హైదరాబాద్ ను టార్గెట్ చేసిన డి-గ్యాంగ్...ఓ హైదరాబాద్ సెలబ్రిటీ హత్యకు కుట్ర

Submitted by arun on Wed, 02/21/2018 - 11:46
Dawood Ibrahim

మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఇప్పుడీ మాఫియా డాన్ కన్ను హైదరాబాద్ పై పడిందనే విషయం కలవరం సృష్టిస్తోంది. ఇంతకాలం ముంబైకే పరిమితమైన డీ- గ్యాంగ్ కార్యకలాపాలు ఇప్పుడు మన విశ్వనగరానికి విస్తరించాయనే అనుమానాలు కలుగుతున్నాయి. హైదరాబాద్ లో ఓ సెలబ్రిటీని చంపేందుకు సుపారీ తీసుకున్నాడని ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావడం కలకలం రేపుతోంది.

పాకిస్తాన్లో తలదాచుకుంటున్న భారత్ మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం భారత్ లో తన చర్యల్ని ఇంకా కొనసాగిస్తున్నాడా? ఢిల్లీలో అరెస్టయిన షార్ప్ షూటర్ నసీం వెల్లడించిన విషయాలు అదే ఖరారు చేస్తున్నాయి. దేశంలో కొంతమంది సెలబ్రిటీలను చంపడానికి జరిగిన కుట్ర వెనుక దావూద్ హస్తమున్నట్లు అర్థమవుతోంది. దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ ఆదేశాలతో నసీం అలియాస్ రిజ్వాన్ అనే షార్ప్ షూటర్ రంగంలోకి దిగినట్లు గతేడాది ఢిల్లీ పోలీసులకు నిఘా వర్గాలు సమాచారం అందించాయి. దీంతో మొదట నసీం అనుచరుడు జునైద్ ను అరెస్టు చేసిన పోలీసులు అతడిచ్చిన సమాచారంతో నసీమ్ ను కూడా నవంబర్లో పట్టుకున్నారు. విచారణలో నసీం ఇచ్చిన సమాచారం పోలీసులను షాక్ కు గురిచేసింది. 

హైదరాబాద్ లోని ఓ సెలబ్రిటీతోపాటు మరికొంతమంది సెలబ్రిటీలను చంపడానికి దావూద్, షకీల్ ఆదేశాలతో రంగంలోకి దిగానని విచారణలో నసీం పోలీసులకు చెప్పాడు. ఢిల్లీలో జరిగిన అనేక దోపిడీ, దొంగతనం, హత్యలు, హత్యాయత్నం నేరాల్లో నిందితుడిగా మరికొన్ని కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న నసీం కోసం ఢిల్లీ పోలీసులు కొన్నాళ్లుగా గాలిస్తున్నారు. అతడిపై రూ.50 వేల రివార్డ్‌ ప్రకటించారు. పాక్ లో పుట్టి కెనడియన్ గా మారిన రచయిత తారిఖ్ పథా ఢిల్లీకి వస్తున్న నేపథ్యంలో అతడిని హతమారిస్తే 1.5 కోట్ల రూపాయలు ఇస్తామని షకీల్ తనతో ఒప్పందం కుదుర్చుకున్నాడని నసీం చెప్పాడు. కాఫీ విత్ డీ నిర్మాతతోపాటు మరికొందరు సెలబ్రిటీలు టార్గెట్ లో ఉన్నారని నసీం వెల్లడించాడు. 

రెండుసార్లు నసీంతో మాట్లాడిన చోటా షకీల్ ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. తీహార్ జైల్లో ఉన్న చోటారాజన్ కదలికలను కూడా గమనించాలని చోటా షకీల్ తనతో చెప్పినట్టుగా నసీం వెల్లడించాడు. దీనిపై ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు కేసు దర్యాప్తులో ఉందని చెప్తుండగా.. తెలంగాణ అధికారులు మాత్రం తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్తున్నారు. 

English Title
international don dawood ibrahim eye hyderabad

MORE FROM AUTHOR

RELATED ARTICLES