హైదరాబాద్ ఎన్నిక రణరంగం.. పట్నం ప్రజలు పట్టం కట్టేది ఎవరికో..?

హైదరాబాద్ ఎన్నిక రణరంగం.. పట్నం ప్రజలు పట్టం కట్టేది ఎవరికో..?
x
Highlights

ఓ వైపు అధికార పక్షం, మరోవైపు మహా కూటమి, ఇంకోవైపు బీజేపీ, అటువైపు మజ్లిస్‌. రాజధాని రాజకీయ సమరాంగణంపై నలుదిక్కులా నాలుగు రాజకీయ సేనలు మోహరించాయి....

ఓ వైపు అధికార పక్షం, మరోవైపు మహా కూటమి, ఇంకోవైపు బీజేపీ, అటువైపు మజ్లిస్‌. రాజధాని రాజకీయ సమరాంగణంపై నలుదిక్కులా నాలుగు రాజకీయ సేనలు మోహరించాయి. ఎన్నికల్ని సమర్థంగా ఎదుర్కొనడానికి సర్వ సన్నద్ధమై బరిలో నిలిచాయి. నామినేషన్ల పర్వం ముగియడం... అభ్యర్థులెవరో నిర్దిష్టంగా తేలిపోవడంతో హైదరాబాద్‌ గడ్డపై ఉత్కంఠ రాజకీయ పోరుకు తెరలేచింది. వ్యూహ ప్రతివ్యూహాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, సభలు, సమావేశాలతో రసవత్తరంగా మారిన గ్రేటర్‌ రాజకీయంలో ఏ పార్టీ ధీమా ఆ పార్టీదే. ఏ పార్టీ వ్యూహాలు ఆ పార్టీవే. అన్నింటి లక్ష్యం ఒక్కటే.. ఎన్నికల్లో సత్తా చాటడం. గద్దెనెక్కడం!! మరి గ్రేటర్‌ ఓటరు ఏమనుకుంటున్నాడు.? ఎవరు అధికారంలోకి వస్తే అభివృద్ధికి దిక్సూచీగా ఉంటుందని భావిస్తున్నారు.?

రాజధాని హైదరాబాద్‌ రాష్ట్రానికే తలమానికం. ఇక్కడ సత్తా చాటుకోవడం ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకం. వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించి బలం నిరూపించుకోవాలన్న పోరాటం. అందుకే గ్రేటర్‌ పరిధిలో విస్తరించిన 16 నియోజకవర్గాల్లో ఓట్లను ఒడిసిపట్టేందుకు అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ఎంఐఎం, టీఆర్ఎస్‌, బీజేపీలు ఒంటరిగా బరిలో దిగుతుండగా కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ మహాకూటమిగా ఏర్పడి ప్రజల ముందుకెళ్తున్నాయి.

గత ఎన్నికల్లో ప్రభావం చూపిన పార్టీలు కొన్ని. ప్రాభవం కోల్పోయిన పార్టీలు కొన్ని. పట్టు సాధించుకున్న పార్టీలు ఇంకొన్ని. ఇలా రాజధానిలో పూర్వ వైభవం సాధించేందుకు ఎవరి వ్యూహాలు మారివే. 16 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులెవరో క్లారిటీ రావడంతో ఓట్లను ఒడిసిపట్టుకునే వ్యూహానికి పార్టీలు పదునుపెడుతున్నాయి. మొత్తానికి రసవత్తరంగా మారిన రాజధాని రాజకీయంలో పట్టు కోసం ప్రధాన పార్టీల ఎత్తుగడ వేస్తున్నాయి.అదే సమయంలో బలం చాటుకునేందుకు టీఆర్‌ఎస్‌, బీజేపీలు ఆరాటపడుతున్నాయి.

