105 మంది గులాబీ అభ్యర్థుల్లో గుబులు...జాబితాలో 20 మందికి టికెట్‌ కష్టమని ప్రచారం...?

x
Highlights

తాను ప్రకటించిన 105 మంది అభ్యర్ధుల్లో కనీసం 20 మందిని మార్చేందుకు గులాబి బాస్ సిద్దమవుతున్నారా కాంగ్రెస్ కూటమి అభ్యర్ధులను ప్రకటించిన వెంటనే ...

తాను ప్రకటించిన 105 మంది అభ్యర్ధుల్లో కనీసం 20 మందిని మార్చేందుకు గులాబి బాస్ సిద్దమవుతున్నారా కాంగ్రెస్ కూటమి అభ్యర్ధులను ప్రకటించిన వెంటనే టిఆర్ఎస్, పాత అభ్యర్ధులను మార్చి కొత్త అభ్యర్ధులను కేసిఆర్ తెరమీదకు తెస్తారా? అందుకే చాలా నియోజకవర్గాల్లో ప్రచారాన్ని మొదలు పెట్టలేదా? టికెట్ల మార్పు ఆలోచన వల్లే చాలా మంది అభ్యర్ధులను ప్రచారానికి వెళ్లనీయడం లేదా? టికెట్ కట్ చేయాల్సిన 20 మంది తాజా మాజీల జాబితాను కేసీఆర్ రెడి చేశారా?

టీఆర్ఎస్ అభ్యర్దులను మార్చేందుకు రంగం సిద్దమైందన్న ఊహాగానాలు, ఇప్పటికే రంగంలోకి దిగిన గులాబీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. టికెట్లిచ్చిన అభ్యర్ధుల్లో కనీసం 20 మందికి గెలిచే అవకాశాలు లేవని, గులాబి బాస్ కేసీఆర్ భావిస్తుండటమే ఇందుకు కారణమట. గెలిచే అవకాశంలేని అభ్యర్థులను మార్చాలని కసరత్తులు మొదలు పెట్టారట కేసీఆర్. కాని ఇప్పుడే మారిస్తే వారు తిరుగుబాటు చేసి, పార్టీకి నష్టం చేసే ప్రమాదం ఉంది. వారు పార్టీలు మారి, మరోసారి పోటి చేసే అవకాశం ఉంది. అందుకే వారికి ఇతర పార్టీల టికెట్లు దక్కకుండా చేయాలనే లక్ష్యంతో పాత అభ్యర్ధులనే ప్రస్తుతానికి కొనసాగిస్తున్నారు.

కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితి మహా కూటమిగా ఏర్పడుతున్నాయి. ఈ నాలుగు పార్టీల మద్య సీట్ల సర్ధుబాటు జరిగి అభ్యర్ధులను ప్రకటించిన తర్వాత పార్టీ అభ్యర్ధులను మార్చేందుకు కేసీఆర్ వ్యూహ రచన చేశారు. విపక్షాల అభ్యర్ధులు ఖరారు అయ్యాక టీఆర్ఎస్ అభ్యర్ధులను మార్చినా వారు తిరుగుబాటు చేయలేరు. పార్టీలు మారినా...వారికి టికెట్లు దక్కవు. అయితే స్వతంత్రంగా బరిలో దిగాలి. కాని స్వతంత్రంగా గెలిచే సత్తా ఉన్న నాయకులు పార్టీలో లేరు. అందుకే టికెట్ కట్ చేసినా వారు పార్టీ వీడే అవకాశాలు తక్కువ. అందుకే ప్రకటించిన అభ్యర్ధులను మార్చాలని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. టికెట్ కోల్పోయే అభ్యర్ధులను బుజ్జగించిన తర్వాత వారి స్థానాల్లో, కొత్త పేర్లను తెరమీదకు తీసుకొస్తారనే చర్చ టీఆర్ఎస్ పార్టీలో ఊపందుకుంది.

కనీసం 20 మంది అభ్యర్ధులను మారుస్తారని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ 20 మందిపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని ఆయా నియోజకవర్గాల్లో వారు పోటి చేసినా ఓటమి ఖాయమనే అంచనాకు కేసీఆర్ వచ్చారు. టికెట్ల మార్పు కొలిక్కి రాకపోవడంతోనే కేసీఆర్ ప్రచారాన్ని చేపట్టలేదు. అభ్యర్దుల మార్పు తర్వాతే కేసీఆర్ యాబై రోజులు వంద నియోజకవర్గాల కార్యాచరణ మొదలు పెడతారని తెలుస్తోంది.

అయితే సీట్లు కొల్పోయే 20 మంది అభ్యర్ధులు ఎవరని నేతలంతా టెన్షన్ పడుతున్నారు. టికెట్లు కోల్పోయే జాబితాలో ఉమ్మడి వరంగల్ జిల్లా మొదటి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్, జనగాం, ములుగు, మహబూబాబాద్ సిట్టింగులకు కోత పేట్టే యోచనలో గులాబి బాస్ ఉన్నారు. వీరిపై క్షేత్ర స్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో పాటు, వారి ప్రవర్తనా శైలి విమర్శల పాలవుతోంది. అందుకే స్టేషన్ ఘన్‌పూర్ నుంచి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మహబూబా బాద్ నుంచి మాజీ ఎమ్మెల్యేలైన కవిత, సత్యవతి రాథోడ్‌లలో ఒకరిని బరిలో దించాలని భావిస్తున్నారు. ములుగు స్థానం, కోయ సామాజిక వర్గానికి కేటాయించే చాన్స్ ఉంది. అటు జనగాంలో జాక్ కన్వీనర్‌గా ఉన్న అరుట్ల దశమంత్ రెడ్డికి, బీ ఫార్మ్ ఇస్తారని సమాచారం.

నిజమాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ సిట్టింగుల్లో ఒకరికి టికెట్ గల్లంతవుతుందని తెలుస్తోంది. అక్కడి నుంచి ఈమద్యే పార్టీలో చేరిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డికి టికెట్ ఇస్తారని సమాచారం. కరీంనగర్‌లోని రామగుండం టికెట్‌ను సోమారపు సత్యనారాయణకు కట్ చేసి పార్టీలో మొదటి నుంచి ఉన్న ఓరుగంటి శంకర్‌కు ఇస్తారనే చర్చ పార్టీలో జోరందుకుంది. ఇక పెద్దపల్లి తాజా మాజీ దాసరి మనోహర్ రెడ్డి చురుకుగా ఉండలేక పోతున్నారు. వేములవాడలో చెన్నమనేని రమేష్‌కు ఇంకా పౌరసత్వ చిక్కులు పోలేదు. అందుకే ఈ రెండు నియోజకర్గాలకు కొత్త పేర్లను పరిశీలుస్తున్నట్లు సమాచారం. ఇందులో ఒక సీటులో కరీంనగర్ జెడ్పీ చైర్మన్ తుల ఉమకు కేటాయించే అవకాశాలున్నాయంటున్నారు.

సంగారెడ్డిలో చింతా ప్రభాకర్‌పై వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో, ఆయన ప్లేస్‌లో మరొకరి అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసే చాన్స్ ఉందంటున్నారు. ఇక ఉప్పల్ సీటు దక్కించుకున్న బేతీ సుభాష్ రెడ్డి గట్టిపోటి ఇచ్చే స్థితిలో లేరు. అందుకే ఆయన్ను మార్చి మేయర్ బొంతు రామ్మెహన్ లేదా బండారు లక్ష్మా రెడ్డిల పేర్లను పరిశీలిస్తున్నారు. మిర్యాలగూడ, సత్తుపల్లి అభ్యర్ధుల మార్పు ఖాయమంటున్నారు. ఇలా కనీసం 20 స్థానాల్లో అభ్యర్ధులను మార్చితే తప్ప, మరోసారి అధికారం కష్టమని తేలడంతో పాత అభ్యర్ధులను బుజ్జగించిన తర్వాత కొత్త పేర్లను ప్రకటించనున్నారు గులాబి బాస్ కేసీఆర్.

Show Full Article
Print Article
Next Story
More Stories