కాషాయ కార్యకర్తలకు షా చేసిన కర్తవ్యబోధ

Submitted by santosh on Thu, 10/11/2018 - 10:21
karimnagar bjp meeting, amith shah fire on kcr

పాలమూరులో ఎన్నికల శంఖారావం పూరించిన అమిత్‌ షా, కరీంనగర్‌‌లో సమరభేరి మోగించారు. మోడీ, షాల అంతెత్తు కటౌట్లు, భారీగా జన సమీకరణ, వేదికపై కొలువుదీరిన నాయకులు, ఇలా కరీంనగర్‌ సమరభేరితో, నిజంగానే కమలం భేరి మోగించారు. ఆద్యంతం సభలో భారీతనం కనిపించింది. థర్డ్ ప్లేయర్‌గా తమను చూడొద్దని, టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని, వేదిక దద్దరిల్లేలా మాటల తూటాలు పేల్చారు కాషాయ నాయకులు.

షెడ్యూల్‌ ప్రకారం 2019లో ఎన్నికలు జరిగితే మోడీ ప్రభావం పడుతుందని కేసీఆర్‌ భయపడ్డారని, అందుకే ముందస్తుకు వెళ్లారని అమిత్‌షా ఆరోపించారు. దళిత సీఎం హామీ మొదలు, దళితులకు మూడెకరాల భూమి, ఉద్యోగాలు, డబుల్‌ బెడ్రూం ఇళ్లు,అమరుల కుటుంబాలకు హామీలు ఏమయ్యాయి అంటూ, కేసీఆర్‌ ప్రభుత్వంపై ముప్పేటదాడి చేశారు అమిత్‌ షా. కేవలం కొడుకు, కూతురును సీఎం చేసేందుకే కేసీఆర్ ప్రయత్నమని మాటల తూటాలు పేల్చారు.

ప్రసంగంలో ఎక్కువ భాగం టీఆర్ఎస్‌పైనే ఎక్కుపెట్టారు అమిత్‌ షా. అసెంబ్లీ రద్దు, ఎన్నికల తేదీలు, ఓట్ల గల్లంతు ఇలా అనేక విషయాల్లో టీఆర్ఎస్-బీజేపీలు కుమ్మక్కయ్యాయని వస్తున్న ఆరోపణలకు, ఇదే సమాధానం అన్నట్టుగా షా ప్రసంగం కొనసాగింది. అసలు కేసీఆర్‌తో తమకు పొత్తేంటన్నట్టుగా విమర్శలు, ఆరోపణలు సంధించారు. తమ మధ్య ఎలాంటి స్నేహంలేదని ప్రజలకు క్లియర్‌ కట్‌గా అర్థంకావాలన్న ఆలోచనతో, కేసీఆర్‌ సర్కారుపై ముప్పేటదాడి చేశారు అమిత్‌ షా. అంతేకాదు, టీఆర్ఎస్‌కు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీయేనని ప్రసంగిస్తూ, తాము థర్డ్ ప్లేయర్‌ కాదని చాటిచెప్పే ప్రయత్నం చేశారు. ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని, జనానికి పిలుపునిచ్చారు.

అభ్యర్థుల కసరత్తు, ప్రచార వ్యూహం, బూత్‌ లెవల్‌ బాధ్యులతో సమావేశాలు నిర్వహించిన అమిత్‌ షా, ఒకవైపు టీఆర్ఎస్‌ను, మరోవైపు కాంగ్రెస్‌ కూటమిని ఎలా ఎదుర్కోవాలో కర్తవ్యబోధ చేశారు. స్వామిజీలతోనూ సమావేశాలు నిర్వహించి, కర్ణాటక తరహాలో వారిని ప్రచార బరిలోకి దింపాలని భావిస్తున్నారు. వారిలో కొందరికి టికెట్లు కూడా ఇచ్చే ఛాన్సుంది. టీడీపీ సహా ఎవరితోనూ పొత్తులేదని అధైర్యపడాల్సిన పనిలేదని, మోడీ, హిందూత్వ అజెండా, మ్యానిఫెస్టో వరాలతో దూసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు షా. మొత్తానికి పాలమూరు, కరీంనగర్‌లో సభల్లో, అమిత్‌ షా ప్రసంగంతో, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చిందని నేతలు ఖుషీగా చెబుతున్నారు. ఇదే సమరోత్సాహంతో ఎన్నికలను ఎదుర్కోంటామంటున్నారు.

English Title
karimnagar bjp meeting, amith shah fire on kcr

MORE FROM AUTHOR

RELATED ARTICLES