మరి నియోజకవర్గాల్లో బలాబలాలేం చెబున్నాయో చూద్దాం. ఖైరతాబాద్‌ నియోజకవర్గం. ఇక్కడి నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మళ్లీ బరిలో నిలుస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి ఓడిపోయి, టీఆర్‌ఎస్‌లో చేరిన దానం నాగేందర్‌ పోటీలో తలపడుతున్నారు. తకాంగ్రెస్‌ టికెట్‌ను దాసోజు శ్రవణ్‌ దక్కించుకున్నారు. అంబర్‌పేట. ఇక్కడి నుంచి కూడా బీజేపీ అభ్యర్థిగా, ఆ పార్టీ శాసనసభా పక్ష మాజీ నేత కిషన్‌రెడ్డి మరోమారు నిలిచారు. ఇక్కడి నుంచి కాలేరు వెంకటేష్‌, కూటమి పొత్తులో భాగంగా టికెట్‌ దక్కించుకున్న టీజేఎస్‌ నుంచి నరేష్‌ బరిలో నిలిచారు.

ఇక జూబ్లీహిల్స్‌. ఇక్కడ పోరు నువ్వా-నేనా అన్నట్టగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతసారి ఇక్కడి నుంచి టీడీపీ తరఫున గెలిచిన మాగంటి గోపీనాథ్‌ ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. 2014లో ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి ఓడిపోయిన పీజేఆర్‌ కుమారుడు విష్ణువర్దన్‌రెడ్డికి పార్టీ టికెట్‌ దక్కింది. బీజేపీ నుంచి శ్రీధర్‌రెడ్డి రంగంలో నిలిచారు. ముషీరాబాద్‌. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌కు ఆ పార్టీ అధిష్ఠానం మళ్లీ టికెట్‌ కేటాయించింది. టీఆర్‌ఎస్ ‌నుంచి గత ఎన్నికల్లో ఓడిపోయిన ముఠా గోపాల్‌కే టికెట్‌ దక్కింది. కాంగ్రెస్‌ నుంచి సికింద్రాబాద్‌ మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ కుమారుడు, రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ బరిలో దిగారు.

గోషామహల్. ఇక్కడ కూడా పోటాపోటీ వాతావరణమే కనిపిస్తోంది. గోషామహల్‌ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బీజేపీ టికెట్‌ కేటాయించింది. ఈసారీ గెలుపు తనదేనని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి, సీనియర్‌ నాయకుడు ముఖేష్‌గౌడ్‌ పోటీకి సిద్ధమయ్యారు. ఎలాగైనా ఈసారి కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలన్న పట్టుదలతో ఆయన ముందుకెళ్తున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి ప్రేమ్‌సింగ్‌రాథోడ్‌‌కు టికెట్‌ దక్కింది.

చార్మినార్‌. యాఖుత్‌పురా తాజా మాజీ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ ఇప్పుడు చార్మినార్‌ ఎంఐఎం అభ్యర్థిగా బరిలో నిల్చారు. ఇక్కడ హోటల్స్‌ అధినేత మహ్మద్‌ గౌస్‌‌కు కాంగ్రెస్‌ టికెట్‌ దక్కింది. టీఆర్ఎస్‌ నుంచి మహ్మద్‌సలావుద్దీన్‌ పోటీ పడుతున్నారు. ఇక బహదూర్‌పురా. ఇక్కడి నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే మహ్మద్‌ మొజంఖాన్‌కు ఎంఐఎం మరోసారి అవకాశం కల్పించింది. టీఆర్ఎస్‌ తన అభ్యర్థిగా మీర్‌ ఇనాయత్‌ అలీఖాన్‌ను ప్రకటించింది. కాంగ్రెస్‌ నుంచి కాలేం బాబా, బీజేపీ నుంచి అనీఫ్‌అలీ పోట పడుతున్నారు.

వాయిస్9: సనత్‌నగర్‌. సనత్‌నగర్‌ నుంచి గతసారి టీడీపీ తరఫున గెల్చిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌... ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అదే స్థానం నుంచి మళ్లీ ఆయన తలపడనున్నారు. కూటమి పొత్తులో భాగంగా సీటు దక్కించుకున్న టీడీపీ నుంచి కూన వెంకటేశంగౌడ్, బీజేపీ నుంచి భవర్‌లాల్‌వర్మ బరిలో నిలిచారు. ఇక సికింద్రాబాద్‌. రాష్ట్ర మంత్రి టి.పద్మారావు మరోసారి ఇక్కడి నుంచి టీఆర్ఎస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్‌ తరఫున కాసాని జ్ఞానేశ్వర్‌, బీజేపీ నుంచి సతీష్‌గౌడ్‌ పోటీపడుతున్నారు.

