సైన్సు కాంగ్రెస్‌ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి

x
Highlights

ఉస్మానియా యూనివర్శిటీలో నిర్వహించాల్సిన సైన్సు కాంగ్రెస్‌ మణిపూర్ సెంట్రల్ యూనివర్శిటీకి తరలి వెళ్లింది. సైన్సు కాంగ్రెస్‌ చరిత్రలో ఇలా జరగడం ఇది...

ఉస్మానియా యూనివర్శిటీలో నిర్వహించాల్సిన సైన్సు కాంగ్రెస్‌ మణిపూర్ సెంట్రల్ యూనివర్శిటీకి తరలి వెళ్లింది. సైన్సు కాంగ్రెస్‌ చరిత్రలో ఇలా జరగడం ఇది తొలిసారి. స్థానిక పరిస్థితులు అనుకూలంగా లేవని, సైన్సు కాంగ్రెస్‌ నిర్వహించలేమని ఓయూ వీసీ ఇస్కాకి తెలిపారు. వీసీ నిర్ణయంపై ఓయూ విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకే సైన్సు కాంగ్రెస్‌ నిర్వహణకి నో చెప్పారని ఆరోపిస్తున్నాయి.

ప్రతిష్టాత్మక సైన్సు కాంగ్రెస్‌ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమై ఈసారి ఉస్మానియాలో జరగాల్సి ఉంది. అయితే స్థానిక సమస్యల కారణంగా నిర్వహించలేకపోతున్నట్లు ఉస్మానియా వైఎస్‌ ఛాన్సులర్‌ స్పష్టం చేశారు. గతంలో హైదరాబాద్‌లో ఏడు పర్యాయాలు నిర్వహించిన సైన్సు కాంగ్రెస్‌ ఈసారి ఉస్మానియా యూనివర్శిటీ కండక్ట్‌ చేయాల్సి ఉంది. యూనిర్శిటీలో విద్యార్థుల సమస్యల కారణంగా సైన్సు కాంగ్రెస్‌ నిర్వహించలేకపోతున్నట్లు వీసీ తెలిపారు. ఇటీవలే మురళి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని, ఇలాంటి పరిస్థితుల్లో సైన్సు కాంగ్రెస్‌ సజావుగానిర్వహించడంపై ఓయూ వీసీ సందేహం వ్యక్తం చేశారు. దీంతో ఈసారి సైన్సు కాంగ్రెస్‌ నిర్వహణ మణిపూర్‌ యూనివర్శిటీకి వెళ్లిపోయింది.

ఈ మధ్య ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించిన తెలంగాణా ప్రభుత్వం సైన్సు కాంగ్రెస్‌ పట్ల ఎందుకు భయపడుతుందనే విమర్శలు వస్తున్నాయి. ఓయూలో విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని, అలాంటప్పుడు సైన్సు కాంగ్రెస్‌ నిర్వహించడం, అందులో ప్రభుత్వం తరుపున పాల్గొనడం కష్టమవుతుందనే కారణంతో వెనక్కి తగ్గినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఓయూలో స్థానికంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత కారణంగానే సైన్సు కాంగ్రెస్‌ నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకోవడం వెనుక ప్రభుత్వంలోని పెద్దల హస్తముందని ఆరోపణలు వినవస్తున్నాయి.

ఈ ఏడాది జనవరిలో తిరుపతిలో సైన్సుకాంగ్రెస్‌ జరిగింది. దానికి అంతర్జాతీయంగా పేరొందిన శాస్త్రవేత్తలు హాజరయ్యారు. జపాన్‌, ఫ్రాన్స్‌, అమెరికా, ఇజ్రాయేల్‌, బంగ్లాదేశ్‌ నుంచి తొమ్మిది మంది నోబుల్‌ బహుమతి గ్రహీతలు తిరుపతి సైన్సు కాంగ్రెస్‌కి వచ్చారు. దేశీయంగానే కాకుండా విదేశాల నుంచి మొత్తం రెండు వందల మంది శాస్త్రవేత్తలు హాజరయ్యారు.

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సైన్సు కాంగ్రెస్‌ ఉస్మానియా నుంచి మణిపూర్‌ వర్శిటీకి తరలిపోవడంపై అధ్యాపకులు, విద్యార్థులు మండిపడుతున్నారు. ఒక విద్యార్థి ఆత్మహత్యను సాకుగా చూపి అంత గొప్ప సైన్సు కాంగ్రెస్‌ నిర్వహణ అవకాశాన్ని ఎలా వదులుకుంటారని ప్రశ్నిస్తున్నారు. సైన్సు కాంగ్రెస్‌ కాంగ్రెస్‌ చరిత్రలోనే మొదటిసారిగా విద్యార్థుల నిరసనల భయంతో మరో ప్రాంతానికి తరలిపోవడానికి ప్రభుత్వమే బాద్యత వహించాలని ఓయూ విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. సైన్సు కాంగ్రెస్‌ తరలిపోవడంపై ఓయూ విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. వర్శిటీలో ఆందోళనకి దిగాయి. దీనికి కారణమైన వీసీ తక్షణ రాజీనామా చేయాలని, ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories