నా పాటలకు రాయల్టీ ఇస్తే ఎప్పుడో రిటైర్‌ అయ్యేవాడిని: ఎస్పీ బాలు

Submitted by arun on Thu, 08/09/2018 - 11:09

రాయల్టీపై తెలుగు సినీ గాయనీ గాయకులు గళమెత్తారు. ఇండియన్‌ సింగర్స్‌ రైట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ప్రముఖ నేపధ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మమణ్యంతో పాటు పలువురు గాయనీ గాయకులు హాజరయ్యారు. రాయల్టీ చట్టం ప్రకారం పాటపాడిన గాయనీ గాయకులకు కూడా రాయల్టీ చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

పాటలపై వచ్చే ఆదాయంలో తమకు వాటా కావాలంటున్నారు గాయనీ, గాయకులు. 2012లో కేంద్రం అమల్లో కి తీసుకొచ్చిన రాయల్టీ చట్టం ప్రకారం తమ హక్కుల కోసం పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్ ఇస్రా ఆధ్వర్యంలో హైదరాబాద్ లో సమావేశమైన గాయనీ గాయకులకు ఇండియన్‌ సింగర్స్‌ రైట్స్‌ అసోసియేషన్‌ CEO సంజయ్ టండన్ , సీనియర్ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎస్పీ బాలు గాయనీ గాయకులంతా ఐక్యమై రాయల్టీని తీసుకోవాలని కోరారు. రాయల్టీ అనేది కేవలం సినిమా పాటలకే కాకుండా అన్ని రకాల పాటలకు వర్తిస్తుందన్నారు. ఇక నుండి పాటల విషయంలో రాయల్టీ యాక్ట్ ప్రకారం లీగల్‌గా ముందుకెళ్తామని పేర్కొన్నారు. చనిపోయిన సింగర్లు పాడిన పాటలకు కూడా రాయల్టీ వస్తుందని అయితే, ఇందుకు సదరు సింగర్‌ కుటుంబ సభ్యులు ఇశ్రాలో సభ్యులు అయి ఉండాలని బాలు చెప్పారు. 

కేవలం లతా మంగేష్కర్‌ మాత్రమే పాట ఒప్పందంలో రాయల్టీ వచ్చేలా కాంట్రాక్ట్ చేసుకునేవారని వివరించారు. ప్రస్తుతం రాయల్టీ యాక్టు కాపీ రైట్ యాక్టులా తయారైందని  చెప్పిన బాలు దాదాపు 410 మంది సింగర్‌లు ఇశ్రాలో ఉన్నట్లు చెప్పారు. వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, హోటల్స్ , ఈవెంట్ లలో పాడే పాటలకు సంగీత దర్శకుడు, గేయ రచయిత, నిర్మాత, ఆడియో హక్కులు పొందిన కంపెనీలతోపాటు గాయనీ గాయకులకు రాయల్టీ చెల్లించాలని చట్టంలో పొందుపర్చారు. 

ఇస్రా ద్వారా 50 ఏళ్ల పాటు రాయల్టీ చెల్లించే విధంగా నిబంధనలు రూపొందించారు. ఎక్కడెక్కడ ఎంత వసూలు చేయాలనే విషయంపై 22 రకాల నియమాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌.పి.పట్నాయక్‌, కె.ఎం.రాధాకృష్ణన్‌, వేణుశ్రీరంగంతో పాటు తెలుగు చలన చిత్ర పరిశ్రమకి చెందిన గాయనీగాయకులంతా పాల్గొన్నారు.

English Title
Indian Singers' Rights Association meet held in Hyderabad

MORE FROM AUTHOR

RELATED ARTICLES