మహానగరంలో మాయగాళ్లు...పూజల పేరుతో మోసం.. నగలతో జంప్

x
Highlights

మహిళల అమాయకత్వమే వాళ్ల ఆస్తి.. పూజలు వాళ్ల పెట్టుబడి.. చిన్న దుకాణాలే టార్గెట్‌. మంచి జరిగేలా చేస్తామని మాటలు కలుపుతారు. బంగారాన్ని రెట్టింపు...

మహిళల అమాయకత్వమే వాళ్ల ఆస్తి.. పూజలు వాళ్ల పెట్టుబడి.. చిన్న దుకాణాలే టార్గెట్‌. మంచి జరిగేలా చేస్తామని మాటలు కలుపుతారు. బంగారాన్ని రెట్టింపు చేస్తామని ఆశ చూపుతారు. అత్యాశకు పోయామో అంతే సంగతులు. మన ముందే మాయ చేసి నిండా ముంచేస్తారు. అలా ఇద్దరు దోపిడీ దొంగలు సైబరాబాద్‌లో ఏడు చోట్ల ఒకే తరహా దోపిడీకి పాల్పడి దాదాపు 30 తులాల మంగళసూత్రాలతో ఉడాయించారు. సైబరాబాద్‌ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్‌, నార్సింగి, పహడీషరీఫ్‌, శంషాబాద్‌ పరిధిలోని పెద్దషాపూర్‌ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు.

మైలార్‌దేవ్‌పల్లిలోని బందావన్‌కాలనీలో సంతోషి అనే మహిళ కిరాణ దుకాణం నిర్వహిస్తోంది. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆ దుకాణం వద్దకు వచ్చి గుడి ఎక్కడ ఉందని ఆమెను అడిగారు. అగరబత్తులు కొనుక్కొని గుడికి వెళ్ళినట్లు నటించి తిరిగి దుకాణం దగ్గరకు వచ్చారు. గుడి మూసి ఉందని చెప్పారు. ఇటీవల తాము దేవున్ని మొక్కకుంటే మంచి జరిగిందని, తమ తరఫున గుడి పూజారికి వెయ్యి ఇవ్వాలని అగరబత్తులు ఉన్న కవర్‌లో 5 వంద రూపాయల నోట్లు, ఒక 500 నోటు పెట్టి సంతోషికి ఇచ్చారు. అది చూసి వీరు భక్తిపరులు అయి ఉండవచ్చని నమ్మిన సంతోషి ఆ డబ్బులు తీసుకుంది.

కిరాణ షాపు యజమానురాలికి వెయ్యి రూపాయలు ఎరగా వేసిన ఆ యువకులు... మంచి జరగాలంటే ఎలా పూజలు చేయాలో తమకు తెలుసని, కావాలంటే మీకూ చెప్తామని నమ్మించారు. యువకుల మాటలు నిజమేనని నమ్మింది. అందుకు బంగారు ఆభరణాలు కావాలని చెప్పడంతో సరేనని తన మెడలో ఉన్న నాలుగు తులాల మంగళసూత్రాన్ని తీసి కవర్‌పై ఉంచింది. పూజలు చేసినట్లు నటించిన ఆ ఇద్దరు యువకులు మంగళసూత్రాన్ని డబ్బులపై పెడుతున్నట్లు పెట్టి దృష్టి మరల్చి పూజలు చేసిన అనంతరం ఆ కవర్‌ను ఆమెకు ఇచ్చేశారు. గంట తర్వాత తెరిచి చూడాలని చెప్పారు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులు వెళ్ళిన అనంతరం కవర్‌ను తెరిచి చూసిన కిరాణ షాపు యజమానురాలు షాక్‌కు గురైంది. బంగారు మంగళసూత్రం లేకపోవడంతో తాను మోసపోయానని తెలుసుకుంది. కుటుంబ సభ్యులతో కలసి మైలార్‌దేవుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈమెలాగే కిస్మత్‌పూర్‌లో నిర్మల అనే మహిళ దగ్గరకు వెళ్లి ఇదే విధంగా చెప్పారు. ఆమె కూడా తన మెడలో ఉన్న ఒక వరస మంగళసూత్రాన్ని తీసి ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటే అది కాదు రెండు వరసల మంగళసూత్రం కావాలని అన్నారు. దీంతో ఆమె పక్కింట్లో ఉండే మహిళ వద్దకు వెళ్ళి ఆమె మంగళసూత్రం తీసుకొచ్చి ఇచ్చింది. యవకుల మాయమాటలకు మంగళసూత్రం పోగొట్టుకున్న నిర్మల రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

12.15కు భవానీ కాలనీకి వెళ్లి అక్కడ లావణ్య అనే మహిళను ఇదే విధంగా మోసం చేశారు. మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ శ్రీసాయినగర్‌ కాలనీలో విశ్రాంత బ్యాంకు ఉద్యోగి వెంకటేశ్వర్‌ నాయక్‌ భార్య రుక్మిణి నాయక్‌ వద్దకు వచ్చి రూ.1100 చందా ఇవ్వాలని అడిగారు. తాను ఇవ్వనని అనడంతో ఆమెను కొట్టి మెడలో ఉన్న 7 తులాల మంగళసూత్రాన్ని లాక్కొని పారిపోయారు. నార్సింగిలో మందిరం నిర్మిస్తున్నామని, చందా ఇవ్వాలని స్వామీజీ వేషంలో వచ్చిన ఓ వ్యక్తి, పూజలు పేరుతో భాగ్యలక్ష్మి(60) అనే వృద్ధురాలిని మోసగించి 6 తులాల బంగారు గొలుసుతో పరారయ్యాడు.

కేవలం గంటన్నర వ్యవధిలోనే మూడు ప్రాంతాల్లో మొత్తం ఆరు చోట్ల చోరీలకు పాల్పడ్డారు. కిస్మత్ పురలో కిరాణాషాపు నిర్వహిస్తున్న నిర్మల దగ్గరకు వచ్చిన మాయగాళ్లు అక్కడికి వచ్చిన మహిళ మెడలోంచి 4 తులాల బంగారు గొలుసును మాయం చేసి ఉడాయించారు. దీంతో బాధితులు రాజేంద్రనగర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకేరోజు సైబరాబాద్‌ పరిధిలో ఒకే తరహా కేసులు నమోదు కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇద్దరిని గుర్తించారు. నిందితులను పట్టుకొనేందుకు గాలింపు చేపట్టారు. దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories