ఆ గొంతు శాశ్వతంగా మూగబోయింది ఆ నడక శాశ్వతంగా ఆగిపోయింది

Submitted by arun on Thu, 03/01/2018 - 12:51
Jayendra Saraswathi

కంచి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి మహా సమాధి ముగిసింది. అశేష భక్త బృందం విశేషమైన శిష్య బృందం కన్నీటి వీడ్కోలు పలికింది. నిన్న శివైక్యమైన  కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి బృందావన ప్రవేశంతో కంచి పీఠం కన్నీళ్లు పెట్టుకుంది. వేదమంత్రాల మధ్య స్వామివారిని బృందావన ప్రవేశానికి సాగనంపారు. 

కంచి పీఠాధిపతిగా, అద్వైత మత ధర్మ ప్రచారకర్తగా దశాబ్దాల పాటు నిర్వారామంగా ప్రచారం చేసిన ఆ గొంతు శాశ్వతంగా మూగబోయింది. ఆధ్యాత్మిక ప్రవచనాలతో, అద్వైతామృత వచనాలతో, అనుగ్రహ భాషణలతో అనునిత్యం భక్తజనుల మధ్య అలుపెరగని ఆ నడక శాశ్వతంగా ఆగిపోయింది. కంచి పీఠాధిపతి, పరామాచార్య శ్రీ జయేంద్ర సరస్వతి క్రతువు ముగిసిపోయింది. 

కంచి పీఠానికి పూర్వపు అధిపతి చంద్రశేఖరేంద్ర స్వామి మహా సమాధి పక్కనే జయేంద్రుడిని మహాసమాధి చేశారు. మహా సమాధి క్రతువులో వేలాదిమంది భక్తులు, వీఐపీలు పాల్గొన్నారు. వారందరూ కన్నీటి వీడ్కోలును పలికారు. స్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి బృందావనం పక్కనే జయేంద్ర సరస్వతి మహాసమాధి భారంగా నిర్వహించారు శిష్యులు. ఈ సందర్భంగా జయేంద్ర సరస్వతికి ఉత్తర పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి మహాభిషేకం నిర్వహించారు.

కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మహా సమాధికి ముందు పీఠంలో ఆయన పార్థివదేహాన్ని భక్తులు సందర్శించారు. ఆయన పార్థివదేహానికి మహాభిషేకం చేసిన అనంతరం జయేంద్ర సరస్వతి మహా సమాధికి సాగనంపారు. కంచిమఠంలోని చంద్రశేఖరేంద్ర సరస్వతి బృందావనం పక్కనే జయేంద్ర సరస్వతి మహాసమాధి చేశారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి అడుగుజాడల్లో నడిచేందుకు సన్యాస ఆశ్రమం స్వీకరించారు. చంద్రశేఖర స్వామితో పాటు మూడు సార్లు దేశమంతటా పాదయాత్ర చేశారు. కంచి పీఠం జయేంద్ర సరస్వతి నేతృత్వంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టింది.

English Title
Jayendra Saraswathi last rites

MORE FROM AUTHOR

RELATED ARTICLES