కంటోన్మెంట్‌. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన సాయన్న ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పటికే నాలుగుసార్లు ఇక్కడి నుంచి గెల్చిన ఆయన మరోసారి విజయం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ పోటీ చేయబోతున్నారు. బీజేపీ నుంచి శ్రీగణేష్‌ బరిలో నిలిచారు.

చాంద్రాయణగుట్ట. ఎంఐఎం అభ్యర్థిగా ఆ పార్టీ నేత, తాజా మాజీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ మరోసారి పోటీ చేయబోతున్నారు. ఇక్కడ ఆయనకు గట్టి పోటీ ఇవ్వాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. అక్బరుద్దీన్‌ ప్రత్యర్థిగా కాంగ్రెస్‌ నుంచి ఇసాబినోబైద్‌ మిస్త్రీ, బీజేపీ నుంచి కమలం అస్త్రం సయ్యద్‌ షహజాది, టీఆర్ఎస్‌ నుంచి ఎం.సీతారామిరెడ్డి హోరాహోరిగా తలపడనున్నారు.

ఇక నాంపల్లిలో రసవత్తర పోరు కనిపిస్తోంది. నాంపల్లి నుంచి ఎంఐఎం అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌ పోటీ చేస్తున్నారు. గతసారి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయి ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరిన ఫిరోజ్‌ఖాన్‌కు హస్తం టికెట్‌ దక్కించుకున్నారు. టీఆర్ఎస్‌ నుంచి ఆనంద్‌గౌడ్‌, తన అభ్యర్థిగా ప్రకటించింది. ఇక్కడ టీఆర్ఎస్‌, ఎంఐఎంలది స్నేహపూర్వక పోటీ అని చెబుతున్నారు. ఇక బీజేపీ నుంచి దేవర కరుణాకర్‌ బరిలో నిలిచారు.

కార్వాన్‌. ఇది ఎంఐఎం అడ్డా. ఈ నియోకవర్గంలో ఎంఐఎం అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే కౌసర్‌ మొహియుద్దీన్‌ను ఆ పార్టీ మళ్లీ బరిలో నిలిపింది. ఇక్కడ మైనార్టీ ఓటింగ్‌ అధికంగా ఉండంతో తన గెలుపు సులభమేనని కౌసర్‌ భావిస్తున్నారు. గతంలో ఇక్కడ ఓడిపోయిన టీఆర్ఎస్‌ అభ్యర్థి జీవన్‌సింగ్‌కు ఆ పార్టీ మరోసారి టికెట్‌ కేటాయించింది. బీజేపీ తరఫున పార్టీ నేత అమర్‌సింగ్‌ బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ టికెట్‌ను ఉస్మాన్‌బిన్‌ మహ్మద్‌ అలీ హజ్రీ దక్కించుకున్నారు.

యాఖుత్‌ఫురా. ఇక్కడ సరికొత్త రాజకీయం కనిపిస్తోంది. చార్మినార్‌ తాజా మాజీ ఎమ్మెల్యే సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రీకి ఎంఐఎం ఈసారి యాఖుత్‌పురా నియోజకవర్గ సీటును కేటాయించింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సామా సుందర్‌రెడ్డిని ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. కాంగ్రెస్‌ నుంచి రాజేందర్‌రాజు, బీజేపీ నుంచి రూప్‌రాజ్‌లు పోటీ చేస్తున్నారు.

ఇక మలక్‌పేట. లక్‌ కోసం పార్టీల ప్రయత్నం చేస్తున్నాయి. మలక్‌పేట తాజా మాజీ శాసనసభ్యుడు అహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా బలాలాను ఎంఐఎం మళ్లీ తన అభ్యర్థిగా ప్రకటించింది. మైనార్టీల ఓట్లు అధికంగా ఉండటంతో మరోసారి విజయం సాధించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్‌ అభ్యర్థిగా గతంలో ఓడిపోయిన చెవ్వా సతీష్‌కుమార్‌కే ఈసారీ ఆ పార్టీ టికెట్‌ దక్కింది. కాంగ్రెస్‌ నుంచి ముజఫర్‌ అలీఖాన్‌, బీజేపీ నుంచి ఆలె జితేందర్‌ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

