భావోద్వేగంతో ముడిపడిన ఒక సమస్యని అలా నిలిపిన ధీరత్వం

భావోద్వేగంతో ముడిపడిన ఒక సమస్యని అలా నిలిపిన ధీరత్వం
x
Highlights

నాభాష నాయాస నాగోస అంటూ కేసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని పరుగులు పెట్టించారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం చేస్తున్న పోరాటం అని తెలంగాణ జనానికి భరోసా కలిగేలా ఆయన...

నాభాష నాయాస నాగోస అంటూ కేసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని పరుగులు పెట్టించారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం చేస్తున్న పోరాటం అని తెలంగాణ జనానికి భరోసా కలిగేలా ఆయన ప్రసంగాలు సాగాయి. ఆయన చేసిన విమర్శలకి, ఇచ్చిన స్ఫూర్తికి తెలంగాణ గజ్జెకట్టింది. తీన్మార్ ఆడింది. తెలంగాణ ఉద్యమాన్ని 14 ఏళ్ల పాటూ నిలబెట్టడం మాములు మాటేమీ కాదు. అది ఓ సామాన్య రాజకీయ నాయకుడి తరమూ కాదు. ఇంకా అందులోనూ భావోద్వేగంతో ముడిపడిన ఒక సమస్యని అన్నేళ్ల పాటూ కళ్లెం వేసి సరైన రీతిలో నడపడం మహామహులకి మాత్రమే సాధ్యపడుతుంది.. ఉద్యమాన్ని టోన్‌డౌన్ చేయాల్సి వచ్చినప్పుడు.. కొంతకాలం పాటూ విరామం ఇవ్వాల్సి వచ్చినప్పుడు కాడి వదిలేయకుండా.. తెలంగాణ సంస్కతి సంప్రదాయాల పరిరక్షణ పేరుతో ఉద్యమాన్ని డైవర్ట్ చేయడం కూడా కేసిఆర్‌ని తెలివైన నేతగా ఎస్టాబ్లిష్ చేసింది.

టీఆర్‌ఎస్ అంటే ఉప ఎన్నికల పార్టీ అని ప్రత్యర్దులు గాలి తీసేసినా.. ఫామ్ హౌస్ రాజకీయాలు చేస్తారని విమర్శించినా... ఆర్నెల్లకోసారి నిద్ర లేస్తారని ఎత్తిపొడిచినా కేసీఆర్‌ చాలా లైట్ తీసుకున్నారు.. తెలంగాణ క్రెడిట్ ముమ్మాటికీ తనకే ఎలా ఎందుకు దక్కుతుందో లాజికల్‌గా వివరించారు. కాంగ్రెస్ గింగిరాలు తిరిగి బొక్క బోర్లా పడే డైలాగులేశారు.. దేశానికి స్వతంత్ర్యం ఇచ్చింది బ్రిటీష్ వారే అయినా.. తెచ్చింది గాంధీయే కదా అంటూ లాజిక్ తీశారు.. గాంధీని జాతిపితగా కొలుస్తున్నప్పుడు తెలంగాణ క్రెడిట్ ముమ్మూర్తులా తనకే దక్కుతుందని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేశారు. అదే కాదు.. ఆపరేషన్ చేసి బిడ్డను తీసిన నర్సమ్మ అదంతా తన క్రెడిటే అంటోందంటూ సామాన్య జనానికి అర్ధమయ్యే విధంగా తన కృషిని చాటిచెప్పారు కేసీఆర్‌.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక కాంగ్రెస్ నిగూఢ ఎజెండాను గమనించినా.. ఫలితం దక్కే వరకూ లౌక్యంగా ఎదురు చూడటం కేసీఆర్‌ ఎత్తుగడలకు నిదర్శనం. విభజన బిల్లు ఆమోదం పొందాక.. గెలుపు కోసం కాంగ్రెస్ వేసిన లెక్కలను చిత్తు చేశారు.. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటేనంటూ కాంగ్రెస్‌ని చావుదెబ్బ తీశారు. పొత్తుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన హై కమాండ్‌కి గుక్క తిప్పుకోలేని షాకిచ్చారు. రాష్ట్రం వచ్చే వరకూ సై సై అంటూ కాంగ్రెస్‌ను కీర్తించిన గులాబీ నేత ఆ తర్వాతే ధమ్కీ ఇచ్చారు.. విలీనానికి నై అని రైట్ టైమ్‌లో ట్విస్టిచ్చారు. కాకలు తీరిన రాజకీయ నేతలనే కంగు తినిపించే చరిత్రున్న పార్టీ మెడలు వంచిన ఘనత కేసిఆర్‌దే. రాజకీయం, వ్యూహం, ఎత్తుగడలూ అన్నీ మాకే ఉంటాయ్.. కాంగ్రెస్ కేరాఫ్ అడ్రస్ అదే అని విర్రవీగిన కాంగ్రెస్‌పై ఒకే ఒక్కడై ఎదురు తిరిగారు.

అరవై ఏళ్ల ఉద్యమం.. నలభై ఏళ్ల నాటి ఆందోళనలు.. అన్నీ ఓ ఎత్తు.. కేసిఆర్ నడిపిన పోరాటం ఒక ఎత్తు.. కేసిఆర్ ప్రణాళికలోనే విజయం దాగుంది.. తెలంగాణ వాదులెంతమంది ఉన్నా తనది మాత్రమే నికార్సయిన తెలంగాణ వాదమనే బ్రాండ్ తెచ్చుకోగలిగారు.. యుద్ధంలో అయినా సంధికి విలువుంటుందేమో కానీ రాజకీయంలో మాత్రం గెలుపునకు మరో ప్రత్యామ్నాయం లేదు ఆ నిజం తెలిసిన వ్యక్తి కాబట్టే తెలంగాణ కలను నిజం చేసుకున్నారు. తిరుగులేని నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories