫోస్టో రెడీ చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో మేనిఫెస్టోను విడుదల చేసి వరుస సభలు నిర్వహించాలని యోచిస్తున్నారు.  

ఎన్నికలకు 60 రోజుల సమయం ఉండటంతో కొత్తగా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతానికి రెండు నియోజకవర్గాలకు కలిపి ఒక సభకు ప్లాన్ వేశారు గులాబీ బాస్. ఉమ్మడి జిల్లాల్లో సభలు ముగిసిన తర్వాత అన్ని నియోజక వర్గాల వారీగా ప్రచారం చేయనున్నారు. 

ఉన్న సమయంలో ప్రచారం నిర్వహించేలా అభ్యర్థులకు సూచనలు చేస్తున్నారు. ఇప్పటికి ఎన్ని గ్రామాలు పర్యటించారు ప్రచార సరళి ఏవిధంగా ఉందని ఆరా తీస్తున్నారు. ప్రతిపక్షాలు బలంగా ఉన్న చోట్ల కీలక నేతలు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. తమ అభ్యర్థులు గెలుస్తారన్న చోట ముందే సభలు జరిపి మిగతా స్థానాల్లో ప్రతి పక్షాలకు కౌంటర్ మీటింగ్ పెట్టే ఆలోచనలో ఉన్నారు. ప్రతిపక్షాలు సభలు జరిపిన అదే చోట టీఆర్ఎస్ కూడా సభలు పెట్టేలా శ్రేణులను సిద్ధం చేస్తున్నారు కేసీఆర్ .    

అన్ని స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన తర్వాత మహాకూటమి లక్ష్యంగా ఎదురు దాడితో దూకుడు పెంచి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపనున్నారు. నాయకులందరూ ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించాలని టీఆర్ఎస్ కే పట్టం కట్టాలని ప్రచారం చేయాలని ఆదేశిస్తున్నారు కేసీఆర్. 

English Title
KCR Plans to Change Election Campaign Schedule ?

MORE FROM AUTHOR

RELATED ARTICLES