ఎవరి వారు ఎచటి వారు... ఎటు నుంచి ఇటొచ్చారు?

Submitted by santosh on Wed, 11/28/2018 - 10:16
jamping japangs in telangana politics

సైకిల్‌ దిగి కారెక్కినవారు కొందరు....కాంగ్రెస్‌కు చెయ్యిచ్చినవారు మరికొందరు. చివరికి కారు దిగిన వారూ ఉన్నారు. 2014లో పోటీ చేసినవాళ్లే, 2018లోనూ పోటీ చేస్తున్నారు. కేవలం కండువాలే మారాయి...మిగతదంతా సేమ్‌ టు సేమ్‌. టీడీపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు వారంతా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా అవే స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో, కొడంగల్‌లో టీడీపీ నుంచి పోటీ చేసిన రేవంత్‌ రెడ్డి, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి, అదే కొడంగల్‌ నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో పరకాల నుంచి టీఆర్ఎస్‌ అభ్యర్థిగా గెలిచిన కొండా సురేఖ, ఇప్పుడు కాంగ్రెస్‌ నుంచి తలపడుతున్నారు.

2014 ఎన్నికల్లో ములుగు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు సీతక్క. ఇప్పుడు కాంగ్రెస్‌ తరపున అదే సీటు నుంచి సై అంటున్నారు. నిర్మల్‌ నుంచి మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, సిర్పూరు నుంచి కోనేరు కోనప్ప బీఎస్పీ అభ్యర్థులుగా గెలిచి ఆ తర్వాతి పరిణామాలతో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు అవే స్థానాల నుంచి, కారు తరపున సై అంటున్నారు. కాకా తనయుడు జి. వినోద్‌ 2014 ఎన్నికల్లో చెన్నూరు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత టీఆర్‌ఎస్‌లో కొనసాగి, చెన్నూరు టికెట్‌ ఆశించారు. కానీ టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు చెన్నూరు టికెట్‌ కేటాయించింది. దాంతో అలిగిన వినోద్‌ బెల్లంపల్లి నుంచి బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.

బొల్లం మల్లయ్య యాదవ్ గత ఎన్నికల్లో టీడీపీ, ఇప్పుడు టీఆర్ఎస్, నియోజకవర్గం కోదాడ. చొప్పదండి నుంచి బొడిగే శోభ, అప్పుడు టీఆర్ఎస్‌ ఇప్పుడు బీజేపీ. అంథోల్‌లో బాబూ మోహన్, అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీజేపీ. అశ్వారావు పేట తాటి వెంకటేశ్వర్లు నాడు వైసీపీ, నేడు టీఆర్ఎస్. ఇల్లందు నుంచి కోరం కనకయ్య నాడు కాంగ్రెస్, నేడు టీఆర్ఎస్. వైరా నుంచి బానోతు మదన్‌లాల్‌ అప్పుడు వైసీపీ, ఇప్పుడు టీఆర్ఎస్. డోర్నకల్‌ డీఎస్ రెడ్యానాయక్ నాడు కాంగ్రెస్ నేడు టీఆర్ఎస్. ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ నాడు కాంగ్రెస్, నేడు టీఆర్ఎస్. చేవెళ్ల నియోకజవర్గం నుంచి కె.ఎస్ రత్నం నాడు టీఆర్ఎస్, నేడు కాంగ్రెస్. ఇలా చెప్పుకుంటూపోతే, చాలామంది అభ్యర్థులు 2014 ఎన్నికల్లో పోటీ చేసిన నియోజకవర్గం తలపడుతున్నారు. కానీ అప్పుడొక పార్టీ నుంచి పోటీ చేసి, ఇప్పుడు మరో పార్టీ తరపున తలపడుతున్నారు.

English Title
jamping japangs in telangana politics

MORE FROM AUTHOR

RELATED ARTICLES