నలభై ఏళ్ల తర్వాత తన తల్లిని కలిసిన జంపన్న..తీవ్ర భావోద్వేగానికి గురైన తల్లీకొడుకులు

నలభై ఏళ్ల తర్వాత తన తల్లిని కలిసిన జంపన్న..తీవ్ర భావోద్వేగానికి గురైన తల్లీకొడుకులు
x
Highlights

అడవిలో ఉన్నా అమెరికాలో ఉన్నా కొడుకు క్షేమానికి తపించే తల్లిప్రేమకి నిలువెత్తు నిదర్శనమే ఆ దృశ్యం. తాను బతికుండగా కొడుకును కళ్లజూస్తానని కల్లో కూడా...

అడవిలో ఉన్నా అమెరికాలో ఉన్నా కొడుకు క్షేమానికి తపించే తల్లిప్రేమకి నిలువెత్తు నిదర్శనమే ఆ దృశ్యం. తాను బతికుండగా కొడుకును కళ్లజూస్తానని కల్లో కూడా అనుకోలేదు ఆ తల్లి. అజ్ఞాతంలో ఉన్న ఆ కొడుకు కూడా తల్లిని ఒక్కసారి మనసారా హత్తుకుంటానో లేదో అనుకున్నాడు. కానీ ఆ కన్నపేగు ప్రేమపాశం కారడవులు వీడేలా చేసింది. తానుండగా వృద్ధాశ్రమంలో అనాథగా బతుకుతున్న తల్లి ఫోటో చూసి ఆ కొడుకు కళ్లు చెమ్మగిల్లాయ్. వనాలు వీడి జనాల్లోకి రాగానే రెక్కలు కట్టుకుని తల్లి ముంగిట వాలాడు. 40 ఏళ్ల తర్వాత కలుసుకున్న ఆ తల్లీకొడుకుల కళ్లు కన్నీటి సంద్రాలే అయ్యాయి.

పోరాటబాట పట్టి అరణ్యంలోకి వెళ్లి అజ్ఞాతంలో ఉన్న జంపన్న. జనావాసంలోకి రాగానే తల్లిని చూడాలనుకున్నాడు. వరంగల్ లోని సహృదయ అనాథాశ్రమంలో తల్లి ఉందని తెలిసి చూసేందుకు హుటాహుటిన తరలివెళ్లాడు. అప్పుడెప్పుడో 40 ఏళ్ల క్రితం చూసిన అమ్మను ఆ స్థితిలో చూసిన జంపన్న హృదయం కరిగింది. కళ్లు కన్నీటి చెలమలయ్యాయి, దశాబ్దాలుగా గడ్డకట్టిన అనుభూతుల దొంతలు కళ్ల ముందు కదలాడి అశ్రువులు ధారలుగా కారాయి.

90 ఏళ్ల ముదిమిలో నిస్సహాయంగా కాలం గడుపుతున్న ఆ మాతృమూర్తికి ఒక్కసారిగా కొండంత బలం వచ్చినట్టయింది. బిడ్డను చూస్తానో లేదో అనుకున్న ఆ తల్లికి కన్నకొడుకు కళ్లముందు కనబడగానే ఆనందానికి అవధుల్లేకుండా పోయాయ్. ఎదురుచూపులు ముగియడంతో ఆమె గాజుకళ్లు ఆనందామృత వర్షిణిని కురిపించాయి. నాలుగు దశాబ్దాల తర్వాత ఒకరినొకరు చూసుకొన్న ఆ తల్లీకొడుకులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆ కన్న పేగు చివ్వుమంది. తల్లి చేతిస్పర్శతో అడవుల్లో గుండె రాయిగా చేసుకున్న జంపన్న హృదయం ఒక్కసారిగా చలించిపోయింది. ఏళ్ళుగా గడ్డకట్టిన దు:ఖం హృదయం నుంచి పొంగుకొచ్చింది. కాసేపు ఇద్దరు ఒకరినొకరు పట్టుకుని తనివితీరా ఏడ్చారు.

మనసారా అమ్మా అనిపిలిచి కంట తడిపెట్టుకున్నారు. ఎంతో మంది తల్లులు కన్నీళ్లు తుడిచేందుకు అరణ్యం బాటపట్టాను. తన తల్లి ఈ స్థితిలో ఉండటాన్ని తట్టుకోలేక తల్లడిల్లిపోయానని చెప్పారు జంపన్న. ఆయన మాట్లాడుతున్నంత సేపు కంట నీరు ఆగలేదు. అడవిలో ఉన్నా అమ్మను మరువలేదని ఇక తన జీవితం తల్లికే అంకితమంటూ కన్నీరు మున్నీరయ్యారు. లక్షల మంది తల్లుల కన్నీళ్లు తుడిచేందుకు అడవి బాట పట్టిన తాను సైద్దాంతికంగా పార్టీ నచ్చకే జనంలోకి వచ్చినట్టు చెప్పారు జంపన్న. ప్రజాసేవ చేసేందుకు ఎన్నో మార్గాలున్నాయని ఏ రాజకీయ పార్టీలో చేరేది లేదని స్పష్టం చేశారు.

ఎక్కడుఉన్నా తల్లి ప్రేమ వెలకట్టలేనిదన్నారు రజిత. అడవిలో ఉన్నా జంపన్న అమ్నను మరిచిపోలేదని అన్నారామె. అడవుల్లో ఉన్న ఎందరో అన్నలు అమ్మలకు దూరంగా ఉండి మనోవేదన చెందుతున్నారని అన్నారు రజిత. వృద్ధాశ్రమంలో తల్లికొడుకుల భావోద్వేగాలను చూసినవారు కంటనీరు పెట్టుకున్నారు. ఏళ్ల తరువాత తల్లిని చూసిన జంపన్న ఆమెకు గోరు ముద్దలు తినిపించి తన అమ్మ మీద ప్రేమను చాటుకున్నారు. ఇక తన తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటానని చెప్పారు జంపన్న.

Show Full Article
Print Article
Next Story
More Stories