సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ఈరోజు కేసీఆర్ సభ

x
Highlights

టీఆర్‌ఎస్‌ను మరోసారి అధికారంలోకి తేవడానికి రాష్ట్రమంతా చుట్టేసిన కేసీఆర్‌ కానీ తన సొంత నియోజకవర్గంలో ఒక్కసారి కూడా ప్రచారం నిర్వహించలేదు. తన...

టీఆర్‌ఎస్‌ను మరోసారి అధికారంలోకి తేవడానికి రాష్ట్రమంతా చుట్టేసిన కేసీఆర్‌ కానీ తన సొంత నియోజకవర్గంలో ఒక్కసారి కూడా ప్రచారం నిర్వహించలేదు. తన నియోజకవర్గ బాధ్యతల్ని హరీ‌ష్‌‌రావుకి అప్పగించిన కేసీఆర్‌ గడువు ముగుస్తున్న చివరి రోజు మాత్రమే ప్రచారంలో పాల్గొనబోతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు కోసం రాష్ట్రమంతా చుట్టేసిన గులాబీ బాస్‌ కేసీఆర్‌ తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌‌లో మాత్రం ఇంతవరకూ ప్రచారం చేయలేదు. అయితే చివరి రోజు అభ్యర్థులంతా తమ సొంత నియోజకవర్గాల్లోనే ఉండాలని ఆదేశించిన కేసీఆర్‌ తాను కూడా గజ్వేల్‌లో సభ నిర్వహించేలా ‎షెడ్యూల్‌ ఖరారు చేసుకున్నారు. దాదాపు 117 నియోజకవర్గాలు కవర్ అయ్యే ప్రచారం నిర్వహించిన కేసీఆర్‌ చివరి రోజు తన సొంత నియోజకవర్గంలో క్యాంపెయినింగ్ చేయనున్నారు.

తెలంగాణ సెంటిమెంట్ కనిపించని వేళ, కేసీఆర్ అభివృద్ధి అజెండానే నమ్ముకొని విజయంపై ఆశలు పెట్టుకున్నారు. మిషన్ భగీరథ, రైతుబంధు లాంటి పథకాలు పెద్ద సంఖ్యలో ఓట్లను తెచ్చిపెడతాయని నమ్ముతున్నారు. గజ్వేల్ పట్టణంలో మెరుగైన రోడ్లు, ప్రభుత్వ భవనాలు, విద్యాసంస్థలు, తాగు నీరు వంటి సదుపాయాలు తమకు భారీ మెజార్టీ తెచ్చిపెడతాయనే కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఇక కేసీఆర్ గెలుపు బాధ్యతల్ని భుజాలకెత్తుకున్న హరీష్‌రావు గజ్వేల్‌ నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. అయితే కేసీఆర్ గెలుపు ఈసారి అంత ఈజీ కాదనే వాదనా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేసి 19వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన ఒంటేరు ప్రతాప్‌రెడ్డి ఈసారి కాంగ్రెస్ నుంచి మహాకూటమి అభ్యర్ధిగా బరిలోకి దిగడంతో గట్టి పోటీ తప్పదంటున్నారు. మల్లన్నసాగర్ బాధితులు, ముస్లిం, ఎస్సీఎస్టీ, బీసీ ఓటర్లు టీఆర్‌ఎస్‌‌పై కొంత ఆగ్రహంతో ఉన్నారనే మాట వినిపిస్తోంది. ఒంటేరు కూడా కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యంగా గజ్వేల్‌లో హోరాహోరీ ప్రచారం చేశారు. అయితే టీఆర్ఎస్ నేతలు మాత్రం ఒంటేరును పూచిక పుల్లలా తీసిపారేస్తున్నారు. కేసీఆర్ గెలుపు తథ్యమని ఎన్ని ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారన్నదే తేలాల్సి ఉందంటున్నారు. అయితే తెలంగాణ సెంటిమెంట్‌ ఉధృతంగా ఉన్న టైమ్‌లో కేసీఆర్‌‌కి 19వేల మెజారిటీ వచ్చిందని, ఇప్పుడా సెంటిమెంట్‌ లేకపోవడంతో కచ్చితంగా గెలుపు తనదేనని ఒంటేరు ధీమాగా ఉన్నారు.

ఓట్ల లెక్కల ప్రకారం చూస్తే గజ్వేల్‌ కాంగ్రెస్‌ కూటమికి అనుకూలంగా, అభివృద్ధిపరంగా కేసీఆర్‌కి పాజిటివ్‌గా ఉంది. 2014లో ఒంటేరుకు 67వేల ఓట్లు రాగా, కేసీఆర్‌కి 86వేల ఓట్లు, కాంగ్రెస్‌కు 34వేల ఓట్లు వచ్చాయి. ఈ లెక్కన టీడీపీ, కాంగ్రెస్‌కి వచ్చిన ఓట్లు కేసీఆర్‌‌కి పోలైన వాటి కంటే 15వేలు ఎక్కువగా ఉన్నాయి. ఈ లెక్కల ప్రకారమైతే ఈసారి కేసీఆర్ గెలుపు నల్లేరు మీద నడక కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories