నేడు శ్రీహరికోట నుంచి నింగిలోకి జీశాట్-6ఏ

Submitted by arun on Thu, 03/29/2018 - 12:42
GSAT-6A satellite

మొబైల్ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించే దిశగా ఇస్రో అడుగులేస్తోంది. ఇందుకోసం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన GSLV F-08 రాకెట్ ద్వారా ఓ ప్రత్యేక కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపేందుకు రంగం సిద్ధమైంది. ఈ సాయంత్రం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండో లాంచ్ ప్యాడ్ నుంచి రాకెట్‌ ప్రయోగానికి సర్వం సిద్ధం చేశారు శాస్ర్తవేత్తలు. 

అంతరిక్ష పరిశోధనల్లో అద్భుతాలు సాధిస్తూ భారత కీర్తిపతాకని ప్రపంచం నలుదిశలా చాటిచెబుతున్న భారత అంతరిక్ష ప్రయోగ సంస్ధ.. ఇస్రో.. మరో ప్రయోగానికి సిద్దమైంది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వేదికగా ఈ సాయంత్రం GSLV F-08 రాకెట్‌ ద్వారా జీశాట్_6ఏ ఉపగ్రహాన్ని అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు షార్ శాస్ర్తవేత్తలు. ఇందుకోసం కౌంట్ డౌన్  కూడా ప్రారంభమైంది. నిన్న మధ్యాహ్నం ఒంటి గంట 56 నిమిషాలకు ప్రారంభమైన కౌంట్ డౌన్ ప్రక్రియ 27 గంటల పాటు కొనసాగనుంది. 

స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన GSLV F-08 రాకెట్ ద్వారా జీశాట్ 6ఏ అనే ఉపగ్రహాన్ని రోదశిలోకి పంపుతున్నారు. మొబైల్ కమ్యునికేషన్ రంగం కోసం రూపొందించిన జీశాట్ సిరీస్ ద్వారా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలు సేవలు పొందుతున్నారు. ఈ సిరీస్ లో భాగంగా 2015 ఆగస్టు 27వ తేదీన జీఎస్ఎల్వీ డి6 రాకెట్ ద్వారా జీశాట్ 6 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు శాస్ర్తవేత్తలు. ఈ ఉపగ్రహ కాలపరిమితిని తొమ్మిదేళ్లుగా నిర్ణయించారు అధికారులు. అయితే దాని సేవలు అంతకు ముందే ముగిసే అవకాశం ఉన్నట్లు భావించిన శాస్ర్తవేత్తలు.. జీశాట్ 6ఏని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ఎస్ బాండ్, సి బాండ్ ట్రాన్స్ఖపాండర్స్ ఎక్కువగా ఉండడంతో కమ్యునికేషన్ వ్యవస్ధను మరింత మెరుగయ్యే అవకాశం ఉందని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. 

2140 కిలోల బరువైన ఈ ఉపగ్రహాన్ని 3 దశల్లో కక్ష్యలోకి ప్రవేశపెడతారు. పదేళ్ల పాటు ఈ ఉపగ్రహం తన సేవలను అందించనుంది. దేశ రక్షణ రంగానికి కూడా ఈ ఉపగ్రహ సేవలు ఉపయోగిస్తున్నట్లు సమాచారం. దేశ సరిహద్దుల్లో 20 కిలోమీటర్ల దూరంలో కదలికలను గుర్తించే సామర్ధ్యం దీని సొంతం. శ్రీహరికోట సతీష్ థవన్ స్పేస్ సెంటర్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. కేంద్ర రక్షణ బలగాలు ఇప్పటికే షార్ కు చేరుకున్నాయి. గుర్తింపు కార్డులు లేని ఎవరినీ షార్ సమీప ప్రాంతాల్లోకి కూడా రానివ్వడం లేదు. మరోవైపు తిరుమలలో ఇస్రో చైర్మన్ శివన్ ప్రత్యేక పూజలు చేశారు.

English Title
ISRO to launch GSAT-6A satellite today. Here's all you need to know

MORE FROM AUTHOR

RELATED ARTICLES