భారత్ - పాక్ సంబంధాలు బలపడుతాయా...విదేశాంగ మంత్రుల భేటీ ఏం సాధించనుంది ?

x
Highlights

భారత్.....పాకిస్థాన్.... ఈ రెండు దేశాల మధ్య మిత్రత్వం కంటే శత్రుత్వమే అధికంగా కొనసాగుతోంది. పాకిస్థాన్ లో సైన్యం ప్రాబల్యం అధికం కావడంతో పౌర...

భారత్.....పాకిస్థాన్.... ఈ రెండు దేశాల మధ్య మిత్రత్వం కంటే శత్రుత్వమే అధికంగా కొనసాగుతోంది. పాకిస్థాన్ లో సైన్యం ప్రాబల్యం అధికం కావడంతో పౌర ప్రభుత్వం మాటకు విలువ లేకుండా పోయింది. ఇటీవల మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలో కొత్త పౌర ప్రభుత్వం ఏర్పడింది. తాజాగా ఆయన భారత ప్రధాని మోడీకి ఒక లేఖ రాశారు. రెండు దేశాల మధ్య చర్చలను తిరిగి ప్రారంభించాలని కోరారు. అందుకు భారతదేశం కూడా సానుకూలంగా స్పందించింది. మరి రెండు దేశాల మధ్య చర్చలు సాధ్యపడుతాయా ? స్నేహసంబంధాలు బలపడుతాయా ?శాంతి ప్రయత్నాలను పాకిస్థాన్ సైన్యం సహిస్తుందా ? సరిహద్దుల్లో భారత సైనికులను అత్యంత పాశవికంగా పాక్ సైన్యం హతమార్చడాడానికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకోకుండా ఉంటుందా ? విదేశాంగ మంత్రుల భేటీ ఏం సాధించనుంది ?

పాకిస్థాన్ లో అధికార మార్పిడి జరిగిన ప్రతిసారీ భారతదేశ ప్రజానీకంలో ఒకరకమైన ఉత్కంఠ నెలకొంటుంది. ఆ ప్రభుత్వం భారత్ పట్ల అనుసరించే ధోరణి ఎలా ఉంటుందన్న ఆసక్తి ఏర్పడుతుంది. ఇటీవల పాకిస్థాన్ లో మరో సారి అధికార మార్పిడి జరిగింది. కొత్తగా ఏర్పడింది పౌర ప్రభుత్వమే అయినప్పటికీ, దాని ఏర్పాటులో సైన్యం కీలకపాత్ర పోషించింది. నిజం చెప్పాలంటే రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలకు పాకిస్థాన్ సైన్యమే ప్రధాన అడ్డంకిగా మారింది. తాజాగా పాకిస్థాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న శాంతి యత్నాలను పాక్ సైన్యం ఎంతమేరకు సహిస్తుందన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.

భారత్, పాకిస్థాన్ ల మధ్య సంప్రదింపులకు ఈసారి ఐక్యరాజ్యసమితి వేదిక కానుంది. వచ్చే వారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశం సందర్భంగా రెండు దేశాల విదేశాంగ మంత్రులు భేటీ కానున్నారు. నిజానికి రెండు దేశాల మధ్య కొంతకాలంగా సరైన సంబధాలు లేవు. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి భేటీ కావాలని నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ భేటీ కేవలం సమావేశం మాత్రమేనని, సంప్రదింపులు కావని భారత ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. చర్చలకు ఇంకా సమయం ఆసన్నం కాలేదని భారత ప్రభుత్వం భావిస్తోంది. అందుకే శాంతిసాధనలో పాకిస్థాన్ ఒక అడుగు ముందుకేస్తే, అదే స్థాయిలో భారత ప్రభుత్వం స్పందించింది.

రెండు దేశాల విదేశాంగ మంత్రులు సమావేశం కావడం శాంతి ప్రయత్నాల్లో ఓ చిన్న ముందడుగు మాత్రమే. ఉగ్రవాదంపై, సీమాంతర ఉగ్రవాదంపై భారతదేశ వైఖరిలో మార్పు వచ్చిందనుకోవడానికి వీల్లేదు. పాకిస్థాన్ లో సైన్యం పౌర ప్రభుత్వం ఆధీనంలో ఉండదు. ప్రభుత్వమే సైన్యం ఆధీనంలో ఉంటుంది. భారతదేశంతో శాంతి నెలకొనడం పాక్ సైన్యానికి ఇష్టం లేదు. ఆ కారణంగానే పౌర ప్రభుత్వం చేపట్టే ప్రతీ శాంతి ప్రయత్నాన్ని కూడా అది భగ్నం చేస్తుంటుంది. అవసరమైన ప్రభుత్వాలనే మార్చేస్తుంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచడం, కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం లాంటి చర్యలకు పాల్పడుతుంటుంది. తాజాగా సరిహద్దుల్లో భారతీయ సైనికుడిని పాకిస్థాన్ సైన్యం అత్యంత దారుణంగా హతమార్చింది. ఇవన్నీ కూడా పాకిస్థాన్ పౌర ప్రభుత్వానికి హెచ్చరిక సంకేతాల్లాంటివే. ఈ హెచ్చరికలను పట్టించుకోకుండా ముందుకెళ్ళడం పాకిస్థాన్ పౌర ప్రభుత్వానికి కష్టమే.

