బీజేపీ బేరసారాలు.. కాంగ్రెస్‌ వ్యూహాలు.. రసవత్తరంగా కన్నడ రాజకీయం

Submitted by santosh on Sun, 05/20/2018 - 18:13
karnataka politics updates

కర్ణాటకలో ప్రజాస్వామ్యమే విజయం సాధించింది. బీజేపీ బేరసారాలు ఫలించలేదు. దీంతో 55గంటలపాటు సీఎంగా ఉన్న యడ్యూరప్ప రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం ఏర్పాటుకు తగిన సంఖ్యా బలం లేకున్నా.. పక్క పార్టీల ఎమ్మెల్యేల మద్దతుతో గద్దెనెక్కాలని చూసి బొక్కబోర్లాపడింది. చివరి దాకా కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసింది. ఫోన్లలో బేరసారాలు జరిపిన ఆ పార్టీ నేతలు అడ్డంగా దొరికిపోయారు. దీంతో చేసేది లేక విశ్వాస పరీక్షకు కూడా వెళ్లడానికి కూడా ఇష్టపడని బీజేపీ కర్ణాటకలో దుకాణం సర్దుకుంది. 

కర్ణాటకలో బీజేపీకి వ్రతం చెడినా ఫలితం దక్కలేదు. కాంగ్రెస్, జేడీఎస్ అత్యంత వ్యూహత్మకంగా వ్యవహరించడంతో సీఎం యడ్యూరప్ప బలపరీక్ష కంటే ముందే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఎమ్మెల్యేలను పకడ్బందిగా కాపాడుకున్న కాంగ్రెస్, జేడీఎస్ ఒక ప్రణాళిక ప్రకారం బీజేపీ అగ్రనేతల ప్రలోభాలను సాక్ష్యాలతో సహా బయట పెట్టింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ తరఫున బిగ్ షాట్‌లే రంగంలోకి దిగారు. నీతులు చెప్పిన పెద్దలందరూ అదే పని చేశారు. మైనింగ్ డాన్ గాలి జనార్థన్ రెడ్డి ఈ ముఠాకు నాయకత్వం వహించారు. యడ్యూరప్ప, శ్రీరాములు, మురళీధరరావు, చివరికి ప్రకాష్ జవదేకర్ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతూ దొరికిపోయారు. కానీ ఎమ్మెల్యేలు ఎవరూ ఫిరాయించడానికి అంగీకరించలేదు.

వరుసగా ఆడియోలు విడుదల కావడంతో తమ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. డబ్బు, మంత్రి పదవి ఆశజూపి ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవాలని చూస్తోందని మండిపడింది. తమ ఆరోపణలకు ఇదిగో సాక్ష్యం అంటూ ఆడియోలను విడుదల చేసింది. మంత్రి పదవులు, వందల కోట్లు ఇచ్చిఅయినా ప్రభుత్వాన్ని కాపాడుకుందామని అనుకున్న బీజేపీ చివరి క్షణంలో వెనక్కి తగ్గింది. తమ ప్రయత్నాలన్నీ విఫలం కావడంతోపాటు బీజేపీ పరువు పోయేలా బేరసారాల ఆడియోలు బయటకు రావడంతో గెలిచినా ఆ చెడ్డపేరు పార్టీని దేశం మొత్తం వెంటాడుతుందని తేలిపోయింది. దాంతో ఎట్టి పరిస్థితిలోనూ దక్షిణాదిన కర్ణాటకలో అడుగుపెట్టాలనుకున్న ప్రధాని మోడీ, అమిత్ షా చివరి క్షణంలో ముందుకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో చేసేది లేక రాజీనామా చేసి ఇంటిదారి పట్టింది యడ్డీ బ్యాచ్. మొత్తానికి బీజేపీ ఎత్తులకు పైఎత్తులు వేసిన కాంగ్రెస్, జేడీఎస్ కూటమి.. వారి వ్యూహాలకు చెక్ పెట్టింది. ఎప్పటికప్పుడు ఆడియోలు రిలీజ్ చేసి బీజేపీని ప్రజల ముందుగా దోషిగా నిలబెట్టి ఎట్టకేలకు కర్ణాటక పీఠాన్ని దక్కించుకుంది. 

English Title
karnataka politics updates

MORE FROM AUTHOR

RELATED ARTICLES