పథకాలే ప్రచార అస్త్రాలుగా.. ఢిల్లీకి కేసీఆర్?

Submitted by arun on Tue, 03/06/2018 - 10:39
kcr

జాతీయ రాజకీయాల్లో కొత్త వేదిక ఏర్పాటు చేస్తా.. ప్రజలు సహకరిస్తే దేశానికి అద్భుతమైన దశ దిశ చూపిస్తా.. అంటూ పదే పదే చెబుతూ.. చర్చనీయాంశంగా మారుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. చాలా పెద్ద కసరత్తే చేసినట్టు తెలుస్తోంది. ఢిల్లీ స్థాయిలో వాణిని వినిపించాలంటే.. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా రాజకీయ వేదిక ఏర్పాటు చేయాలంటే.. మామూలు స్థాయిలో ముందుకు వెళ్లొద్దని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది.

తన పథకాలకు జాతీయ స్థాయిలో ప్రశంసలు వస్తుండడంతో.. వాటినే అస్త్రాలుగా చేసుకుని.. దేశ ప్రజలను ఆకర్షించాలని కేసీఆర్ అనుకుంటున్నారట. అందులో ముఖ్యంగా.. పెన్షన్లు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకే కాదు. ఒంటరి మహిళలకూ.. బీడీ కార్మికులకూ ఇస్తున్నారు. ఇలా దేశంలో సామాజికంగా కుల, మతాలతో సంబంధం లేకుండా వెనకబడిన వారికి పెన్షన్లు ఇచ్చే విధానాన్ని తెస్తామని కేసీఆర్ చెప్పే అవకాశం ఉంది.

ఇదొక్కటే కాదు. రైతులకు దేశ వ్యాప్తంగా ఉచితంగా విద్యుత్ ఇస్తామన్న ఒక్క మాట చెబితే.. కేసీఆర్ సంచలనం సృష్టించిన వారవుతారు. దేశ వ్యాప్తంగా దశలవారీగా రుణమాఫీ చేస్తామని చెబితే.. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ చర్చల్లో కేసీఆర్ గురించే మాట్లాడుకుంటారు. పంటకు కేంద్రమే పెట్టుబడి సహాయం అందిస్తుందని.. వ్యవసాయానికి జాతీయ స్థాయిలో ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడతామని అని ఒక్క మాట చెప్పినా చాలు.

వీటితో పాటు.. కల్యాణలక్ష్మి, షాదీముబారఖ్, కేసీఆర్ కిట్, ఇరిగేషన్ ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, గురుకులాలు, సర్కారీ దవాఖానల్లో ఉన్నత స్థాయి సేవలు.. విద్యార్థులకు హాస్టళ్లలో సన్న బియ్యం.. రైతులకు మద్దతు ధర కల్పించడం.. విదేశాంగ విధానం.. రిజర్వేషన్లు.. రాష్ట్రాలకు హక్కులు కల్పించడం లాంటి ఆకర్షణీయ ప్రతిపాదనలతో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చేందుకు భూమిక సిద్ధం చేసుకుంటున్నారట.

ఈ ఆలోచన ఇప్పటిది కాదని.. చాలా రోజుల క్రితమే కేసీఆర్ దీనికి కసరత్తు చేసి.. ఎన్నికలకు సరిగ్గా ఏడాది ఉందనగా తెరపైకి తీసుకువచ్చారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
 

English Title
KCR pitches third front in 2019

MORE FROM AUTHOR

RELATED ARTICLES