అంతర్జాతీయంగా పాకిస్థాన్ పై ఉగ్రవాద ముద్ర ఉంది. ఆ ముద్రను చెరిపేసుకునేందుకు అది ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే సార్క్ శిఖరాగ్ర సదస్సు నిర్వహణకు ప్రయత్నిస్తోంది. ఆ సదస్సుకు భారత్ హాజరయ్యేలా చేసేందుకు కృషి చేస్తోంది. తాజాగా ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని మోడీకి రాసిన లేఖలో కూడా సార్క్ సదస్సు గురించి ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య శాంతి చర్చలను తిరిగి ప్రారంభించేందుకు ఈ సదస్సు వీలు కల్పిస్తుందని ఆ లేఖలో పేర్కొన్నారు. భారతదేశం మాత్రం సార్క్ శిఖరాగ్ర సదస్సు కు హాజరయ్యే ఉద్దేశంతో లేదు. అందుకు పరిస్థితులింకా పరిపక్వం కాలేదనే భావిస్తోంది. సార్క్ లోని ఇతర సభ్య దేశాలు కూడా ఈ సదస్సు కు దూరంగానే ఉండే అవకాశం ఉంది. భారత్ తో స్నేహ సంబంధాలను పునరుద్ధరించుకోవడం ద్వారా సార్క్ సదస్సు నిర్వహించే యోచనలో పాకిస్థాన్ ఉంది. 2014లో చివరిసారిగా సార్క్ సమావేశం జరిగింది. 2016లో పాకిస్థాన్ సార్క్ శిఖరాగ్ర సదస్సు ను నిర్వహించాల్సి ఉండింది. అదే ఏడాది సెప్టెంబర్ 18న జమ్మూ కశ్మీర్ లో భారత సైనిక శిబిరంపై ఉగ్రదాడి జరిగింది. ఆ నేపథ్యంలో భారత్ సార్క్ సదస్సుకు హాజరు కావద్దని నిర్ణయించుకుంది. బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్ఘనిస్థాన్ కూడా సదస్సుకు హాజరు కావద్దని భావించిన నేపథ్యంలో అది రద్దయింది. పాకిస్థాన్ వైఖరి మారని పక్షంలో ఈ దఫా కూడా అలానే జరిగే అవకాశం ఉంది.

కొన్నేళ్ళుగా భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను పాకిస్థాన్ ప్రోత్సహిస్తూ వచ్చింది. ఆ కారణంగా ఆ దేశంతో అధికారిక చర్చలకు భారతదేశం దూరంగా ఉంటోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిళ్ళ నేపథ్యంలో పాకిస్థాన్ తిరిగి భారతదేశంలో శాంతి చర్చలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తోంది.

ఉగ్రవాదులను పాకిస్థాన్ ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ఇటీవల అమెరికా తన సాయం నిలిపివేసింది. పాకిస్థాన్ పై ఒత్తిడి పెంచాల్సిందిగా అమెరికాలోని పలువర్గాలు అక్కడి ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం భారతదేశంతో శాంతి చర్చలకు ప్రాధాన్యం ఇస్తోంది. శాంతి చర్చలతో అంతర్జాతీయ సమాజంలో తన పై పడిన ఉగ్రముద్రను చెరిపివేసుకోవాలని భావిస్తోంది. దీంతో భారతదేశం పాకిస్థాన్ ఉచ్చులో చిక్కుకోకుండానే, తనదైన వ్యూహంతో ముందుకెళ్తోంది. సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం అకృత్యాలను, కశ్మీర్ లో ఉగ్రవాదుల బీభత్సాన్ని పాక్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళేందుకు విదేశాంగ మంత్రుల భేటీని వేదికగా చేసుకోవాలనుకుంటోంది. 2015 నుంచి భారత్, పాకిస్థాన్ ల మధ్య చర్చలు నిలిచిపోయాయి.

ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు తీసుకోవాల్సిన చర్యలను అమెరికా సూచించింది. పాకిస్థాన్ మాత్రం ఆ చర్యలను తీసుకోవడంలో విఫలమైంది. అమెరికా పాలనా యంత్రాంగం తాజాగా విడుదల చేసిన నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. పాకిస్థాన్ కేంద్రంగా వివిధ ఉగ్రవాద సంస్థలు విదేశాల్లో తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని ఈ నివేదిక పేర్కొంది. ఈ నివేదిక లో పేర్కొన్న అంశాల ఆధారంగా అమెరికా పాకిస్థాన్ పై మరింత ఒత్తిడి పెంచే అవకాశం ఉంది.

అంతర్జాతీయంగా శాంతి నెలకొనడంలో దక్షిణాసియా కీలకంగా మారింది. పాకిస్థాన్ ఉగ్రవాదుల అడ్డాగా మారింది. పొరుగునే ఆప్ఘనిస్థాన్ ఉగ్రభూతాన్ని ఎదుర్కొంటోంది. మరో వైపున బర్మా కూడా ఉగ్ర ముప్పుతో సతమతమవుతోంది. ఈ మూడు దేశాల ఉగ్రవాదులు అంతర్జాతీయ ఉగ్రవాదంతో సంబంధాలను కలిగి ఉండడం యావత్ ప్రపంచానికి ఆందోళన కలిగిస్తోంది. మోడీ వివిధ దేశాలు పర్యటించి పాకిస్థాన్ కుతంత్రాలను ఆయా ప్రభుత్వాలకు వివరించడం కూడా అంతర్జాతీయంగా పాకిస్థాన్ పై ఒత్తిడి పెంచింది. అది నేటికీ కొనసాగుతోంది. దీంతో భారతదేశంతో స్నేహ సంబంధాలను మెరుగుపర్చుకోవడం పాకిస్థాన్ కు తప్పనిసరి అవసరంగా మారింది. అయితే పౌర ప్రభుత్వం ప్రయత్నాలకు పాకిస్థాన్ సైన్యం ఎంతమేరకు సహకరిస్తుందన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories