శవాలదిబ్బగా మారిన ఇండోనేషియా

Submitted by arun on Mon, 10/01/2018 - 13:23
Indonesia

ఎటుచూసినా విధ్వంసం.. సునామీ మిగిల్చిన ఘోరం.. శవాలగుట్టలు, రోడ్లపై ప్రజల ఆకలికేకలు తీరాన్ని మింగేసిన నీళ్లు..ఇండోనేసియాలోని సులవేసి ద్వీప రాజధాని పాలూ నగరంలో కనిపిస్తున్న దృశ్యాలు. ప్రకృతి బీభత్సానికి ఇప్పటి వరకు 832 మంది చనిపోయారని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. మృతులను సామూహిక ఖననాలు చేస్తున్నారు.

ఇండోనేషియాలపై పగబట్టిన రాకాసి అలల సునామీ పాలూ నగరాన్ని శవాలదిబ్బగా మార్చేసింది. దాదాపు 9 వందల మందికిపైనే ప్రాణాలను బలిగొంది. సముద్ర తీరాన ఉన్న పాపానికి పాలూ నగరం తన స్వరూపాన్నే కోల్పోయింది. వెతికే కొద్ది మృతదేహాలు బయటపడడంతో బెంబేలెత్తిపోతున్నారు అధికారులు.

విరిగిపడిన భారీ వృక్షాలు, ధ్వంసమైన కార్లు, కూలిపోయిన ఇండ్లు, సముద్రంలో దాదాపు 50 మీటర్ల మేర పేరుకుపోయిన చెత్తాచెదారంతో నిండిపోయింది.  సముద్రపు అలలు..సుమారు 20 కిలోమీటర్ల వరకూ లాక్కు వెళ్లాయంటే.. సునామీ తీవ్రతను ఏ రేంజ్‌లో ఉందో  ఊహించుకోవచ్చు. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శిధిలాల కింద మరింత మంది ఉండి ఉంటారని అనుమానిస్తున్నారు.

సునామీ తర్వాత ప్రాణాలతో మిగిలిన వారి పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. హాస్పిటల్స్ అన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి. కొన్ని ఆసుపత్రులు కూడా కూలిపోవడంతో బయట టెంట్లు వేసి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. క్షతగాత్రులకు తగిన వైద్య సహాయం అందడం లేదు. క్షతగాత్రులను పునరావాస కేంద్రాలకు తరలిస్తూ హెలికాఫ్టర్లు, సైనిక దళాల సహాయంతో చర్యలు చేపడుతున్నారు. 

సునామీ కారణంగా సర్వం తుడిచిపెట్టుకు పోయిన ప్రజలు.. ఆహారం కోసం.. మంచినీటి కోసం అల్లాడుతున్నారు. చాలా మంది తమ కుటుంబీకుల యోగ క్షేమాలు తెలియక రోదిస్తున్నారు.  మరోవైపు సునామీ ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులూ విజృంభిస్తున్నాయి.  దీంతో మృతదేహాలను సామూహిక ఖననాలు చేపడుతున్నారు. ఇండోనేసియా అధ్యక్షులు జోకో విడోడో.. పాలూ నగరానికి వచ్చి పరిస్థితిని పర్యవేక్షించారు. బాధితులను ఆదుకోవడానికి రాత్రింబవళ్ళు సహాయక చర్యలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.
 

English Title
Indonesia earthquake and tsunami: Desperate search for survivors

MORE FROM AUTHOR

RELATED ARTICLES