సుబ్బిరామిరెడ్డి కి తెలంగాణ సెగ‌

Submitted by arun on Wed, 02/07/2018 - 16:55
T.Subbarami Reddy

రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి వరంగల్ పర్యటన వివాదాస్పదంగా మారింది. ఈ నెల 11న కాకతీయ కళావైభవం పేరుతో సినీ ప్రముఖులను సన్మానించేందుకు టీఎస్సార్ చేస్తున్న ప్రయత్నాలకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఖిలా వరంగల్ కోటలో ఏర్పాట్ల కోసం పర్యటించిన సుబ్బిరామిరెడ్డి ప్రోటోకాల్‌ విస్మరించడంపై భగ్గుమంటున్న కార్పొరేటర్లు.. ఒంటెత్తు పోకడలతో కళావైభవం కార్యక్రమాన్ని కోటలో నిర్వహిస్తే స్థానికులతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. కాకతీయ కళావైభవంపై పెల్లుబుకుతున్న నిరసనలపై HMTV స్పెషల్ రిపోర్ట్. 

కాకతీయ కళావైభవం.. తెలంగాణాలోని చారిత్రక కట్టడాల గొప్పతనాన్ని తెలిపేందుకు ఏటా జరుగుతున్న సాంస్కృతిక ఉత్సవం. ఈ నెల 11న జరగనున్న కాకతీయ కళావైభవంలో సినీ ప్రముఖులకు సన్మానం చేసేందుకు రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామిరెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాకతీయ కళావైభవం కార్యక్రమ నిర్వహణకు స్థల పరిశీలన జరిపేందుకు టీఎస్సార్ వరంగల్ వచ్చారు. హన్మకొండలోని వేయి స్థంభాల గుడి, ఓరుగల్లు కోట, ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయం వంటి ఓరుగల్లులోని పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. ఓరుగల్లులో సినీరంగ కళాకారులకు సన్మానం చేస్తామని ప్రకటించారు సుబ్బిరామిరెడ్డి.

ఎంపీ సుబ్బిరామిరెడ్డి వరంగల్ పశ్చిమ, తూర్పు నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు కనీస సమాచారం ఇవ్వలేదు. దీంతో ప్రోటోకాల్  పాటించని సుబ్బిరామిరెడ్డిని అడ్డుకుంటామంటున్నారు స్థానిక టిఆర్ఎస్ నాయకులు. వరంగల్ కోటలో కార్యక్రమం నిర్వహిస్తామని స్థానిక ఎమ్మెల్యేకైనా చెప్పకపోవటం శోచనీయం అంటున్నారు. తెలంగాణాలో సినీ పరిశ్రమపై ఆధిపత్యం కోసం ఖిలావరంగల్ ను వేదికగా ఎంచుకున్నారని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. సుబ్బిరామిరెడ్డి తెలంగాణా వ్యతిరేకి అని.. కాకతీయ కళావైభవానికి సినీ ప్రముఖుల సన్మానానికీ సంబంధం లేదని అంటున్నారు వరంగల్ కార్పొరేటర్లు. 

స్థల పరిశీలన కోసం వరంగల్ తూర్పులో ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి టీఎస్సార్ పర్యటించడం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. ఇష్టారాజ్యంగా వచ్చి సన్మానాలు, సత్కారాలు చేస్తే ఊరుకోమని ప్రజలతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు స్థానిక ప్రజాప్రతినిధులు. కొండా సురేఖ ఇలాఖాలో ఎర్రబెల్లితో కలిసి తిరిగి తలనొప్పులు తెచ్చుకున్నాడని స్థానికంగా చర్చ జరుగుతోంది. స్థానిక రాజకీయాల గురించి సరిగా అవగాహన లేని సుబ్బిరామిరెడ్డి వరంగల్ కు ఎరక్కపోయి వచ్చి వివాదంలో ఇరుక్కుపోయారు. 

English Title
Kakatiya Kala Vaibhava Mahotsavam in Telangana from Jan 17

MORE FROM AUTHOR

RELATED ARTICLES