కంపెనీల గేమ్స్‌.. కస్టమర్స్‌ అవుట్‌... పెట్రోల్‌పై ఏంటీ డ్రామాలు

Submitted by arun on Wed, 05/30/2018 - 14:52
Petrol Prices

పెట్రోలు, డీజీల్ ధరలు తగ్గాయి. అలా అని సంబర పడకండి. తగ్గిన రేటు ఎంతో తెలిస్తే నవ్వాలో..ఏడవాలో అర్థం కాదు. ఇదేం తుగ్లక్ నిర్ణయంరా బాబూ అని కోపం రాక మానదు.  ఎవరిని ఉద్ధరించడానికో ఈ తగ్గింపు అని అనడం ఖాయం. ఇంతకీ పెట్రోలు, డీజీల్ పై తగ్గింది కేవలం ఒక పైసా మాత్రమే. అవును మీరు వింటున్నది నిజమే. పెట్రో ధరలు ఆకాశాన్నంటుతున్నాయని కొద్ది రోజులుగా జనం గగ్గోలు పెగుతుంటే...చమురు కంపెనీలు మాత్రం ఎంతో ఉదారత ప్రదర్శించాయి. లీటరు పెట్రోలు , డీజిల్‌పై కేవలం పైసా తగ్గించాయి.

నిజానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇవాళ ఉదయం లీటరు పెట్రోలు ధర 60 పైసల చొప్పున, లీటరు డీజిల్ ధర 56 పైసల చొప్పున తగ్గించినట్లు ప్రకటించింది. దీంతో వినియోగదారులు కాస్త ఊరట చెందారు. వరుసగా పెరుగుతున్న రేట్లకు బ్రేక్ పండిందని అనుకున్నారు. కానీ రేటు తగ్గించినట్లు ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వినాయోగదారులకు షాక్ ఇచ్చింది. గత 16 రోజులుగా చుక్కలు చూపిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గాయని వినియోగదారులు సంబరపడే లోపే చమురు సంస్థలు.. తగ్గింది ఒక్క పైసా మాత్రమేనని వివరణ ఇచ్చింది. 

క్లరికల్‌ మిస్టేక్ వల్ల ఉదయం లీటరు పెట్రోల్‌ ధర 60పైసలు, డీజిల్‌ లీటరుకు 56పైసలు తగ్గినట్లు ప్రకటన వచ్చిందని చమురు సంస్థలు చావు కబురు చల్లగా చెప్పాయి. సాంకేతిక కారణాల వల్ల ఐఓసీ వెబ్‌సైట్‌లో తప్పులు దొర్లాయని ఐఓసీ కంపెనీ ప్రతినిధి తెలిపారు. మే 25నాటి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇవాల్టి ధరలుగా ప్రచురితమవ్వడంతో ధరలు తగ్గినట్లు భావించారని...కానీ తగ్గింది ఒక పైసా మాత్రమేనని తెలిపాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తీరుపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చమురు సంస్థలు జనంతో గేమ్స్ ఆడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

English Title
Indian Oil faux pas: Petrol, diesel prices cut by 1 paisa, not 60 paise

MORE FROM AUTHOR

RELATED ARTICLES