కిందటసారి ఎన్నికల్లో హైదరాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 7 సీట్లు దక్కించుకున్న ఎంఐఎం... అదనంగా మరో స్థానాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. 2014లో టీఆర్ఎస్‌ సికింద్రాబాద్‌లో మాత్రమే నెగ్గింది. టీడీపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకొన్నారు. వీరితో పాటు మొత్తం పది మందికి టికెట్లు కేటాయించిన టీఆర్ఎస్‌.. చాకచక్యంగా ముందుకెళ్తూ... బీజేపీపాటు గతంలో టీడీపీ పట్టున్న నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

హైదరాబాద్‌లో గతసారి బీజేపీ నాలుగు స్థానాలను దక్కించుకుంది. ఈసారి ఒంటరిగా బరిలో నిలిచి, ఎక్కువ సీట్లు సాధించాలన్న పట్టుదలతో ఉంది. నలుగురు తాజా మాజీలకు అవే స్థానాలను కేటాయించిన కాషాయ పార్టీ... ఈసారి వ్యక్తిగత ప్రతిష్ఠకే పెద్ద పీట వేసింది.

శాసనసభ ఎన్నికలకు కౌంట్‌డౌన్ షురూ అయింది. గ్రేటర్‌లో రాజకీయ వేడి రాజుకుంటోంది. బస్తీలు, కాలనీలలో పాదయాత్రలు, ర్యాలీలతో పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నాయి. ఓటర్ నాడిని తెలుసుకుంటూ అనుచరులు, కార్యకర్తలతో బరిలో నిలిచే అభ్యర్థులు మంతనాలు జరుపుతున్నారు. వారి వారి నియోజకవర్గాలను చుట్టేస్తున్న అభ్యర్థులు... ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు రెడీ అవుతున్నారు. పాతబస్తీలో పట్టు కోసం ఇతర పార్టీలు పాకులాడుతుంటే... పకడ్బందీ వ్యూహంతో పట్టు జారకుండా మజ్లిస్‌ మంత్రాంగం నడుపుతోంది. మొత్తంగా పాతబస్తీ రాజకీయం ఏం చెబుతుందో మా ప్రతినిధి రమణ అందిస్తారు.

విశ్వనగరాభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన అభివృద్ధి, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తాయన్నది గులాబీల ధీమా. సీట్ల లెక్కలు, పొత్తుల తిప్పలతో కడదాక ఉత్కంఠగా సాగిన కూటమిలో... ప్రభుత్వ వ్యతిరేకతే గెలిపిస్తుందన్న ఆశ కనపడుతోంది. చాపకింద నీరులా కమలం వికసించే మార్గాలను అన్వేషిస్తున్నాయి బీజేపీ శ్రేణులు.. మొత్తం గ్రేటర్‌లో అందరి దృష్టి కేంద్రీకరించిన ఖైరతాబాద్‌ ఏం చెబుతోందో ఇప్పుడు చూద్దాం.

ఇక గ్రేటర్‌వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఇంటింటి ప్రచారం, పాదయాత్రలు ఒకవైపు, మరోవైపు కలిసివచ్చే నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తూ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడం మరోవైపు.. సెటిలర్ల స్థానాలపై స్పెషల్‌ కాన్సంట్రేషన్‌ చేస్తున్న పార్టీలు... నూతనోత్తేజాన్ని నింపుతూ అందరినీ ఒక్క తాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గ్రేటర్‌లో సెటిలర్లు ప్రభావితం చేయబోయే నియోజకవర్గాల్లో అసలు నిజాలేంటో మా ప్రతినిధి రమణ ద్వారా తెలుసుకుందాం.

మొత్తంగా పథకాలే ప్రచార అస్త్రాలుగా టీఆర్‌ఎస్‌ సర్కార్‌ వ్యతిరేకాస్త్రాలుగా కూటమి... ఆ రెండు పార్టీలపై ఉన్న అసంతృప్తే ఆయుధంగా కమలం పాతబస్తీ పట్టు జారకుండా మజ్లిస్‌ వీళ్లందరి మధ్యలో స్వతంత్రులు ఇలా ఎవరికి వారు సత్తా చాటుకునేందుకు సమాయత్తం అవుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories