విభేదాల యాత్ర

Submitted by arun on Mon, 04/09/2018 - 12:27

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ప్రజాచైతన్య యాత్ర సాఫీగానే సాగుతోందా..? బడా నేతలంతా హాజరవుతున్నారా..? డుమ్మా కొడుతున్నారా..? జిల్లా నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు యాత్రపై ఎఫెక్ట్ చూపిస్తోందా..? 

తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన రెండో విడత ప్రజాచైతన్య యాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోరుగా సాగుతోంది. పార్టీ ముఖ్యనేతలంతా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కానీ జిల్లాకు చెందిన ఓ కీలక నేత మాత్రం యాత్రలో కనిపించకపోవడంతో కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. సొంతజిల్లాలో జరుగుతున్న బస్సుయాత్రకు ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నారు.? ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌ నాయకుల మధ్య అంతర్గత విభేదాలు ముదిరాయా..? ఇప్పుడివే ప్రశ్నలు కార్యకర్తలను తొలిచేస్తున్నాయి.

పేరుకు మాత్రం అంతా కలిసి ఉన్నట్లుగా కనిపిస్తారు. వేదిక దిగగానే ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో ఇప్పుడిదే జరుగుతోందట. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రజా చైతన్య యాత్రకు దూరంగా ఉంటున్నారు. ఆయన మాత్రమే కాదు మరో నేత గండ్ర వెంకటరమణారెడ్డి కూడా భూపాలపల్లికే పరిమితమవుతున్నారనే వాదన ఉంది.

అంతర్గత విభేదాలతో ఇప్పటికే స్టేషన్‌ఘన్‌పూర్‌, వరంగల్‌ తూర్పు నియోజకవర్గాల్లో బస్సుయాత్ర రద్దైంది. భూపాలపల్లి, పాలకుర్తి, నర్సంపేటలో జరిగిన ప్రజా చైతన్య యాత్రకు పొన్నాల హాజరుకాలేదు. అంతేకాదు సొంత నియోజకవర్గం జనగామలో కూడా బస్సుయాత్రను వాయిదా వేయించుకోవటం జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇతర జిల్లాల నాయకులు కూడా వరంగల్ జిల్లాలో జరుగుతున్న యాత్రలో పాల్గొంటుంటే సొంత జిల్లాలో జరుగుతున్న ప్రజాచైతన్య యాత్రకు పొన్నాల ఎందుకు దూరంగా ఉంటున్నారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

జిల్లాల విభజనతో నాయకుల మధ్య దూరం పెరిగిందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎవరైనా ఏదైనా మాట్లాడితే నీ జిల్లాలో చూసుకో అని తెగేసి చెప్పేస్తున్నారట. కార్యకర్తలను సమీకరించి పార్టీ బలోపేతం దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

English Title
Internal Conflicts Between T Congress Leaders

MORE FROM AUTHOR

RELATED ARTICLES