ఒకే దేశం... ఒకే ఎన్నికలు... సాధ్యాసాధ్యాలేం చెబుతున్నాయ్‌?

Submitted by santosh on Fri, 05/11/2018 - 14:54
jamili elections in india

జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు అనగానే  ఆ రెండు ఎన్నికలు వేర్వేరుగా జరగడమే అందరికీ తెలుసు. అయితే లోక్ సభకు, అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు ఒకే సారి ఎన్నికలు జరిగితే ఎలా ఉంటుంది ? అసలు ఊహకే అందని అంశం అది. అలాంటి ఊహ త్వరలోనే నిజం కానుందా ? దేశంలో జమిలి ఎన్నికలు జరుగుతాయి ? వచ్చే ఏడాదిలోనే జమిలి ఎన్నికల తొలిదశ నిజం కానుందా ? జమిలి ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీలు ఉనికి కోల్పోతాయా ? జాతీయ పార్టీలే రాష్ర్టాల్లో కీలకపాత్ర పోషిస్తాయా ? అసలు ఇది దేశంలో సాధ్యమవుతుందా ? 

దేశంలో జమిలి ఎన్నికల ప్రస్తావన రావడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి కావచ్చేమో గానీ..... స్వాతంత్ర్యానంతరం జరిగిన మొదటి ఎన్నికలు జమిలి ఎన్నికలే. 1951-52లో దేశంలో జరిగిన మొదటి సాధారణ ఎన్నికలు జమిలిగానే జరిగాయి. లోక్ సభతో పాటు వివిధ రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. తదనంతర కాలంలో  వివిధ కారణాలతో లోక్ సభ, రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరగడం మొదలైంది. జమిలి ఎన్నికల గురించి మే 16న చర్చించాలని ఎలక్షన్ కమిషన్, లా కమిషన్ నిర్ణయించాయి. దీనితో తాజాగా ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. 

ఒకే దేశం...ఒకే దఫా ఎన్నికలు.... ప్రధాన మంత్రి మోడీ ఇచ్చిన ఈ నినాదం ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, సాధ్యాసాధ్యాలు పెను చర్చకు దారి తీస్తున్నాయి. ఈ అంశంపై చర్చలు పలు పార్టీల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. అసలది సాధ్యమా అనే అనుమానాలు లేవనెత్తుతున్నాయి. ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఈ తరహా జమిలి ఎన్నికలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా స్వీడన్ దేశం ఈ విషయంలో మనకు స్ఫూర్తిగా నిలుస్తోంది. దక్షిణాఫ్రికా, బెల్జియం దేశాల్లో కూడా ఈ విధానం అమల్లో ఉంది. ఒకే దేశం… ఒకేసారి లోక్‌సభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించే ఆలోచనతోనే జమిలి ఎన్నికలు రానున్నాయి. అసలు ఈ ఎన్నిక ఎంత వరకు సాధ్యమనే అంశం పై దృష్టి సారించింది కేంద్రం. ఇటు ఎన్నికల సంఘం అటు న్యాయ కమిషన్‌ దానిపై సమాలోచనలు చేస్తున్నాయి. జమిలి ఎన్నికల నిర్వహణపై ఈసీ ఆచితూచి అడుగులు వేస్తోంది. న్యాయ వివాదాలు, రాజ్యాంగపరమైన సంక్షోభం తలెత్తకుండా చూడాలని భావిస్తోంది.  జమిలి ఎన్నికలకు అవసరమైన రాజ్యాంగ, న్యాయపరమైన ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని, ఇందుకు చాలా సమయం పడుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఓంప్రకాశ్‌ రావత్‌ ఇటీవల అన్నారు. న్యాయ ప్రక్రియ పూర్తికాగానే దీనిపై తమ ప్రతిపాదనలు చేస్తామని చెప్పారు. ఆ ప్రతిపాదనలు ఎలా ఉంటాయో తెలియాలంటే మరికొంత కాలం వేచిచూడాల్సిందే.
 

English Title
jamili elections in india

MORE FROM AUTHOR

RELATED ARTICLES